మలేషియా పర్యటన విజయవంతంగా ముగించిన మంత్రి నారాయణ
ప్రపంచ స్థాయి వ్యర్థాల నిర్వహణ, సుస్థిర నగరాల అభివృద్ధి నమూనాలపై విస్తృత అధ్యయనం
మలేషియా పర్యటన ముగించుకుని ఏపీకి బయలుదేరిన మంత్రి నారాయణ
అమరావతి/మలేషియా:
ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి పట్టణాభివృద్ధి, ఆధునిక వ్యర్థాల నిర్వహణ, అందుబాటు ధరలో గృహ నిర్మాణం వంటి అంశాల అమలుకు అవసరమైన ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు మలేషియాలో పర్యటిస్తున్న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రెండో రోజు పర్యటనను విజయవంతంగా పూర్తి చేశారు.
పర్యటనలో భాగంగా సెలాంగోర్ రాష్ట్రంలోని ప్రముఖ బుకిత్ తగర్ ఎన్విరో పార్క్‌ను మంత్రి నారాయణ సందర్శించారు. మలేషియాలోనే అతిపెద్ద శానిటరీ ల్యాండ్‌ఫిల్ ప్రాంతంగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్టులో ఘన వ్యర్థాలను పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహిస్తున్న విధానాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
వ్యర్థాలను సేకరించడం నుంచి వాటిని శాశ్వతంగా పూడ్చి పెట్టడం వరకు అమలు చేస్తున్న అత్యాధునిక సాంకేతిక విధానాలను అధికారులు మంత్రికి వివరించారు. ముఖ్యంగా వ్యర్థాల నుంచి వెలువడే ద్రవాలు భూమిలోకి చేరకుండా, భూగర్భ జలాలు కలుషితం కాకుండా, పరిసర ప్రాంతాల్లో కాలుష్యం ఏర్పడకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను ప్రత్యక్షంగా పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణను పర్యావరణ పరిరక్షణతో సమన్వయం చేస్తూ అమలు చేస్తున్న విధానాలపై మంత్రి ప్రత్యేక ఆసక్తి కనబరిచారు.
అనంతరం సౌత్ క్లాంగ్ ప్రాంతంలో 1530 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఆధునిక టౌన్‌షిప్‌ను మంత్రి నారాయణ సందర్శించారు. విస్తారమైన హరిత ప్రాంతాలు, సమగ్ర రోడ్డు నెట్‌వర్క్, ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన ఈ టౌన్‌షిప్ అభివృద్ధి నమూనాను పరిశీలించారు.
పర్యావరణ హిత సూత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ, కాలుష్య నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తూ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నగరాన్ని అభివృద్ధి చేసిన తీరును మంత్రి అధ్యయనం చేశారు. నివాస, వాణిజ్య, సామాజిక మౌలిక సదుపాయాల సమన్వయంతో రూపొందించిన పట్టణాభివృద్ధి నమూనాపై అధికారులతో చర్చించారు.
సాయంత్రం మలేషియాలో ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థలైన సన్‌వే గ్రూప్ మరియు గముడా గ్రూప్ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. సుస్థిర పట్టణాభివృద్ధి, తక్కువ ధరలో గృహ నిర్మాణం, ఆధునిక నగరాల రూపకల్పన, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా అమరావతి అభివృద్ధిలో అనుసరించదగిన ఉత్తమ పద్ధతులపై అభిప్రాయాలు పంచుకున్నారు.
మలేషియా పర్యటన సందర్భంగా పట్టణాభివృద్ధి, వ్యర్థాల నిర్వహణ, గృహ నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో అమలు చేస్తున్న అనేక ఉత్తమ విధానాలను మంత్రి అధ్యయనం చేశారు. ఈ అనుభవాలు రాష్ట్రంలో భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు.
రెండు రోజుల మలేషియా పర్యటనను ముగించుకున్న మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు. ఆయన రేపు ఉదయం హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి విజయవాడకు రానున్నారు.









































