https://crda.ap.gov.in/APCRDAV2/views/Annuity_status.aspx)
రాజధాని అమరావతి రైతులకు కౌలు సమాచారం అందుబాటులోకి.. APCRDA అధికారిక వెబ్‌సైట్‌లో వార్షిక కౌలు వివరాలు
ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికై భూసమీకరణ కింద భూములు ఇచ్చిన రైతుల సౌకర్యార్థం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(APCRDA) కీలక సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులకు అందించే వార్షిక కౌలు (Annuity) చెల్లింపుల స్థితిగతులను పారదర్శకంగా తెలియజేసే ఉద్దేశంతో పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్(https://crda.ap.gov.in/APCRDAV2/views/Annuity_status.aspx)లో పొందుపరచడం జరిగింది.
ఈ సమాచారంలో వార్షిక కౌలు జమ అయిన రైతుల వివరాలతో పాటు, ఇంకా కౌలు జమ కాని రైతుల వివరాలు, చెల్లింపులు నిలిచిపోవడానికి గల కారణాలను కూడా వెల్లడించడం జరిగింది. అలాగే NPCI (National Payments Corporation of India) వ్యవస్థలో ఇనాక్టివ్‌గా ఉన్న బ్యాంకు ఖాతాలను కలిగిన రైతుల జాబితాను సైతం అందుబాటులో ఉంచడం జరిగింది.
రాజధాని రైతులకు కౌలు చెల్లింపులు నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేయబడుతున్న నేపథ్యంలో, NPCI లింకేజీ సక్రమంగా లేకపోవడం లేదా బ్యాంకు ఖాతాలు ఇనాక్టివ్‌గా ఉండటం వంటి కారణాల వల్ల కొందరి ఖాతాలకు చెల్లింపులు జమ కావడం లేదు. అలాంటి రైతులు తమ ఖాతా ఉన్న బ్యాంకును సంప్రదించి ఖాతాలను యాక్టివ్ చేసుకోవాలని APCRDA తరపున సూచిస్తున్నాము.
QR కోడ్ ద్వారా సులభంగా వివరాలు:
రైతులు తమ వార్షిక కౌలు చెల్లింపు స్థితిని సులభంగా తెలుసుకునేందుకు APCRDA నుంచి QR కోడ్‌ను విడుదల చేయడం జరిగింది. ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే సంబంధిత వెబ్‌పేజీలో రాజధాని రైతులు తమ వివరాలను చెక్ చేసుకోవచ్చు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే కౌలు లబ్ధి సమాచారం తెలుసుకునే సౌకర్యం కల్పించబడింది. కౌలు లబ్ధి పొందని రైతులు తమ పేర్లు, ఖాతా వివరాలు.. ఏ కారణం చేత కౌలు జమ కాలేదోనన్న అంశాలను సైతం చెక్ చేసుకోవచ్చు.
ఆధార్ ఇనాక్టివ్‌గా ఉన్న బ్యాంక్ ఖాతాలలో కౌలు నగదు జమ చేయుట సాధ్యపడదు కనుక ఆధార్ ఇనాక్టివ్‌గా ఉన్న బ్యాంకు ఖాతాలు కలిగిన రైతులు వెంటనే ఆ ఖాతాలను యాక్టివేట్ చేసుకోగలరని కోరుచున్నాము.









































