-
సమాచార పౌర సంబంధాల శాఖ లో ఇద్దరు అధికారులకు ఘన వీడ్కోలు
- సమాచార పౌర సంబంధాల శాఖ లో 34 ఏళ్లపాటు సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ చేసిన అకౌంట్స్ ఆఫీసర్ పి. సుదర్శన్ రావు, రిసెప్షనిస్ట్ కె. స్వామి శేఖర్ లకు ఘన సన్మానం నిర్వహించారు.
స్థానిక పండిట్ నెహ్రూ బస్టేషన్ ప్రాంగణంలో ఉన్న డా. నందమూరి తారకరామారావు పరిపాలనా భవనం రెండవ అంతస్థు లోని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకుల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మూడు దశాబ్దాలకు పైగా నిబద్ధతతో, అంకితభావంతో విశిష్ట సేవలందించిన ఇద్దరు అధికారులు ఉద్యోగ విరమణ చేశారు. గణాంక విభాగంలో అకౌంట్స్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించిన పి. సుదర్శన్ రావు, రాష్ట్ర సమాచార కేంద్రంలో రిసెప్షనిస్ట్ గా సేవలందించిన కె. స్వామి శేఖర్ లు వారి 34 సంవత్సరాల సుదీర్ఘ ప్రభుత్వ సేవను విజయవంతంగా పూర్తి చేసి పదవీ విరమణ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, సహాయ సంచాలకులు, ఇంజనీరింగ్ విభాగ అధికారులు, గణాంక విభాగ అధికారులు పలువురు ఉన్నతాధికారులు, సుదర్శన్ రావు, కె. స్వామి శేఖర్ లు తమ సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో క్రమశిక్షణ, నిబద్ధత, బాధ్యతాయుత సేవాభావంతో శాఖకు విశేష సేవలందించారని కొనియాడారు. ప్రభుత్వ సమాచారాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో వారు నిర్వహించిన పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. వారి అనుభవం, సేవలు శాఖకు చిరస్థాయిగా మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. వారి అనుభవాలను, మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. పదవీ విరమణ అనంతరం వారి జీవితం ఆయురారోగ్యాలతో, ఆనందోత్సాహాలతో, కుటుంబ సభ్యుల మధ్య సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
పదవీ విరమణ పొందిన ఇద్దరు అధికారులను శాఖ తరపున శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.
కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్లు ఐ. సూర్యచంద్ర రావు, షేక్. మహబూబ్ భాషా, పి. తిమ్మప్ప, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఓ. మధుసూధన, డిప్యూటీ డైరెక్టర్లు పి. వెంకట్రాజు గౌడ్, డి. రమేష్, కె. నారాయణ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్లు ఏఎస్ వీరభద్రరావు, పి. రాజశేఖర్, ఎస్వీ మోహన్ రావు, డా. కే. తిరుపాలయ్య, జేఏవో నాగరాజు, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ (ఎఫ్ఏసీ) పి. కిరణ్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ వివిధ విభాగాల అధికారులు, ప్రాంతీయ అధికారులు, వారి కుటుంబ సభ్యులు, అకౌంట్స్ అధికారుల సంఘం ప్రతినిధులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















































