బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడింపుపై దృష్టి
- దేశ, రాష్ట్రాభివృద్ధికి ఉపకరించేలా రేర్ ఎర్త్ మినరల్స్ అభివృద్ధి
- అదానీ ప్రతినిధుల బృందం భేటీలో సీఎం చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 12:-
ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా ఉన్న బీచ్‌శాండ్ మినరల్స్‌కు విలువ జోడించి, దేశ అవసరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి రాకుండా రాష్ట్రంలోనే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇందుకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పారు.
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ ఎండీ కరణ్ అదానీ నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో బుధవారం రాష్ట్ర సచివాలయంలో భేటీ అయింది. శ్రీకాకుళం జిల్లాలో రూ.16 వేల కోట్ల పెట్టుబడితో అదానీ గ్రూప్ ఏర్పాటు చేసే టైటానియం ప్లాంట్ ఏర్పాటు… బీచ్ శాండ్ మైనింగ్, ఏయే ఉత్పత్తులు వస్తాయి.. వాటిని ఏయే రంగాల్లో వినియోగిస్తారు… వాటికున్న డిమాండ్ వంటి అంశాలను అదానీ ప్రతినిధుల బృందం సీఎంకు వివరించింది. బీచ్ శాండ్లో లభ్యమయ్యే ఇల్మెనైట్ మినరల్ కు కు విలువ జోడించి.. టైటానియం స్లాగ్, TiO₂, టైటానియం స్పాంజ్ వంటివి ఉత్పత్తి చేయవచ్చని అదానీ గ్రూప్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. పెయింట్స్, కోటింగ్స్, కాస్మెటిక్స్, ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్, యూవీ రక్షణ ఉత్పత్తులు వంటి వాటిల్లో TiO₂ను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… రాష్ట్రంలోనే ఖనిజాల విలువను పెంచేలా వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
బీచ్‌శాండ్ మినరల్స్‌ను కేవలం ముడి ఖనిజంగా వెలికి తీయడమనే అంశంగానే కాకుండా… వాటి ద్వారా రాష్ట్రానికి, దేశానికి గరిష్ఠ ప్రయోజనం కలిగేలా మొత్తం విలువ ఆధారిత శ్రేణిని అభివృద్ధి చేయాలని సూచించారు. రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో దేశం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు అన్నారు. రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్ అనేది నేషన్ బిల్డింగ్ కు ఉపకరించేలా ఉండాలని.. అలాగే రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేలా చూడాలని సూచించారు.
రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో రాష్ట్రానికి అందుబాటులో ఉన్న వనరులు, అవసరమైన సాంకేతికత, సరైన టెక్నాలజీ భాగస్వాములను గుర్తించడంపై దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. ఈ మొత్తం ప్రక్రియ దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడేలా ఉండాలని స్పష్టం చేశారు. విశాఖలో తాము ఏర్పాటు చేయబోయే ఇందులో స్కిల్ డెవలప్‌మెంట్, అదానీ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ స్కూల్, అదానీ ఆరోగ్య మందిర్ పేరుతో 1,000 పడకల ఆసుపత్రి, 150 సీట్ల మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. అదానీ డేటా సెంటర్, ఐటీ పార్క్ నిర్మాణాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ వివరాలను అదానీ గ్రూప్ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, గనుల శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



















































