రెండేళ్లలో ఏపీకి క్యూ కట్టిన పరిశ్రమలు
• రెండేళ్ల పాలనలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం
• ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్రాండ్‌తోనే ఇది సాధ్యం
• 20 లక్షల ఉద్యోగాలు మా బాధ్యత
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ గుప్తా
అమరావతి,జూన్ 30:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి టి.జి.భరత్ గుప్తా తెలిపారు. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధించే సంస్కృతికి కూటమి ప్రభుత్వం పూర్తిగా చరమగీతం పాడిందని ఆయన స్పష్టం చేశారు.కేవలం రెండేళ్ల స్వల్ప కాలంలోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని, రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ ద్వారా ఏకంగా రూ.7.66 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను క్లియర్ చేసి గ్రౌండింగ్‌కు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.రాష్ట్రంలో కల్పించబోయే ఉద్యోగాలను ఆధార్‌తో అనసంధానం చేస్తున్నట్లు తెలిపారు.మంగళవారం సెక్రటేరియట్‌లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ అధికారులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి టి.జి భరత్ పారిశ్రామిక, గ్రీన్ ఎనర్జీ,ఆహార శుద్ధి రంగాలలో సాధించిన చారిత్రక విజయాలను సుదీర్ఘ వివరణలతో మీడియా ముందుంచారు.రాష్ట్రంలో భూ కేటాయింపుల ప్రక్రియను పారిశ్రామికవేత్తలకు అత్యంత సులభతరం చేస్తూ ల్యాండ్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులను మంత్రి వివరించారు.గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని,గతంలో ఒక పరిశ్రమ స్థాపించాలంటే అర ఎకరం భూమి కోసం కూడా నెలల తరబడి క్యాబినెట్ చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఆ విధానాన్ని రద్దు చేస్తూ 50 ఎకరాల లోపు ల్యాండ్ అలాట్‌మెంట్ ఫైల్స్ ఇకపై ఏపీఐఐసీ క్లియర్ చేసేలా జీవో తెచ్చామన్నారు.ఈ సరళీకరణ వల్ల పరిశ్రమలకు విజయవంతంగా భూ కేటాయింపులు పూర్తి చేశామని తెలిపారు.అదే సమయంలో పరిశ్రమల పేరుతో భూములు తీసుకుని పనులు ప్రారంభించకుండా లాక్ చేసి పెట్టుకుంటే ప్రభుత్వం ఊరుకోదని కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.ఇటీవలి కాలంలోనే 900 నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 ఎం.ఎస్.ఎంఈ పార్కులు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.ఇంటింటికీ ఒక పారిశ్రామివేత్తను తయారుచేయాలన్న లక్ష్యంతో తాము పని చేస్తున్నట్లు చెప్పారు.గత ప్రభుత్వం ఏర్పడిన సమయంలో రాష్ట్రంలో 16 వేల ఫ్యాక్టరీలు ఉంటే ఏడాదికేడాది అవి తగ్గిపోతూ వచ్చాయన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ అనేది తమకు కేవలం రాజకీయ నినాదం కాదని, ఐదేళ్లలో సాధించి తీరాల్సిన ఒక చారిత్రక బాధ్యతని మంత్రి స్పష్టం చేశారు.అందుకే భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కేవలం ఉద్యోగాల కల్పన, నిరంతర పర్యవేక్షణ కోసమే ఒక ప్రత్యేక మంత్రివర్గ ఉప సంఘం రాత్రింబవళ్లు పనిచేస్తోందన్నారు.వైజాగ్ గూగుల్ AI డేటా సెంటర్, అమరావతి క్వాంటం వ్యాలీ మరియు ఎలక్ట్రానిక్స్ హబ్‌ల వంటి మెగా ప్రాజెక్టులన్నీ శరవేగంగా గ్రౌండ్ అవుతున్నాయని, దీనివల్ల అనుకున్న ఐదేళ్ల కాలంలో 20 లక్షల కంటే ఎక్కువే ఉద్యోగ అవకాశాలు లభించడం ఖాయమన్నారు.కొత్త పరిశ్రమలు తేవడంతో పాటు, ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల సమస్యలను నిరంతరం సమీక్షిస్తూ, సెంట్రల్ లెవెల్ క్లియరెన్సులు సైతం రాష్ట్ర ప్రభుత్వమే సార్ట్ అవుట్ చేస్తూ పారిశ్రామికవేత్తలకు పూర్తి కాన్ఫిడెన్స్ ఇస్తున్నామని తెలిపారు.
త్వరలో ప్రత్యేక ‘ఏపీ టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ’, రాష్ట్రాన్ని ఫర్నిచర్ హబ్‌గా మార్చే ‘ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ పెద్ద ఇండస్ట్రియల్ పార్కులలో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల వసతి కొరకు అత్యాధునిక మౌలిక వసతులతో కూడిన ‘ఇండస్ట్రియల్ హౌసింగ్ పాలసీ’ లు త్వరలోనే అమలులోకి రానున్నాయని మంత్రి ప్రకటించారు.ఆహార శుద్ధి రంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన తిరుగులేని ప్రగతిని, ముఖ్యమంత్రి “సీడ్ టు ప్లేట్” (విత్తనం నుండి విస్తరి వరకు) ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్ విజన్‌ను వివరించారు.ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే 50 శాతం తీసుకొచ్చామన్నారు.వీటి ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.భారతదేశం మొత్తం ఉత్పత్తి అయ్యే కోకో బీన్స్‌లో ఏకంగా 50శాతం వాటా మన ఆంధ్రప్రదేశ్‌దేనని చెప్పారు.అదేవిధంగా కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతంలో రైతులు టమాటోలను రోడ్డుపై పారబోసే పరిస్థితి లేకుండా,కేంద్ర-రాష్ట్ర 50:50 భాగస్వామ్యంతో కూడిన ఆపరేషన్ గ్రీన్స్ కింద నిర్మిస్తున్న భారీ టమాటో ప్రాసెసింగ్ ప్లాంట్ త్వరలో ప్రారంభం అవుతుందన్నారు.కేంద్ర ప్రభుత్వ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానం సాధించిందని, కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన ఐఐటి తిరుపతి ఇన్క్యుబేషన్ సెంటర్ లో మ్యాంగో, టమాటో, సిట్రస్ ప్రాసెసింగ్ విజయవంతంగా నడుస్తోందని చెప్పారు.వచ్చే నెల కల్లా పూర్తి కాబోయే అనకాపల్లి ప్లాంట్ లో జాక్ ఫ్రూట్ (పనసపండు), మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్లను స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ఫెసిలిటీస్‌తో అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు.
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలతో జరిపిన నిరంతర చర్చల వల్ల అంతర్జాతీయంగా రాష్ట్ర ప్రతిష్ట అమాంతం పెరిగిందని మంత్రి టి.జి. భరత్ పేర్కొన్నారు.ఏ ఇతర రాష్ట్రం చేయనంతగా ఏపీని ప్రమోట్ చేశామన వివరించారు.ఆర్సెలార్ మిట్టల్ అధినేత ఆదిత్య మిట్టల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ ప్రెసిడెంట్, గూగుల్ సీఈఓల వంటి గ్లోబల్ లీడర్లు ఏపీ లీడర్‌షిప్, పారదర్శక పాలసీలపై స్వచ్ఛందంగా ప్రశంసల వర్షం కురిపిస్తూ అధికారిక టెస్టిమోయల్స్ ఇవ్వడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.’విజన్ 2047′ లో భాగంగా వరల్డ్ బ్యాంక్ నీతి ఆయోగ్ సాయంతో విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను 3 మేజర్ ఎకనామిక్, రీజియన్స్‌గా డెవలప్ చేస్తున్నామని, ఇందులో భాగంగా వైజాగ్ ఎకనామిక్ రీజియన్ కింద 200 ఎకరాల విస్తీర్ణంలో 3 భారీ ఫుడ్ పార్కులను నెలకొల్పుతున్నామని, జేఎస్‌డబ్ల్యూ పార్కులో కూడా మెగా యూనిట్ వచ్చేలా చర్చలు జరిగాయని తెలిపారు.100 శాతం ఆహార దిగుమతులపై ఆధారపడే దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన ‘ఫుడ్ సప్లై హబ్’ గా మార్చేందుకు దుబాయ్ మంత్రులతో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయని, దేశ రాజధానిలో జరిగిన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ లోనూ ఏపీ స్టాల్‌కు అంతర్జాతీయంగా అద్భుత రెస్పాన్స్ వచ్చిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఈ ఏడాది నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్’ ను నిర్వహించబోతోందని తెలిపారు.దీని ప్రమోషన్ కోసం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా,అహ్మదాబాద్ లతో పాటు విదేశాల్లోనూ భారీ రోడ్ షోలు నిర్వహించబోతున్నామని మంత్రి వెల్లడించారు.అలాగే గిరిజన ప్రాంతాల వరప్రసాదమైన, అంతర్జాతీయంగా భౌగోళిక గుర్తింపు పొందిన ‘అరకు కాఫీ’ క్రేజ్‌ను గ్లోబల్ మార్కెట్‌లో మరింత అగ్రెసివ్‌గా వాడుకుంటూ, గిరిజన రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చేలా దీని ఎంటైర్ వాల్యూ చైన్‌ను అంతర్జాతీయ బ్రాండింగ్‌ను సరికొత్త గ్లోబల్ వింగ్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి టి.జి. భరత్ స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నారని, నాయకుడు మారడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కనిపిస్తోందన్నారు.కేవలం సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్ ద్వారా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు.గత ప్రభుత్వ పాలనకు కూటమి ప్రభుత్వ పాలనకు మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ విదేశాల్లోని పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించామన్నారు.ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారన్నారు.పార్టనర్ షిప్ సమ్మిట్లో వచ్చిన పెట్టుబడుల్లో ఇప్పటికే 40 శాతానికి పైగా గ్రౌండింగ్ అవుతున్నాయన్నారు.ప్రతి ఒక్క కంపెనీతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించే దిశలో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు.రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడుల్లో వచ్చిన ఉద్యోగాల జాబితాను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసే ప్రక్రియ జరుగుతోందని త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఈమీడియా సమావేశంలో పారిశ్రామిక మరియు వాణిజ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్.యువరాజ్, ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి,ఎపిఐఐసీ ఎండీ దినేష్ కుమార్,ఇండస్ట్రీస్ శాఖ డైరక్టర్ ఎస్.బన్సాల్, ఫుడ్ ప్రాసెసింగ్ సోసైటీ సీఈవో జి.శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.















































