కోనసీమ కొబ్బరి రైతులకు అండగా ప్రభుత్వం
- – దెబ్బతిన్న ప్రతి కొబ్బరి చెట్టు స్థానంలో కొత్త మొక్క నాటడమే లక్ష్యం
– ఒక్కో మొక్కకు రూ.1,000 సాయం..
– కాలువల్లో పూడికతీతతో ఉప్పునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
– కొబ్బరి తోటల్లో అంతర పంటలతో రైతులకు అదనపు ఆదాయం
– శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి/వెలగపూడి, ఆగస్ట్ 18:
కోనసీమలో కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు తాత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ, బండారు సత్యానందరావులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, దెబ్బతిన్న ప్రతి కొబ్బరి చెట్టు స్థానంలో కొత్త మొక్క నాటించడంతో పాటు కాలువలు, డ్రెయిన్ల పూడికతీత ద్వారా సమస్య మూలాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో 1.18 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతుండగా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే 0.36 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగవుతోందని మంత్రి తెలిపారు. కోనసీమ జిల్లాలో సుమారు 10 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు కౌలు రైతుల ద్వారా సాగవుతున్నాయని వివరించారు.
గత ఐదేళ్లుగా కాలువల్లో సక్రమంగా పూడికతీత చేపట్టకపోవడంతో సముద్రపు ఉప్పునీరు బ్యాక్ వాటర్ రూపంలో వెనక్కి వచ్చి నేలలో లవణీయత పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. దీని ప్రభావంతో పైకి ఆరోగ్యంగా కనిపించే కొబ్బరి చెట్లు కూడా అకస్మాత్తుగా కుంగిపోయి చనిపోతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమస్యను తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించానని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. దెబ్బతిన్న ప్రతి కొబ్బరి మొక్క స్థానంలో కొత్త మొక్క నాటేందుకు ఒక్కో మొక్కకు రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. కొత్త మొక్కలు నాటడంతోనే సమస్య పరిష్కారం కాదని మంత్రి స్పష్టం చేశారు. కాలువలు, డ్రెయిన్లలో పూడిక తొలగించకుండా ఎన్ని మొక్కలు నాటినా, ఎంత పెట్టుబడి పెట్టినా ఆశించిన ఫలితం ఉండదన్నారు. అందుకే సమస్యకు మూలమైన డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మొదటి విడతలో శంకరగుప్తం కాలువ పనులకు నిధులు కేటాయించామని, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే శంకుస్థాపన చేశారని తెలిపారు. ఈ పనులు పూర్తయితే రెండు, మూడు నియోజకవర్గాల్లో ఉప్పునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. మిగిలిన కాలువలను కూడా ఒక సమగ్ర ప్రాజెక్టుగా చేపట్టి శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
కొబ్బరి రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. కొబ్బరి అభివృద్ధి మండలి (CDB) సహకారంతో 2017-18 నుంచి 2024-25 వరకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 5,250 హెక్టార్లను పథకం పరిధిలోకి తీసుకొచ్చినట్లు వివరించారు. కొత్త కొబ్బరి తోటల విస్తరణకు హెక్టారుకు రూ.56 వేల సబ్సిడీని రెండేళ్లలో రూ.28 వేల చొప్పున రెండు సమాన వాయిదాల్లో అందిస్తున్నామన్నారు. ఉద్యానవన తోటల విస్తరణకు సంబంధించిన కార్యక్రమం కింద గుంటలు తవ్వడం, మొక్కలు నాటడం, సాగు పరికరాలు తదితరాలకు మూడు సంవత్సరాల పాటు హెక్టారుకు రూ.2,47,950 వరకు ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందన్నారు. కోనసీమలో కొబ్బరి రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక ప్రాంతీయ కొబ్బరి బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని 2024లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ కేంద్ర మంత్రికి లేఖ రాశారని మంత్రి గుర్తుచేశారు. కేంద్రంలోని కొబ్బరి బోర్డు సహకారంతో కొత్త ప్లాంటేషన్లను ప్రోత్సహించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కొబ్బరి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అంతర పంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. పామాయిల్ తోటల్లో మాదిరిగానే కొబ్బరి తోటల్లో కోకో, అరటి, కూరగాయలు వంటి అంతర పంటలు సాగు చేస్తే రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందన్నారు. ఈ దిశగా వ్యవసాయ, ఉద్యానవన శాఖల ద్వారా రైతులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కోనసీమలో దెబ్బతిన్న ప్రతి కొబ్బరి చెట్టు స్థానంలో కొత్త మొక్క నాటించాలన్నదే మా లక్ష్యం. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా దీనికి ఒక నిర్దిష్ట కాలపరిమితి పెట్టుకుని పనిచేస్తాం. కొత్త మొక్కలు నాటించడంతో పాటు ఉప్పునీటి సమస్యకు కారణమైన కాలువలు, డ్రెయిన్ల సమస్యను కూడా పరిష్కరించి కొబ్బరి రైతులకు శాశ్వత భరోసా కల్పిస్తాం అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.






















































