గత ప్రభుత్వ విధ్వంసకర విధానాల నుంచి ఎక్సైజ్ రంగాన్ని గాడిలో పెట్టాం
- •పారదర్శకత, నాణ్యత, వినియోగదారుల స్వేచ్ఛ, ప్రభుత్వ ఆదాయ వృద్ధి లక్ష్యంగా సమూల సంస్కరణలు
•రెండేళ్లలో ఎక్సైజ్ రంగంలో చారిత్రాత్మక మార్పులు సాధించాం
రాష్ట్ర ఎక్సైజ్, గనులు & భూగర్భశాఖ మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి, జూన్ 15:
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఎక్సైజ్ రంగాన్ని గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు, విధానపరమైన వైఫల్యాలు, పారదర్శకత లేమి తీవ్రంగా దెబ్బతీశాయని రాష్ట్ర ఎక్సైజ్, గనులు & భూగర్భశాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రజల అభిరుచులు, మార్కెట్ అవసరాలు, ప్రభుత్వ ఆదాయ ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి అమలు చేసిన విధానాల వల్ల రాష్ట్ర ఎక్సైజ్ వ్యవస్థ విశ్వసనీయత కోల్పోయిందని ఆయన అన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్సైజ్ రంగ పునరుద్ధరణను అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తించి, సమగ్ర సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. గతంలో ఏర్పడిన అవ్యవస్థను సరిదిద్దడంతో పాటు, పారదర్శకత, సాంకేతికత, వినియోగదారుల స్వేచ్ఛ, నాణ్యత నియంత్రణ, ఆదాయ వృద్ధి అనే ఐదు అంశాలపై ఆధారపడి కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
ప్రజల ఆరోగ్యం – ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం…
ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పారదర్శక పాలన, అక్రమాల నిర్మూలన, ప్రభుత్వ ఆదాయ వృద్ధి అనే నాలుగు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ఎక్సైజ్ వ్యవస్థను దేశంలోనే ఆదర్శవంతమైన వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గతంలో జరిగిన విధానపరమైన లోపాలను సరిదిద్దుతూ, ప్రజల ప్రయోజనాలను కేంద్రబిందువుగా ఉంచుకుని సంస్కరణల ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ విధానాలు – ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం…
గత ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో మద్యం విక్రయ వ్యవస్థను పూర్తిగా కేంద్రీకరించి, మార్కెట్ డిమాండ్‌ను పక్కనబెట్టి కొద్ది బ్రాండ్లకు మాత్రమే ప్రాధాన్యత కల్పించారని మంత్రి విమర్శించారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లను రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చేయడం ద్వారా వినియోగదారుల ఎంపిక హక్కును కాలరాసారని అన్నారు. ప్రజలకు కావలసిన బ్రాండ్లు దొరకని పరిస్థితి నెలకొనడంతో అక్రమ సరఫరా వ్యవస్థలు పెరిగాయని, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వ విధానాలు ప్రజల అవసరాల కోసం కాకుండా కొందరి ప్రయోజనాల కోసం పనిచేశాయనే అభిప్రాయం అప్పట్లో విస్తృతంగా వ్యక్తమైందన్నారు.
ఆన్‌లైన్ వ్యవస్థను నిర్వీర్యం చేసి అవకతవకలకు అవకాశం…
మద్యం సరఫరా, పంపిణీలో పారదర్శకతను తీసుకువచ్చే ఆన్‌లైన్ OFS (Online Order for Supply) వ్యవస్థను నిర్వీర్యం చేసి, మాన్యువల్ విధానాలకు ప్రాధాన్యం ఇచ్చారని మంత్రి తెలిపారు. షాపులు కోరిన బ్రాండ్లకు బదులుగా అధికార యంత్రాంగం నిర్ణయించిన బ్రాండ్లను బలవంతంగా సరఫరా చేయడం వల్ల మార్కెట్ సహజ వ్యవస్థ దెబ్బతిందన్నారు. ఈ విధానం కారణంగా డిమాండ్ ఉన్న బ్రాండ్లు కొరతకు గురవగా, వినియోగదారులకు ఇష్టంలేని ఉత్పత్తులు మార్కెట్‌లోకి ప్రవేశపెట్టబడ్డాయని చెప్పారు. ఇది ప్రభుత్వ ఆదాయానికి కూడా ప్రతికూల ప్రభావం చూపిందన్నారు.
నగదు లావాదేవీలతో పారదర్శకతకు భంగం…
గత ప్రభుత్వ కాలంలో డిజిటల్ చెల్లింపులను నిరుత్సాహపరిచి, నగదు లావాదేవీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పారదర్శకత పూర్తిగా దెబ్బతిందని మంత్రి తెలిపారు. దాదాపు రూ.99,413 కోట్ల రిటైల్ మద్యం విక్రయాల్లో కేవలం రూ.615 కోట్ల మేర మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరగడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమన్నారు. డిజిటల్ వ్యవస్థలను పక్కనబెట్టడం వల్ల ఆదాయ లీకేజీలు, అక్రమ ఆర్థిక ప్రవాహాలు, లెక్కల్లో అస్పష్టత వంటి అనేక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు.
నూతన ఎక్సైజ్ విధానం – సంస్కరణల యుగారంభం…
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎక్సైజ్ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. పారదర్శకత, పోటీ, వినియోగదారుల స్వేచ్ఛ, ప్రభుత్వ ఆదాయ వృద్ధి లక్ష్యాల ఆధారంగా నూతన ఎక్సైజ్ విధానాన్ని రూపొందించామని చెప్పారు. ప్రైవేట్ రిటైల్ వ్యవస్థను పునరుద్ధరించి, పూర్తిగా పారదర్శకమైన దరఖాస్తు మరియు లాటరీ విధానాల ద్వారా షాపుల కేటాయింపులు చేపట్టామని తెలిపారు. గతంలో ఉన్న అనధికార చెల్లింపులు, మధ్యవర్తిత్వ వ్యవస్థలకు పూర్తిగా ముగింపు పలికామని స్పష్టం చేశారు.
రికార్డు స్థాయిలో స్పందించిన దరఖాస్తుదారులు…
నూతన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియకు రాష్ట్రవ్యాప్తంగా అపూర్వ స్పందన లభించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రతి దుకాణానికి అనేక రెట్లు పోటీ నెలకొందన్నారు. ప్రభుత్వంపై, విధానంపై ప్రజలకు, వ్యాపార వర్గాలకు ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
వినియోగదారుడే కేంద్రబిందువు…
నూతన ఎక్సైజ్ విధానంలో వినియోగదారుల అభిరుచులు, మార్కెట్ డిమాండ్‌కు అత్యంత ప్రాధాన్యత కల్పించామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అందుబాటులో లేకుండా పోయిన అనేక జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లను తిరిగి రాష్ట్ర మార్కెట్‌లోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాల్లో లభ్యమవుతున్న ప్రముఖ IMFL బ్రాండ్లతో పాటు పలు ప్రీమియం, సూపర్ ప్రీమియం ఉత్పత్తులు కూడా ఆంధ్రప్రదేశ్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బీర్ విభాగంలోనే 46కు పైగా బ్రాండ్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయని, గతంలో రాష్ట్ర మార్కెట్‌లో లేని అనేక అంతర్జాతీయ బ్రాండ్లు కూడా ప్రవేశించాయని చెప్పారు. వినియోగదారులకు విస్తృత ఎంపిక అవకాశాలు కల్పించడం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను తమ అభిరుచికి అనుగుణంగా ఎంచుకునే స్వేచ్ఛను ప్రభుత్వం పునరుద్ధరించిందని మంత్రి పేర్కొన్నారు.
నాణ్యతపై రాజీపడని ప్రభుత్వం…
మద్యం నాణ్యత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన ప్రమాణాలను అమలు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో విక్రయించే ప్రతి మద్యం ఉత్పత్తిని శాస్త్రీయ ప్రమాణాల ఆధారంగా సమగ్రంగా పరీక్షించిన అనంతరమే మార్కెట్‌లోకి అనుమతిస్తున్నామని తెలిపారు. ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ENA) దశ నుంచి తుది ఉత్పత్తి వరకు ప్రతి దశలో నాణ్యత తనిఖీలు నిర్వహిస్తూ, ఉత్పత్తి ప్రక్రియలో వివిధ దశల్లో నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నామని వివరించారు. ప్రతి బ్రాండ్‌పై 13కు పైగా కీలక నాణ్యత ప్రమాణాల ఆధారంగా పరిశీలనలు చేపడుతూ, అత్యాధునిక ప్రయోగశాలల ద్వారా నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తున్నామని చెప్పారు. అవసరమైతే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రయోగశాలల సహకారాన్ని కూడా తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య భద్రతే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని మంత్రి స్పష్టం చేశారు.
కల్తీ మద్యం నిర్మూలనకు ప్రత్యేక చర్యలు…
కల్తీ మద్యం, నకిలీ బ్రాండ్లు, అక్రమ రవాణా, పన్ను ఎగవేత వంటి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్ర సరిహద్దులు, గిడ్డంగులు, రిటైల్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే కల్తీ మద్యం తయారీ, విక్రయాలపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు.
డిజిటల్ వ్యవస్థల ద్వారా ఆదాయ వృద్ధి…
ఎక్సైజ్ శాఖలో సాంకేతికత వినియోగాన్ని విస్తృతంగా పెంచామని మంత్రి తెలిపారు. డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ ట్రాకింగ్, రియల్ టైమ్ మానిటరింగ్, సరఫరా గొలుసు పర్యవేక్షణ వంటి చర్యల ద్వారా ఆదాయ లీకేజీలను అరికట్టగలిగామని చెప్పారు. దీని ఫలితంగా ప్రభుత్వ ఆదాయం పెరగడంతో పాటు వ్యవస్థపై ప్రజల విశ్వాసం కూడా బలపడిందన్నారు.
పర్యాటక రంగానికి ప్రోత్సాహం…
నూతన ఎక్సైజ్ విధానం రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికీ దోహదపడుతోందని మంత్రి పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సేవల ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పర్యాటక కార్యకలాపాలు, ఆతిథ్య రంగం అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించడంలో ఎక్సైజ్ రంగ సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ కమిషనర్ చాముకూరి శ్రీధర్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ (ఎన్‌ఫోర్సర్మెంట్) డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ పాల్గొన్నారు.














































