నెల రోజుల్లో పీపీపీ మెడికల్ కాలేజీలు పట్టాలెక్కాలి
మొదటి దశలో 4, రెండవ దశలో 6 కాలేజీల నిర్మాణం
త్వరలో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ
సంతానోత్పత్తి రేటు 2.1 చేరుకోవడమే లక్ష్యం కావాలి
రాష్ట్రమంతటా శరవేగంగా సంజీవని ప్రాజెక్టు విస్తరణ
సంజీవని, పాపులేషన్ మేనేజ్మెంట్ సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతిలో నేచురోపతి సంస్థ కోసం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం
అమరావతి, ఏప్రిల్ 22 : రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1లోని 4 మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని పనులు మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. అలాగే ఫేజ్ 2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే 7 పిల్లర్లతో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ 2026-31 త్వరలోనే తీసుకురావాలని సీఎం నిర్దేశించారు. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్, మెడ్ టెక్ ఉత్పాదనలు, స్టార్టప్-ఇన్నోవేషన్, మెడికల్ టూరిజం కింద ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ ఫెసిలిటీస్ అందించడం, స్కిల్లింగ్, అమరావతి-వీఈఆర్‌లో మెడిసిటీలు ఏర్పాటు చేయాలన్నారు. అమరావతిలో నేచరోపతి సంస్థ కేంద్ర నెలకొల్పేలా ఆయుష్ శాఖ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. సచివాలయంలో బుధవారం సంజీవని ప్రాజెక్టు, పాపులేషన్ మేనేజ్మెంట్‌పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వైద్యారోగ్య శాఖ, ఆర్ధిక, స్వర్ణ గ్రామ- స్వర్ణ వార్డు శాఖ, కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సంజీవని ప్రాజెక్టు ద్వారా లక్ష మందికి పైగా సేవలు
ప్రజలకు వైద్య ఖర్చులు భారం తగ్గించేలా ప్రివెంటివ్ హెల్త్ విధానం, సిటిజెన్ హెల్త్ స్క్రీనింగ్‌పై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ఇందుకోసం పబ్లిక్ హెల్త్ డేటాను వినియోగించుకోవాలన్నరు. సంజీవని ప్రాజెక్టు కింద ఇప్పటివరకు 1.08 లక్షల మందికి వైద్య సేవలు పొందారని, 2.8 లక్షల మందికి మందులు పంపిణీ చేయగా, 19 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సంజీవని ప్రాజెక్టు వేగంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రణాళికలు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ సేవల్ని డిజిటలైజ్ చేసినా క్షేత్రస్థాయిలో సిబ్బంది ఆశించిన స్థాయిలో పనిచేయకుంటే ఫలితాలు రావని ముఖ్యమంత్రి అన్నారు. దీనిపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ప్రజారోగ్య రక్షణకు సంబంధించి ప్రచారం జరగడం లేదని… ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గించుకునేందుకు అవకాశం కలుగుతుందని సీఎం అన్నారు. అనీమియా, డయాబెటిస్ వంటి వ్యాధులు నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సి ఉందన్నారు.
సంతానోత్పత్తిలో చిట్టచివరన విశాఖ జిల్లా
జనాభా నియంత్రణ నుంచి జనాభా సంరక్షణ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేట్ 2.1 నుంచి 1.5కి తగ్గిందని, అత్యధికంగా కడప జిల్లాలో 1.99 ఫెర్టిలిటీ రేట్ ఉంటే, అత్యల్పంగా 1.32 విశాఖపట్నంలో నమోదైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫెర్టిలిటీ రేటు 2.1 లక్ష్యంగా ముందుకు వెళ్లాలని, లక్ష్యం కన్నా 6 శాతం తక్కువలో ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. తల్లికి వందనం పాపులేషన్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో భాగమేనని చెప్పారు. మన దేశ కుటుంబ వ్యవవ్థ పటిష్టంగా ఉందని… దీనిని కాపాడుకునేందుకు మైక్రో ఫ్యామిలీ సంస్కృతి విస్తరించకుండా చూడాలన్నారు. ఉమ్మడి-పెద్ద కుటుంబాలకు అధిక ప్రోత్సాహకాలు ప్రణాళిక రూపాందించాలని సీఎం సూచించారు. జనాభా నిర్వహణ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. పాపులేషన్ మేనేజ్మెంట్‌తో పాటు… ప్రజారోగ్య రక్షణకు కార్యాచరణ చేపట్టాలన్నారు. అలాగే సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతున్నారని, పోషకాహారం-ప్రివెంటివ్ హెల్త్ పై దృష్టి పెట్టేలా చూడాలన్నారు. ఆయుర్వేద, నేచురోపతి చికిత్సా విధానాలను కూడా ప్రోత్సహించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా… ఆస్పత్రులకు వచ్చిన రోగులకు వారి రికార్డుల ఆధారంగా డైట్ ప్యాట్రన్, పోషకాహారం అందించాల్సి ఉందన్నారు.















































