ISB శిక్షణకు I&PR డైరెక్టర్ విశ్వనాథన్.. ఇన్‌చార్జిగా మల్లవరపు సూర్యతేజ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ (I&PR) డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, ఐఏఎస్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) నిర్వహిస్తున్న *11వ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ (AMPPP)*లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) గురువారం జారీ చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఆగస్టు 12 నుంచి 24 వరకు పంజాబ్‌లోని ఐఎస్బీ మొహాలీ క్యాంపస్‌లో నిర్వహించే రెసిడెన్సీ–1 కార్యక్రమంలో విశ్వనాథన్ పాల్గొంటారు. ఈ కాలంలో ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లేందుకు కూడా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అలాగే, శిక్షణా కాలాన్ని పూర్తిగా *”ఆన్ డ్యూటీ”*గా పరిగణించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
విశ్వనాథన్ శిక్షణలో పాల్గొనే 13 రోజుల పాటు ఆయన నిర్వహిస్తున్న అన్ని బాధ్యతలను 2020 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి మల్లవరపు సూర్యతేజకు పూర్తి అదనపు బాధ్యతలుగా (FAC) అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ కాలంలో I&PR శాఖ పరిపాలనా బాధ్యతలను సూర్యతేజ నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా, ఈ ప్రతిష్ఠాత్మక పబ్లిక్ పాలసీ శిక్షణా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మరికొందరు ఐఏఎస్ అధికారులు కూడా హాజరుకానున్నారు. ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ కూడా ఐఎస్బీ మొహాలీ క్యాంపస్‌లో జరిగే ఈ శిక్షణలో పాల్గొనేందుకు పంజాబ్‌కు వెళ్లనున్నారు.
ప్రజా విధానాల రూపకల్పన, పరిపాలనా సామర్థ్యాల పెంపు, పాలనలో ఆధునిక విధానాల అమలుపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించే ఈ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ దేశవ్యాప్తంగా ఐఏఎస్ అధికారులకు ప్రతిష్ఠాత్మక శిక్షణా కార్యక్రమంగా గుర్తింపు పొందింది.



















































