ఆంధ్ర రైజింగ్ స్టార్ నారా లోకేష్
” ఫార్ఛ్యూన్ ఇండియా” అనే జాతీయ ఆంగ్ల పత్రిక ఇచ్చిన” ఆంధ్ర రైజింగ్ స్టార్” అనే గుర్తింపు యువనాయకుడు ఆంధ్ర ప్రజల ఆశాకిరణం విద్య శాఖ మంత్రి నారా లోకేష్ రాజకీయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలు రాయిగా భావించవచ్చు.ప్రభుత్వ నిర్ణయాలను క్షేత్ర స్ధాయిలో ఫలితాలుగా మార్చడం, పెట్టుబడుల ప్రకటనలు వాస్తవ పరిశ్రమలుగా మారి యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ, ముందుకు సాగుతున్న లోకేష్ కు లభించిన రైజింగ్ స్టార్ ఓ గౌరవంగా భావించాలి. రాజకీయాల్లో వారసత్వం అనేది ఒక మెట్టు మాత్రమే. కానీ ఆ మెట్టుపై నిలబడి గమ్యాన్నిచేరుకోవడానికి కావాల్సిన శ్రమ, పట్టుదల ఉంటేనే చరిత్ర గుర్తిస్తుంది. అనతి కాలంలోనే రాజకీయంగా తనకంటూ ఒక గుర్తింపు సాధించిన నాయకులు బహుఅరుదుగా కనిపిస్తారు. అయితే రాష్ట్ర ఐటి, మానవవనరుల శాఖ మంత్రి, తెలుగు దేశం పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు నారా లోకేష్ ఆ కోవకే చెందుతారు.
ఇదే విషయాన్ని ప్రముఖ ఇంగ్లీషు పత్రిక “ఫార్చ్యూన్ ఇండియా” తన ఆగస్టు సంచికలో స్పష్టంచేసింది.
“ఆంధ్రాస్ రైజింగ్ స్టార్ హౌ నారా లోకేష్ “అంటూ మంత్రి ,యువనేత నారా లోకేష్ ను ప్రశంసిస్తూ ప్రచురించిన కథనం తెలుగు ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. 40 అండర్ 40 విభాగంలో లోకేష్ ను ఎపి భవిష్యత్ రాజకీయాల్లో కీలకనాయకుడిగా పేర్కొనడాన్ని చూస్తే ఆయనను తెలుగు ప్రజల ఆశాకిరణంగా అభివర్ణించవచ్చు. అంతర్జాతీయ ఆంగ్ల పత్రిక గుర్తించే స్ధాయికి ఒక నాయకుడుగా ఎదగడమంటే ఆషామాషి కాదు. 2019 కి ముందు నారాలోకేష్ ను కేవలం ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా రాజకీయపరిపక్వత లేని నాయకుడంటూ ప్రచారం చేసిన వైసీపి పార్టీలకు ఫార్ఛ్యూన్ పత్రిక ప్రచురించిన కథనమే ఒక చెంపపెట్టు లాంటిది.
యువగళం నాయకుడిగానే కాకుండా మంత్రి పనితీరుతో ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడి ఇమేజ్ కు లోకేష్ పరిమితం కాలేదు. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త “టెక్నో -పాలిటికల్ శకానికి ఆయన దారులు వేశారనే చెప్పాలి. అందుకే ఫార్ఛ్యూన్ ఇండియా ఆంగ్లపత్రిక నారా లోకేష్ ను ఆగస్టు 2026 సంచికలో ఆంధ్రప్రదేశ్ రైజింగ్ స్టార్ (ఉద్భవిస్తున్న తార) అభివర్ణించిదనడంలో సందేహం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ చేపడుతున్న విధి విధానాలు తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రంలో నూతన శకానికి నాంది పలుకుతున్నాయని ఆసంచికలో ప్రశంసిచడం ప్రధాన అంశంగా చెప్పవచ్చు.. ఐటి, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన క్షణం నుంచి నారా లోకేష్ రాష్ట్రాన్ని పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నారు.విశాఖపట్నంలో గూగుల్ ప్రాజెక్టు ఎ.పి సాంకేతిక విప్లవానికి ఒక మైలు రాయిగా నిలిచింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ , పునరుత్పాదక ఇంధనం, ఆటోమోటివ్ రంగాల్లో విదేశీ, స్వదేశీ దిగ్గజ సంస్ధల నుంచి భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయన ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 ఇండస్ట్రీయల్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తూ పరిశ్రమల స్ధాపనకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నారని ఫార్ఛ్యూన్ ఇండియా కథనం ప్రస్తుతించింది. యువగళం ద్వారా ఆయన ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం ఆయన రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన ఘట్టం. ఆ పాదయాత్ర ద్వారానే లోకేష్ ప్రజా నాయకుడిగా ఎదిగి ప్రజల హృదయాల్లో స్ధానం సంపాదించుకున్నారు.
లోకేష్ కేవలం పాతతరం రాజకీయ నాయకులకు మాత్రమే పరిమితం కాకుండా నేటి “జెన్ -జీ” యువతతో నిరంతరం మమేకమవుతున్నారు.
వారసత్వం దాటి సొంత ముద్ర దిశగా అడుగులు వేస్తూ పరిణితి చెందిన టెక్నో పొలిటిషియన్ నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రం ప్రపంచంలోనే అగ్రస్ధానంలో నిలవాలని ఆశిద్దాం.
వాసంశెట్టి సుభాష్
కార్మికశాఖ మంత్రి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

















































