రైతు సంక్షేమమే లక్ష్యం.. వ్యవసాయ రంగంలో సమూల మార్పులు
- – అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌తో రైతుల ఖాతాల్లో ₹14,664.33 కోట్లు
– AP AIMS 2.0తో 15.69 లక్షల మంది రైతులకు పారదర్శకంగా ఎరువుల పంపిణీ
– 3.20 లక్షల మందికి పైగా కౌలు రైతులకూ ఎరువులు.. అక్టోబర్ అవసరాలకు 9.20 లక్షల మెట్రిక్ టన్నులు సిద్ధం
– రెండేళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్‌కు దాదాపు ₹800 కోట్లు
– ₹1,900 కోట్ల బీమా వాటా కట్టకుండా రైతులను నష్టపరిచిన గత ప్రభుత్వం
– దమ్ముంటే వైసీపీ నేతలు సభకు వచ్చి ఐదేళ్ల పాలనపై చర్చించాలి
– శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, ఆగస్ట్ 20: రాష్ట్ర జనాభాలో దాదాపు 60 నుంచి 65 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, అందుకే రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శాసనసభలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెట్టుబడి సాయం నుంచి పంటల బీమా వరకు, ఎరువుల పంపిణీ నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ వరకు రైతుకు ప్రతి దశలో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ ద్వారా ఇప్పటివరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం ₹14,664.33 కోట్లు జమ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ₹8,903.10 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటా ₹5,761.23 కోట్లు అని వివరించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో దాదాపు 47 లక్షల మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. తణుకు నియోజకవర్గంలోనే 16,954 రైతు కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాయని చెప్పారు. DBT విధానంలో NPCI అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. ఆధార్, NPCI మ్యాపింగ్, బ్యాంకు ఖాతాల అనుసంధానం వంటి సాంకేతిక సమస్యల కారణంగా నగదు అందని అర్హులైన రైతులను గుర్తించి, వారి వివరాలను జిల్లాలకు పంపించామని చెప్పారు. ఆయా జాబితాలను రైతు సేవా కేంద్రాలతో పాటు అన్నదాత సుఖీభవ పోర్టల్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. రిజెక్టెడ్ పేమెంట్స్ సమస్యలను సరిచేసి అర్హులైన ప్రతి రైతుకు ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఎరువుల పంపిణీలో సమూల మార్పు – AP AIMS 2.0
ఎరువుల పంపిణీలో అక్రమ మళ్లింపులు, అధిక ధరలు, రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడే పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు AP AIMS 2.0 విధానాన్ని అమలు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. వాస్తవ సాగుదారు, సర్వే నంబర్, సాగు విస్తీర్ణం, పంట రకం, వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సుల ఆధారంగా రైతుకు ఎంత ఎరువు అవసరమో శాస్త్రీయంగా నిర్ధారించి సరఫరా చేస్తున్నామన్నారు. పంట అవసరాలకు అనుగుణంగా దశలవారీగా ఎరువులు అందిస్తున్నామని చెప్పారు. AP AIMS ద్వారా ఇప్పటివరకు 15.69 లక్షల మంది రైతులకు పారదర్శకంగా ఎరువులు అందించామని మంత్రి వెల్లడించారు. కౌలు రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని, ఇప్పటివరకు 3,20,880 మంది కౌలు రైతులకు ఎరువులు అందించినట్లు వివరించారు. ప్రారంభంలో రైతులు ఎదుర్కొన్న OTP సమస్యలను పరిష్కరించి ప్రస్తుతం బయోమెట్రిక్ వేలిముద్ర ద్వారా కూడా ఎరువులు పొందే అవకాశం కల్పించామని చెప్పారు. రైతు సేవా కేంద్రాల్లో సహాయక వ్యవస్థతో పాటు హెల్ప్‌డెస్కులు, కాల్‌సెంటర్ల ద్వారా రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. CSCల ద్వారా ఉచిత ప్రీ-బుకింగ్ సౌకర్యాన్ని కల్పించామని, ఇందుకోసం ప్రతి లావాదేవీకి CSCకి ప్రభుత్వం ₹15 చెల్లిస్తోందని వివరించారు. రాష్ట్రంలో ఎరువుల కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 2026 అక్టోబర్ వరకు అంచనా అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం 9.20 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇందులో 3.69 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 89 వేల మెట్రిక్ టన్నుల DAP అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. రైతుకు అవసరమైన సమయంలో అవసరమైన ఎరువు అందించేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో పనిచేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం కృష్ణా, కాకినాడ జిల్లాల్లో చేపట్టిన పైలట్ విధానంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన AP AIMS విధానం సమర్థవంతమైన ఫలితాలు ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించే స్థాయికి ఈ వ్యవస్థ చేరిందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కింద ₹12,500 ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేవలం ₹7,500 మాత్రమే ఇచ్చి రైతులను మోసం చేసిందని అచ్చెన్నాయుడు విమర్శించారు.
గత ఐదేళ్లలో భూసార పరీక్షలు, వ్యవసాయ యాంత్రీకరణ, సకాలంలో విత్తనాల సరఫరా, మార్కెట్ ఇంటర్వెన్షన్ వంటి కీలక వ్యవసాయ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నింటినీ ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. రైతులకు ఉచిత భూసార పరీక్షలు, వ్యవసాయ యాంత్రీకరణకు ప్రోత్సాహం, నియోజకవర్గాల వారీగా ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు.
ధరలు పడితే చూస్తూ కూర్చోలేదు.. ₹800 కోట్లతో అండ
పంటల ధరలు పడిపోయినప్పుడు రైతును మార్కెట్‌కు వదిలేయకుండా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుందని మంత్రి తెలిపారు. గడిచిన రెండేళ్లలో పొగాకు, ఉల్లిపాయలు, మామిడి, కోకో, టమోటా, చీని, తదితర పంటల రైతులను ఆదుకునేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా దాదాపు ₹800 కోట్ల మేర సాయం అందించామని వెల్లడించారు. పంట పండించడం రైతు బాధ్యత అయితే.. ధర పడిపోయినప్పుడు రైతుకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. పంటల బీమా విషయంలో గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్రానికి చెల్లించాల్సిన సుమారు ₹1,900 కోట్ల బీమా వాటాను చెల్లించకపోవడంతో రాష్ట్ర రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులకు పంటల బీమా రక్షణ కల్పించేందుకు నమోదు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రైతు చెల్లించాల్సిన వాటా అత్యంత స్వల్పంగా ఉందని, ఉదాహరణకు కోనసీమలో సుమారు ₹70, కర్నూలులో సుమారు ₹32 వరకు మాత్రమే రైతు వాటా ఉండగా, మిగిలిన ప్రీమియం భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తున్నాయని వివరించారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి రైతు నమోదు చేసుకునేలా చొరవ తీసుకోవాలని మంత్రి కోరారు.
50 లక్షల ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయమే లక్ష్యం
రసాయనిక ఎరువుల విచక్షణారహిత వినియోగాన్ని తగ్గించి శాస్త్రీయంగా అవసరమైన మేరకే ఎరువులు వినియోగించేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమం ద్వారా అధికారులు నేరుగా రైతుల వద్దకు వెళ్లి AP AIMS సహా ఆధునిక వ్యవసాయ విధానాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. వైసీపీ నేతలు శాసనసభకు వచ్చి రైతుల సమస్యలపై చర్చించకుండా బయట కూర్చొని ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శించడం విడ్డూరంగా ఉందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏం చేశారో చెప్పండి. దమ్ముంటే సభకు రండి. మీ ఐదేళ్ల పాలనలో రైతులకు ఏం చేశారో మీరు చెప్పండి.. ఈ రెండేళ్లలో మేం ఏం చేశామో చెబుతాం. ఎవరు రైతుకు అండగా నిలిచారో ప్రజలే నిర్ణయిస్తారు అని వైసీపీ నేతలకు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. పెట్టుబడి సాయం నుంచి పంటల బీమా వరకు.. విత్తనం నుంచి ఎరువు వరకు.. భూసార పరీక్ష నుంచి యాంత్రీకరణ వరకు.. పంట ఉత్పత్తి నుంచి గిట్టుబాటు ధర వరకు రైతుకు ప్రతి అడుగులో అండగా నిలవడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ విధానం అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

























































