సీరతున్ నబీ మురసం ఆధ్వర్యంలో ఎందుకు?
————————————–
పాశ్చాత్య సామ్రాజ్యవాద శక్తులు, దేశీయ ఫాసిస్టు శక్తులు ఒక పధకం ప్రకారం ఇస్లామోఫోబియాను, ముస్లిం ఫోబియాను పెంచి పోషించాయి.నేడు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంపై జరుగుతున్న దాడులకు కారణం ఇదే.మంచి చెడు ఒకటి కాజాలవు.మీరు చెడును ఉత్తమమైన మంచితో గెలవండి అని పవిత్ర ఖుర్ఆన్ చెప్తుంది.చెడు ప్రచారం ఉప్పెనలా ముంచుకొస్తుంటే దానికి ప్రత్యామ్నాయంగా మంచిని వ్యాప్తి చేయాల్సిన గురుతర బాధ్యతను ముస్లిం సమాజం విస్మరించటం ఒక వెనుకబాటుతనం.తెలుగు సాహిత్యంలో చాలా మంది ముస్లిం కవులమని చెప్పుకుంటారు.ప్రవక్త మీద ఓ కవితో,వ్యాసమో రాయటానికి గజగజ వణికిపోతారు.తమని ఎక్కడ మతవాదులని సాహిత్యంలో అణగతొక్కుతారనే భయం.మరికొంత మందిలో తమ ప్రోగ్రెసివ్ ముద్రలు చెరిగిపోతాయేమోనని భయం.ఇన్నేసి భయాలతో జీవించే వీరు మళ్లీ తమను తాము ముస్లిం కవులమని చెప్పుకుంటారు.మానవ సమాజానికి సామాజిక సమానత్వం, ఆర్ధిక సమానత్వం,, విశ్వమానవ ఐక్యత,మహిళల హక్కులు వితంతువులు,అనాధల గురించి బోధించటమే గాక ఆచరించి చూపిన ప్రవక్త ముహమ్మద్ (స) అనుయాయులమనుకునే వారు సాహిత్య రంగంలో ఉన్నప్పుడు ఓ కవితో,వ్యాసమో, కొన్ని అక్షరాలో ప్రవక్త స జీవితంపై రాయటం కనీసం బాధ్యత కాదా?
మరీ ఇంత ఫోబియా ఎందుకు ? నిజానికి ప్రవక్త స బోధించిన ప్రోగ్రెసివ్ విలువల్ని మనం పాటిస్తున్నామా?లేదా!అనేది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.మేం సాహిత్య రంగంలో పెద్ద ప్రోగ్రెసివ్ అని చెప్పుకునేవారు ప్రవక్త స ఆచరించిన ప్రోగ్రెసివ్ విలువల్లో కనీసం ఒక్క శాతం ఐనా ఆచరించిన దాఖలాలున్నాయా? ప్రవక్త స ప్రోగ్రెసివ్ అని ప్రైవేట్ మాటల్లో చెప్పేవారికి ప్రవక్త స గురించి నాలుగు మాటలు రాయటానికి బెరుకెందుకు?
ముస్లిం సమాజం రెండు రకాల సమస్యలను ఎదుర్కొంటుంది.బయటినుండి వచ్చే పీడన, అణిచివేత,రెండోది అంతర్గత మతఛాందసం.ఉష్ట్ర పక్షి ఇసుకలో తలదూర్చి బయటి ప్రపంచాన్ని చూడనట్లు మతఛాందసవాదులు బయటి సమాజాల్ని,బయటి ప్రపంచాన్ని చూడటం లేదు.తమ ఇస్లామియా సంస్కృతిని కాపాడుకుంటూనే చుట్టూ ఉన్న పీడిత సమాజాల్తో మమేకం కావడం లేదు.ఆధునిక కాలంలో తమ విశ్వాసాలను కాపాడుకుంటూనే ఎలా ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగాలో అర్ధం చేసుకోవటం లేదు.
నిజానికి తీవ్రవాదాలు ముస్లిం సమాజానికి తీరని నష్టం చేసాయి.దీని వెనుక ఉన్నది అమెరికన్ సామ్రాజ్యవాదులు, దాని తాబేదార్లు పాక్ పాలకులు.ఇవి సృష్టించిన హింసను వ్యతిరేకించటంతో పాటు మతసామరస్యానికి, మానవజాతి ఐక్యతకు, అన్ని కులాల,అన్ని మతాల పీడిత ప్రజల పక్షాన మురసం తన సాహిత్యాన్ని విస్తరిస్తుంది.మురసం మత రాజ్యం కోరుకోవడం లేదు.మతమే సమస్తం అని చెప్పడం లేదు.కానీ ఇస్లామోఫోబియాను జయించటం ముస్లిం కవులు,రచయితల కనీసం కర్తవ్యం…
ఇస్లాం శాంతిని బోదించిందని ,ప్రవక్త స ప్రేమను బోధించారని చెప్పటం రాజ్యాంగ విరుద్ధం కాదు.భారత రాజ్యాంగ విలువలకు, సెక్యులర్ విలువలకు కట్టుబడి మనం ప్రయాణం చేస్తూనే ఇప్పటికైనా మహా ప్రవక్త జీవితంపై మీకు నచ్చిన సాహిత్య ప్రక్రియలో నాలుగక్షరాలు రాయండి.ప్రవక్త శాంతిని, సామరస్యాన్ని,ప్రేమను బోధించారని చాటి చెప్పండి… అందుకే మురసం రాష్ట్రవ్యాప్తంగా మీలాదున్ నబీ సందర్భంగా సీరతున్ నబీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

























































