అమరావతి
రుషికొండ ప్యాలెస్‌ను ప్రజల సందర్శనతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారుస్తాం: మంత్రి కందుల దుర్గేష్
విశాఖపట్నంలోని రుషికొండ భవనాల (ప్యాలెస్) సద్వినియోగంపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ
భేటీలో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు వర్చువల్ గా హాజరైన మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
5 భేటీల సారాంశంతో కూడిన తుది నివేదికను త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందిస్తామని ప్రకటన… సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ అంశాన్ని రాష్ట్ర కేబినెట్ ముందు ఉంచి తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొన్న మంత్రి దుర్గేష్
గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ప్యాలెస్ నిర్వహణకే నెలకు రూ. 25 లక్షల ప్రజాధనం ఖర్చు కావడంపై మంత్రి దుర్గేష్ ఆవేదన
అమరావతి: విశాఖపట్నంలోని రుషికొండ భవనాలను (ప్యాలెస్)ను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశగా చర్చలు జరిగాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విశాఖపట్నంలోని రుషికొండ భవనాల (ప్యాలెస్) సద్వినియోగంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం వెలగపూడి సచివాలయంలో 5వ సారి సమావేశమైంది. పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వర్చువల్ గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రుషికొండ భవనాలను కేవలం ప్రభుత్వ ఆస్తిగా ఉంచకుండా ప్రజల సందర్శనకు అనుమతించి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరే మార్గాలను అన్వేషిస్తున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. సీఆర్ జెడ్ నిబంధనల ప్రకారం హిల్ టాప్ పైన 2400 చదరపు మీటర్లు, కొండ కింద మరో 2400 చదరపు మీటర్లు.. వెరసి 4800 చదరపు మీటర్ల భూమి అందుబాటులో ఉందని కమిటీ ప్రాథమికంగా గుర్తించిందన్నారు. దీని ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా, ప్రాపర్ యుటిలైజేషన్ చేసే దిశగా కమిటీ ఆలోచిస్తుందన్నారు. ఈ భవనాల నిర్వహణకు తాజ్, ఎట్మాస్పియర్ కోర్, లీలా, ఫెమా వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ హోటల్ గ్రూపులు ఆసక్తిని కనబరిచాయన్నారు.. ఇతర ఆసక్తిగల సంస్థలను కూడా ఆహ్వానించే అంశంపై కమిటీ చర్చించిందన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల నిర్మించిన ఈ ప్యాలెస్ నిర్వహణ, విద్యుత్ ఛార్జీల కోసమే నెలకు సుమారు రూ. 25 లక్షల ప్రజా ధనం ఖర్చవుతోందని, ఇది ఖజానాపై మోయలేని భారమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన 5 భేటీల సారాంశంతో కూడిన తుది నివేదికను త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ అంశాన్ని రాష్ట్ర కేబినెట్ ముందు ఉంచి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కమిటీ తరపున మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

















































