రూ.62.20 కోట్ల సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ
– భూసార పరిరక్షణకు కూటమి ప్రభుత్వ ప్రాధాన్యం
– రైతులకు పెట్టుబడి భారం తగ్గించి అధిక దిగుబడులే లక్ష్యం
– పచ్చిరొట్ట సాగుతో నేల సారం పెంపు, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు
– వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, జూన్ 02:
రైతు సంక్షేమం, భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయాభివృద్ధికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్–2026 సీజన్‌లో పచ్చిరొట్ట పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రైతులకు అవసరమైన మద్దతు అందిస్తోందని పేర్కొన్నారు. పచ్చిరొట్ట పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.62.20 కోట్ల సబ్సిడీని కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 91,918 క్వింటాళ్ల విత్తనాలను జిల్లాలకు కేటాయించగా, అందులో జీలుగ 50,311 క్వింటాళ్లు, జనుము 21,291 క్వింటాళ్లు, పిల్లి పెసర 20,316 క్వింటాళ్లు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే 40,459 క్వింటాళ్ల విత్తనాలను జిల్లాలకు సరఫరా చేయగా, 19,667 మంది రైతులకు 5,687 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేసి రూ.4.76 కోట్ల సబ్సిడీ ప్రయోజనాన్ని అందించినట్లు చెప్పారు.
పచ్చిరొట్ట పంటలు నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి వివరించారు. ఈ పంటలను భూమిలో కలపడం ద్వారా సేంద్రియ కార్బన్ శాతం పెరగడంతో పాటు నత్రజని నిల్వలు అధికమవుతాయని తెలిపారు. దీనివల్ల రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గి, రైతుల సాగు వ్యయం నియంత్రణలో ఉండటమే కాకుండా భూముల ఉత్పాదకత కూడా గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. సహజ, సేంద్రియ వ్యవసాయ విధానాల పట్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పచ్చిరొట్ట సాగుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తోందన్నారు. గ్రామ స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ పంటల ప్రాముఖ్యతను వివరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహానికి రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు.
కృష్ణా, గుంటూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, ఏలూరు, బాపట్ల, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది రైతులు ఇప్పటికే లబ్ధి పొందినట్లు మంత్రి వెల్లడించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాల సరఫరాను మరింత పెంచి పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వ్యవసాయాన్ని కేవలం జీవనాధార రంగంగా కాకుండా ఆదాయాన్ని పెంచే రంగంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నాణ్యమైన విత్తనాల పంపిణీ, సబ్సిడీ పథకాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, నీటి వనరుల సమర్థ నిర్వహణ, భూసార పరిరక్షణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. భూమి ఆరోగ్యంగా ఉంటే రైతు అభివృద్ధి చెందుతాడు.. రైతు అభివృద్ధి చెందితే రాష్ట్రం పురోగమిస్తుంది అనే సంకల్పంతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో అమలు చేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.















































