అమరావతి:
వి.ఐ.టి – ఏ.పి విశ్వవిద్యా
లయంలో మొట్టమొదటి అమరావతి అంతర్జాతీయ ఫిడే (FIDE) రేటింగ్ చదరంగ పోటీలు ప్రారంభం
ఆంధ్ర చెస్ అసోసియేషన్ (ACA) సహకారంతో విఐటి-ఏపీ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న మొట్టమొదటి విఐటి -ఏపీ అమరావతి అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ 2026 ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించబడుతున్న అతిపెద్ద అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లలో ఇది ఒకటి.
ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌ను ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. గౌరవ అతిథిగా ఈగిల్ సెల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆకే రవి కృష్ణ హాజరయ్యారు. అలాగే గుంటూరు జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ వకుల్ జిందాల్, గుంటూరు ఈగిల్ సెల్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ నగేశ్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు డా|| ఎ. సురేష్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఛైర్మన్ కె.వి.వి. శర్మ, ఆంధ్ర చెస్ అసోసియేషన్ కార్యదర్శి కె. జగదీష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ టోర్నమెంట్‌లో రెండు ప్రధాన ఫిడే (FIDE) రేటెడ్ అంతర్జాతీయ పోటీలు నిర్వహించబడుతున్నాయి. అవి:
విఐటి-ఏపి అమరావతి ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2026 (జూన్ 1–5)
విఐటి-ఏపి అమరావతి ఇంటర్నేషనల్ అండర్-18 అన్‌రేటెడ్ ప్లేయర్స్ చెస్ టోర్నమెంట్ 2026 (జూన్ 6–8)
ఈ రెండు పోటీలకు కలిపి మొత్తం రూ. 30 లక్షల నగదు బహుమతులు అందించనున్నారు.
భారతదేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా 1,000 మందికి పైగా క్రీడాకారులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే అమెరికా సహా పలు దేశాలకు చెందిన క్రీడాకారులు నమోదు చేసుకోగా, మరింత అంతర్జాతీయ భాగస్వామ్యం ఉండనుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, చెస్ అనేది వ్యూహాత్మక ఆలోచన, క్రమశిక్షణ, సహనం మరియు నిర్ణయ సామర్థ్యాలను పెంపొందించే ఆట. ఇవన్నీ నాయకత్వం మరియు దేశ నిర్మాణానికి అత్యంత అవసరమైన లక్షణాలు. యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ మేధో వికాసానికి వేదికగా నిలుస్తున్న ఈ అంతర్జాతీయ టోర్నమెంట్‌ను నిర్వహించిన వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం మరియు ఆంధ్ర చెస్ అసోసియేషన్‌ను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు యువత సమగ్ర అభివృద్ధికి దోహదపడటమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా మరియు విద్యా రంగాల్లో ప్రతిష్ఠాత్మక కేంద్రంగా నిలబెడతాతాయని పేర్కొన్నారు.
ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆకే రవి కృష్ణ మాట్లాడుతూ, ఈ చెస్ ఉత్సవం నిర్వహణ స్థాయి మరియు సమగ్రత నిజంగా ప్రశంసనీయం. వివిధ ప్రాంతాలు, దేశాలకు చెందిన క్రీడాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా పోటీ నైపుణ్యాలే కాకుండా సాంస్కృతిక మార్పిడి మరియు పరస్పర అభ్యాసానికి కూడా ఇది దోహదపడుతోంది. ముఖ్యంగా యువ క్రీడాకారులు మరియు వారి కుటుంబాలకు ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అవకాశాలు కల్పించేందుకు చేసిన కృషి అభినందనీయమని అన్నారు.
పోటీలకు హాజరైన క్రీడాకారులను స్వాగతిస్తూ విఐటి-ఏపి విశ్వవిద్యాలయ వైస్-చాన్సలర్ డా|| పి. అరుళ్‌మొళి వర్మన్ మాట్లాడుతూ, విఐటి-ఏఫై విశ్వవిద్యాలయంలో విద్య అనేది తరగతి గదులు, ప్రయోగశాలలకు మాత్రమే పరిమితం కాదని , అమరావతి అంతర్జాతీయ చెస్ ఉత్సవం వంటి కార్యక్రమాల ద్వారా యువతలో విమర్శనాత్మక ఆలోచన, ఆవిష్కరణ, నాయకత్వ లక్షణాలు మరియు క్రీడా ప్రతిభను పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలియచేయారు.
గుంటూరు జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ వకుల్ జిందాల్ మాట్లాడుతూ, చెస్ వంటి మేధో క్రీడలు బాధ్యతాయుతమైన, ఏకాగ్రత కలిగిన మరియు సవాళ్లను ఎదుర్కొనే పౌరులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలియచేసారు.
ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. ఎ. సురేష్ మాట్లాడుతూ, అమరావతి అంతర్జాతీయ చెస్ ఉత్సవం ఆంధ్రప్రదేశ్‌లో చెస్ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తోంది. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించడం ద్వారా యువ ప్రతిభకు తమ రేటింగ్‌లను మెరుగుపరుచుకోవడానికి, విలువైన అనుభవాన్ని పొందడానికి మరియు జాతీయ, అంతర్జాతీయ విజయాల వైపు ముందుకు సాగేందుకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.
ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఛైర్మన్ కె.వి.వి. శర్మ మాట్లాడుతూ, సమాజంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు చెస్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే మా నిబద్ధతకు ఈ టోర్నమెంట్ ప్రతిబింబం. విఐటి-ఏపి విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం వల్ల ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఈ పోటీని నిర్వహించగలుగుతున్నామని, ఇది వందలాది మంది క్రీడాకారులు మరియు వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.
గుంటూరు ఈగిల్ సెల్ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ నగేశ్, “డ్రగ్స్ రహిత భారతదేశం – డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్” లక్ష్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేవారితో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర ముదిగంటి, డా|| ఖాదీర్ పాషా (డిప్యూటీ డైరెక్టర్, స్టూడెంట్ వెల్ఫేర్), డా|| ఎన్. రామచంద్ర రావు (ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్) చదరంగ క్రీడాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.












































