బీహార్‌లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం
- ప్రమాదంలో ముగ్గురు మరణించడం బాధాకరమన్న సీఎం
- క్షతగాత్రులకు తక్షణ వైద్యసాయం అందించేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి, జూన్ 08:- బీహార్‌లోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన కాశీ యాత్ర టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. క్షతగాత్రులకు అందుతోన్న వైద్యంపై ఆరా తీశారు. నెల్లూరు జిల్లా నుంచి 46 మంది యాత్రికులతో కాశీ వెళ్లిన ఈ బస్సు ఔరంగాబాద్ వద్ద మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టిందని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, 15 మందికి గాయాలయ్యాయని వివరించారు. బీహార్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి బాధితులకు సాయం అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదం నుంచి బయటపడిన యాత్రికులను స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం ఆదేశాల మేరకు బీహార్ ఉన్నతాధికారులతో పాటు అక్కడి స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో ఏపీ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను గయాలోని అనుగ్రహ నారాయణ మగధ్ మెడికల్ కాలేజ్-హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాధితులంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. యాత్రికులను స్వస్థలాలకు చేర్చే అంశంపై బీహార్ ప్రభుత్వంతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.

























































