యోగాంధ్రలో భాగస్వాములు కావాలని అసోసియేషన్లకు పిలుపునిచ్చిన ప్రభుత్వం
- “సదరు సంస్థల ప్రతినిధులతో అధికారుల ప్రత్యేక సమావేశం
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాకరంగా తీసుకున్న యోగాంధ్ర-2026 కార్యక్రమాల నిర్వహణలో భాగస్వాములు కావాలని ప్రముఖ యోగా అసోసియేషన్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కోరింది. ప్రభుత్వ సంకల్పానికి తగ్గట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈశా పౌండేషన్, పతంజలి భారత్ స్వాభిమాన్ ట్రస్టు, బ్రహ్మా కుమారీస్, యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, heartfullness ఇన్స్టిట్యూట్, భారత్ స్వాభిమాన్ ట్రస్టు/పతంజలి యోగా సమితి, హబిల్డ్ (ఏఐ డెవలపర్స్), గిప్సి (ఏఐ డెవలపర్స్), యోగాంత స్టారప్ ఇతర సంస్థల ప్రతినిధులతో వర్చువల్ గా ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రద్యుమ్న, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, ఆయుష్ డైరెక్టర్ రోణంగి గోపాలకృష్ణ ప్రభృతులు యోగా సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తామిచ్చే లాగిన్ల ద్వారా యోగాంధ్ర-2026 పోర్టలులో సదరు అసోసియేషన్లకు చెంది న వారి పేర్లను నమోదుచేసి, యోగా కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని కోరారు.
యోగాంధ్ర కార్యక్రమాలను జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాత్రమే కాకుండా ఏడాది పొడవునా నిరాటంకంగా కొనసాగించే విషయమై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. బ్రహ్మాకుమారీలు యోగా కార్యక్రమాల్లో ధాన్యం చేయడాన్ని కూడా జోడించాలని కోరారు. గత ఏడాది 400కిపైగా గ్రామాల్లో ఉచిత శిక్షణ కార్యక్రమాలను జరిపామని, ఈ ఏడాది కూడా అదేవిధంగా చేస్తామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధులు చెప్పారు. యోగా అసోసియేషన్ల ప్రతినిధులు యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతమయ్యేందుకు పలు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ నెల 21న జరిగే రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పోర్టల్ ద్వారా పేర్ల నమోదు జరుగుతూనే ఉందని ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ తెలిపారు.|
















































