సీఎం చంద్రబాబుతో ఓఎన్‌జీసీ చైర్మన్ మర్యాదపూర్వక భేటీ
రాష్ట్రంలో ఓఎన్‌జీసీ కార్యకలాపాలపై ఇరువురి మధ్య చర్చ
అమరావతి, జూన్ 03: ఓఎన్‌జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర సచివాలయానికి వచ్చిన ఆయన రాష్ట్రంలో ఓఎన్‌జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యకలాపాలపై ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా- గోదావరి డెల్టా బేసిన్‌లో సహజవాయువు, చమురు అన్వేషణ, వెలికితీత పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో ఇంధన రంగం అభివృద్ధికి ఓఎన్‌జీసీ చేస్తున్న కృషిని, తదుపరి విస్తరణ ప్రణాళికల గురించి అరుణ్ కుమార్ సింగ్ సీఎంకు వివరించారు. ఓఎన్‌జీసీ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి సమకూరే ఆదాయం, ఉపాధి అవకాశాలు స్థానిక ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావంపై సీఎం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, ఓఎన్‌జీసీ మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా చూడాలని, తద్వారా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఇంధన భద్రతను పెంపొందించడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సామాజిక బాధ్యతగా ఓఎన్‌జీసీ సీఎస్ఆర్ నిధులను ఆయా గ్రామాల్లో ఖర్చు పెట్టాలని సీఎం సూచించారు. చమురు సహజవాయువు తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఓఎన్‌జీసీ చైర్మన్ కాకినాడ, గుంటూరులో కేన్సర్ చికిత్సల్లో వినియోగించే అధునాతన యంత్రాలను ఆస్పత్రులకు సమకూరుతున్నట్టు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఓఎన్‌జీసీ అధికారుల బృందం హాజరయ్యారు.
















































