తేదీ: 17.08.2026
N-10-E-3 Nursery in 18 acres at Amaravati
అమరావతిలో 18 ఎకరాలలో ఎన్-10 – ఈ – 3 నర్సరీ
రాజధాని అమరావతిలో లింగాయపాలెం – ఉద్ధండరాయునిపాలె గ్రామాల మధ్య ఎన్ – 10 సీడ్‌యాక్సెస్‌రోడ్డు(ఈ-03) కూడలిలో అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) సెంట్రల్ నర్సరీని అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. రాజధాని నగరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 34 ప్రధాన రహదార్లకు ఇరువైపులా సుమారు 700 కి.మి. మేర చెట్లు పెంచి మంచి గాలి, నీడ అందించాలనేది ప్రధాన లక్ష్యం.
ఈ సెంట్రల్ నర్సరీలో 45 వేల మొక్కలను పెంచాలని ఏడీసీ లక్ష్యంగా పెట్టుకుందని సంస్థ ఛైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డి.లక్ష్మీపార్థసారథి వారు వెల్లడించారు. బుధవారం ఆమె సెంట్రల్ నర్సరీలో మొక్కలు నాటి నర్సరీలో అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సెంట్రల్ నర్సరీని ఉద్యానవన విభాగం ప్రధాన స్టాక్ పాయింట్‌గా వినియోగిస్తారు. రాజధాని రోడ్లపై చెట్ల పెంపకానికి అవసరమైన మొక్కలను ఇక్కడి నుంచి రవాణా చేస్తారు. 18 ఎకరాలలో ఈ నర్సరీని అభివృద్ధి చేస్తారు. ఫేజ్ – 1లో తొలుత 10 ఎకరాలలో అభివృద్ధి పనులను చేపట్టారు. దఫాల వారీగా తక్కిన విస్తీర్ణంలో కూడా నర్సరీని తీర్చిదిద్దుతారు. వాతావరణంలోని నిర్దిష్ట వాయువులు సూర్యుడి నుండి వచ్చే వేడిని బంధించడానికి, మొక్కలకు ఉష్ణ దుప్పటి లాగా సరిపడే వెచ్చదనాన్ని అందించడానికి గ్రీన్ హౌస్‌ను కూడా నిర్మిస్తారు.
ఈ కార్యక్రమంలో ఏడీసీ ఉద్యనవన, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.










































