అమరావతి నిర్మాణంలో రైతుల త్యాగాలు చిరస్మరణీయం
- ఆంధ్రుల రాజధాని అమరావతికి సరికొత్త శోభ
- సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్-2, స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- రైతుల బహిరంగ సభలో మంత్రి నారాయణ
అమరావతి:
ఆంధ్రుల రాజధాని అమరావతికి సరికొత్త శోభ వచ్చిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. అమరావతి ముఖద్వారం ఉండవల్లి వద్ద సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్-2తో పాటు స్టీల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం రైతులతో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి నారాయణ ప్రసంగించారు. సీడ్ యాక్సిస్ రోడ్ అలైన్‌మెంట్, నిర్మాణ వివరాలను ముఖ్యమంత్రికి మంత్రి వివరించారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని మంత్రి నారాయణ అన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల సహకారాన్ని ఎప్పటికీ మరచిపోలేమన్నారు. అమరావతి నిర్మాణంపై రైతులకు ఉన్న విశ్వాసానికి వారి అపూర్వమైన సహకారమే నిదర్శనమని పేర్కొన్నారు.
58 రోజుల్లో 34 వేల ఎకరాల భూమి
రాజధాని నిర్మాణం కోసం 2015 జనవరిలో భూ సమీకరణ ప్రక్రియకు నోటిఫికేషన్ ఇచ్చామని మంత్రి తెలిపారు. 2015 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు కేవలం 58 రోజుల్లోనే సుమారు 34 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా అందించారని చెప్పారు. ఒక్క లిటిగేషన్ కూడా లేకుండా రైతులు తమ భూములను అందించడం దేశ చరిత్రలోనే విశేషమైన విషయమన్నారు.
ఎటువంటి కోర్టు కేసులు, వివాదాలు లేకుండా రైతులు భూములు ఇవ్వడం అమరావతి నిర్మాణంపై వారికి ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుందని అన్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు అందించిన సహకారం, చేసిన త్యాగాలు చిరస్మరణీయమని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఆర్థిక రాజధానిగా అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మారిన పరిస్థితుల్లో రాష్ట్రానికి ఒక ఆర్థిక రాజధానిని నిర్మించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఎంపిక చేశారని మంత్రి తెలిపారు. తెలంగాణకు హైదరాబాద్ ద్వారా, మహారాష్ట్రకు ముంబయి ద్వారా, కర్ణాటకకు బెంగళూరు ద్వారా, తమిళనాడుకు చెన్నై ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తోందని పేర్కొన్నారు.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఆర్థికంగా బలమైన రాజధాని అవసరమనే ఉద్దేశంతో అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. కృష్ణానది ఒడ్డున అమరావతిని నిర్మించడం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి భావించారని తెలిపారు.శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్రానికి మధ్యలో అమరావతి ఉండటం, రైలు, రోడ్డు మార్గాల పరంగా మంచి అనుసంధానం ఉండటం రాజధాని ఎంపికకు ప్రధాన కారణాల్లో ఒకటని మంత్రి వివరించారు.
సింగపూర్ మాస్టర్ ప్లాన్, ఐకానిక్ భవనాలు
అమరావతిని ప్రణాళికాబద్ధమైన అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను ఉచితంగా అందించిందని మంత్రి తెలిపారు. రాజధానిలో ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థను సంప్రదించినట్లు చెప్పారు.అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు.. భూగర్భ మౌలిక వసతులు
అమరావతిలో సుమారు 350 కిలోమీటర్ల మేర ట్రంక్ రోడ్లను నిర్మించడంతో పాటు సమగ్ర భూగర్భ మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.సీడ్ యాక్సిస్ రోడ్డుకు అనుసంధానంగా విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, తాగునీటి సరఫరా తదితర సేవలను భూగర్భంలోనే ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. డ్రైనేజీ, పునర్వినియోగ నీటి పైపులైన్లు, వర్షపు నీటి కాలువలు వంటి మౌలిక వసతులను కూడా సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
గతంలో పనులకు ఆటంకాలు.. తిరిగి వేగం
అమరావతిలో పనులు ప్రారంభించడం, టెండర్లు పిలవడం, ఇతర ప్రక్రియలు చేపట్టడానికి సుమారు మూడున్నర సంవత్సరాల సమయం పట్టిందని మంత్రి నారాయణ తెలిపారు. ఆ తర్వాత సుమారు ఏడాదిన్నర కాలంలో అమరావతి కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.అయితే అనంతరం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకురావడంతో అమరావతి నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని మంత్రి అన్నారు. నిర్మాణ సంస్థలతో ఉన్న ఒప్పందాలను క్లోజ్ చేయకుండా వదిలేయడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సాంకేతికంగా క్లోజ్ చేసి, తిరిగి టెండర్లు పిలవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
గతంలో జరిగిన నిర్మాణ పనుల నాణ్యతను ఐఐటీ చెన్నై, ఐఐటీ హైదరాబాద్ నిపుణులతో ప





















































