- ఆక్వా రైతుల సంక్షేమానికి అత్యదిక ప్యాధాన్యత – ఆక్వా రంగ స్థిరాభివృద్ధికి పటిష్టమైన చర్యలు
•వాస్తవ నిర్థారణ లేని అపోహలను, వార్తలను నమ్మవద్దు
రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్
అమరావతి, జూన్ 17: రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, లక్షలాది మంది రైతుల జీవనోపాధికి వెన్నెముకగా నిలిచిన ఆక్వాకల్చర్ రంగం స్థిరాభివృద్ధికి, ఆక్వా రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర మత్స్యశాఖ కమినషర్ రామశంకర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వాకల్చర్ రంగం స్థిరాభివృద్ధి మరియు పారదర్శకమైన మేత ధరల విధానం పట్ల ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ఆయన తెలిపారు.
వాస్తవ నిర్ధారణ లేని అపోహలను నమ్మకండి….
రైతులు, భాగస్వామ్య వర్గాలు మరియు ప్రజలు వాస్తవ నిర్ధారణ లేని అపోహలను నమ్మకుండా, అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని ఆయన కోరారు. రొయ్యల మేత ధరలు లేదా ఇతర ఆక్వా సంబంధిత అంశాలపై ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే సంబంధిత జిల్లా లేదా స్థానిక మత్స్యశాఖ అధికారులను సంప్రదించి తగిన సమాచారం పొందవచ్చని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆక్వాకల్చర్ రంగం మరింత బలోపేతం కావడానికి ప్రభుత్వం అన్ని వర్గాలతో సమన్వయంతో పని చేస్తూ, రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైన ప్రతి చర్యను కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.
అంతర్జాతీయ, జాతీయ మార్కెట్ పరిస్థితుల ప్రభావం…
రొయ్యల మేత తయారీలో వినియోగించే ప్రధాన ముడి పదార్థాలైన ఫిష్ మీల్, సోయాబీన్ ఉత్పత్తులు, గోధుమ ఆధారిత పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పోషక పదార్థాల ధరలు గత కొన్ని నెలలుగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయంగా పెరిగాయన్నారు. ఫలితంగా మేత తయారీ సంస్థల ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిన విషయం గమనార్హం అన్నారు. ముఖ్యంగా ఫిష్ మీల్ మరియు సోయాబీన్ ధరలు గత ఆరు నెలల కాలంలో 25 శాతం కంటే ఎక్కువ మేర పెరగడం, రవాణా వ్యయాలు పెరగడం, ఇతర ముడి పదార్థాల లభ్యత తగ్గడం వంటి కారణాలు మేత ఉత్పత్తి వ్యయంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయన్నారు.
గ్లోబల్ సప్లై చైన్ సవాళ్లు…
ప్రపంచవ్యాప్తంగా ఫిష్ మీల్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే పెరూ, చిలీ వంటి దేశాలు ఉత్పత్తి మరియు ఎగుమతులపై నియంత్రణ చర్యలు చేపట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లో ప్రీమియం నాణ్యత కలిగిన ఫిష్ మీల్ లభ్యత తగ్గిందన్నారు. దీంతో చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, ఇండోనేషియా వంటి దేశాలు భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఫిష్ మీల్‌పై అధికంగా ఆధారపడటం ప్రారంభించాయన్నారు. ఈ పెరిగిన అంతర్జాతీయ డిమాండ్ కారణంగా దేశీయ మార్కెట్లో కూడా ఫిష్ మీల్ ధరలు గణనీయంగా పెరిగాయన్నారు. దేశంలో ఫిష్ మీల్ ఉత్పత్తి సామర్థ్యం తగినంతగా ఉన్నప్పటికీ, అధిక ఎగుమతుల కారణంగా స్థానికంగా లభ్యతపై ఒత్తిడి ఏర్పడిందన్నారు. ఫలితంగా మేత తయారీదారులు అధిక ధరలకు ముడిసరుకులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఆక్వా రంగానికి మద్దతుగా ప్రభుత్వ ముందస్తు చర్యలు…
ఆక్వా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యున్నత స్థాయిలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 13.05.2026 న కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి గారికి లేఖ రాసి, రొయ్యల మేత తయారీకి అవసరమైన సోయా ఉత్పత్తుల దిగుమతులపై తగిన విధానపరమైన సడలింపులు కల్పించాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు.
అదేవిధంగా, ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఆక్వాకల్చర్ వర్కుషాప్‌లో కూడా ఈ అంశంపై కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నిపుణులతో విస్తృతంగా చర్చలు జరిగాయన్నారు. ఈ దిశగా త్వరలోనే రంగానికి అనుకూలమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
వాటాదారులతో విస్తృత సంప్రదింపులు…
రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు మరియు ఇతర భాగస్వామ్య వర్గాల మధ్య సమతుల్యత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చర్చలు నిర్వహిస్తోందన్నారు. ఇప్పటివరకు ఫీడ్ తయారీ సంస్థలు, ఆక్వా రైతు సంఘాలు, ఫీడ్ డీలర్ల సంఘాలు, MPEDA, CIBA, ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ, APSADA ప్రతినిధులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించబడినాయన్నారు. గౌరవ మత్స్యశాఖ మంత్రి శ్రీ కె. అచ్చెన్నాయుడు గారి అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో ముడిసరుకుల ధరలు, ఉత్పత్తి వ్యయాలు, రైతుల ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయని తెలిపారు.
రైతు సంఘాలు పరిమిత స్థాయిలో మాత్రమే ధరల పెంపును అంగీకరించగా, ఫీడ్ తయారీ సంస్థలు పెరిగిన ఉత్పత్తి వ్యయాలను దృష్టిలో ఉంచుకుని అధిక ధరల సవరణను ప్రతిపాదించాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తూ రైతుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా చర్యలు కొనసాగిస్తోందన్నారు.
“ఏపీ ష్రింప్ ఫీడ్ ఇన్‌గ్రిడియెంట్స్ ప్రైస్ మానిటరింగ్ కమిటీ” ఏర్పాటు…
రొయ్యల మేత ధరల నిర్ణయంలో పారదర్శకత, శాస్త్రీయ విశ్లేషణ మరియు నిరంతర పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. దీనిలో భాగంగా G.O.Rt.No.180, పశుసంవర్ధక, పాలాభివృద్ధి & మత్స్యశాఖ (ఫిష్) శాఖ, తేదీ 15.06.2026 ద్వారా “ఏపీ ష్రింప్ ఫీడ్ ఇన్‌గ్రిడియెంట్స్ ప్రైస్ మానిటరింగ్ కమిటీ” ను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీలో MPEDA, CIBA, ఫిషరీస్ యూనివర్సిటీ, ఫీడ్ తయారీ సంస్థలు, ఆక్వా రైతు సంఘాలు, ఫీడ్ డీలర్ల సంఘాలు, APSADA ప్రతినిధులు మరియు సాంకేతిక నిపుణులు సభ్యులుగా ఉన్నారన్నారు.
కమిటీ ప్రధాన బాధ్యతలు…
రొయ్యల మేత ధరల నిర్ణయంలో పారదర్శకత, శాస్త్రీయ విశ్లేషణ మరియు ఆక్వా రైతుల ప్రయోజనాల పరిరక్షణను లక్ష్యంగా పెట్టుకుని ఏర్పాటు చేసిన “ఏపీ ష్రింప్ ఫీడ్ ఇన్‌గ్రిడియెంట్స్ ప్రైస్ మానిటరింగ్ కమిటీ” దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఫిష్ మీల్, సోయాబీన్ మరియు ఇతర మేత ముడి పదార్థాల ధరలను నిరంతరం పర్యవేక్షిస్తూ, వాటి ప్రభావాన్ని ఉత్పత్తి వ్యయం, రవాణా ఖర్చులు మరియు మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో సమగ్రంగా విశ్లేషిస్తుందని తెలిపారు. అలాగే రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, డీలర్లు మరియు ఇతర భాగస్వామ్య వర్గాలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నదన్నారు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని రొయ్యల మేత ధరల అంచనాకు శాస్త్రీయ, పారదర్శక మరియు విశ్వసనీయ విధానాన్ని రూపొందిస్తుందన్నారు. ప్రత్యేక డిజిటల్ యాప్ ద్వారా ముడి పదార్థాల ధరలు, మార్కెట్ ధోరణులు మరియు మేత ధరల మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తూ సమాచారాన్ని రైతులకు అందుబాటులో ఉంచడం జరుచున్నదన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడుతూ నాణ్యమైన మేత ఉత్పత్తి, సరఫరా వ్యవస్థ బలోపేతానికి అవసరమైన సూచనలు ప్రభుత్వానికి అందించడం ద్వారా ఆక్వా రంగ స్థిరాభివృద్ధికి తోడ్పడుతుందన్నారు.
ఆక్వా రైతు సంక్షేమానికి ప్రభుత్వ కట్టుబడిఉంది…
రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వాకల్చర్ రంగం సుస్థిరాభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని కమిషనర్ తెలిపారు. ఆక్వా రంగానికి దేశంలోనే అత్యల్ప విద్యుత్ టారిఫ్‌లలో ఒకటైన యూనిట్‌కు రూ.1.50 చొప్పున రాయితీ విద్యుత్‌ను అందిస్తూ రైతుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. అంతేకాకుండా నాణ్యమైన సీడ్ మరియు ఫీడ్ వినియోగాన్ని ప్రోత్సహించడం, వ్యాధి నివారణ మరియు పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం, అంతర్జాతీయ బయోసెక్యూరిటీ ప్రమాణాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వడం, ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం, శాస్త్రీయ ఆక్వాకల్చర్ పద్ధతులను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ చర్యలన్నీ ఆక్వా రైతుల ఆదాయ వృద్ధి, ఉత్పాదకత పెంపు మరియు రాష్ట్ర ఆక్వాకల్చర్ రంగం అంతర్జాతీయ పోటీతత్వాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కొనసాగుతున్నాయని తెలిపారు.











































