విజయవాడ, నవంబర్,2.
తన పనితీరుతో భాస్కర నారాయణ సి.ఆర్.మీడియా అకాడమీ కార్యక్రమాలు విజయవంతం చేశారని చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ అన్నారు. అక్టోబర్ 31 న డిప్యూటీ డైరెక్టర్ హోదాలో అకాడమీ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన మేడపాటి భాస్కర నారాయణ ను సమాచార శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, విశ్రాంత అధికారులు, బంధు మిత్రుల సమక్షంలో సోమవారం (02.11.26) అకాడమీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భాస్కర నారాయణ పనితీరు పట్ల ఆయన పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. మృదు స్వభావంతో అకాడమీ అధికారులను సమన్వయంతో ముందుకు నడిపించే గలిగారన్నారు. పని పట్ల పూర్తి ఏకాగ్రత, అధికారుల పట్ల విధేయత ఆయన బలమని చైర్మన్ అభిప్రాయ పడ్డారు. ఉద్యోగిగా నిరంతరం శ్రమించే వ్యక్తి కి రిటైర్మెంట్ ద్వారా ఏర్పడిన ఖాళి ని ఎదుర్కోవడం సవాలు వంటిదే అని, భాస్కర నారాయణ తమ విశ్రాంత జీవనాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని కోరారు. సి.ఆర్.మీడియా అకాడమీ తరపున భాస్కర నారాయణ ను చైర్మన్ సన్మానించారు.
విశిష్ట అతిథి గా హాజరైన జాయింట్ కమీషనర్ స్టేట్ టాక్స్ మేడపాటి సత్య ప్రకాష్ మాట్లాడుతూ, భాస్కర నారాయణ మృదు స్వభావి అన్నారు. పూర్తి క్రమశిక్షణతో తనకు అప్పగించిన పనిని చేయడం ద్వారా సమాచార శాఖ అధికారుల మెప్పును పొందగలగడం ఆయన పని తీరుకు నిదర్శనమన్నారు. ప్రస్తుత రోజుల్లో ఇంత మంది అభిమానాన్ని చూరగొని ప్రశాంతంగా రిటైర్ కావడం ఆయనకు దైవమిచ్చిన వరమని అన్నారు.
విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ ఎల్. స్వర్ణలత మాట్లాడుతూ, సమాచార శాఖలో అప్పగించిన పనిని సమర్ధవంతంగా భాస్కరనారాయణ నెరవేర్చేవారన్నారు. క్రమశిక్షణ కలిగిన అధికారిగా ఆ శాఖలో పేరు పొందారన్నారు. మరొక విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ పి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ వివిధ హోదాల్లో భాస్కర నారాయణ సమాచార శాఖ పేరు ప్రతిష్టలు పెంచే లా పనిచేశారన్నారు. ఆయన రిటైర్మెంట్ జీవితం ప్రశాంతంగా గడవాలని ఆకాంక్షించారు.
సమాచార శాఖ లో తన 33 ఏళ్ల సుదీర్ఘ సర్వీస్ సమయంలో ఉన్నతాధికారుల ఆదేశాలను చిత్త శుద్ధితో అమలు చేశానని డిప్యూటీ డైరెక్టర్ సి.ఆర్.మీడియా అకాడమీ మేనేజర్ ఎం. భాస్కర నారాయణ అన్నారు. పౌర సంబంధాల శాఖ లో పని చేయడం, జిల్లా స్థాయిలో కలెక్టర్ వంటి ఉన్నత అధికారులతో సన్నిహితంగా పనిచేయడం తమకు అత్యంత సంతృప్తినిచ్చిందని ఆయన అన్నారు. పదవీ విరమణ అనేది ఉద్యోగి గా బాధ్యతలు చేపట్టిన నాడే స్పష్టంగా నిర్ణయించబడుతుందని, అయినా రిటైర్మెంట్ కొంత బాధగానే ఉంటుందన్నారు. తన పట్ల ప్రేమాభిమానాలతో వచ్చి, తన గురించి మంచి మాటలు చెప్పి, సన్మానించిన అధికారులకు, సిబ్బందికి, ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్లు షేక్ మహమ్మద్ బాషా, ఐ.సూర్య చంద్ర రావు, పి.తిమ్మప్ప లు భాస్కర నారాయణ పని తీరు ను ప్రశంసించారు. సమాచార శాఖ అక్కౌంట్స్ అధికారిణి రజియా బేగం, జె.ఈ. ఓ నాగరాజు, గుంటూరు డి.డి. ఎల్. రమేష్, అసిస్టెంట్ డైరెక్టర్లు, రాజశేఖర్, కె. నారాయణ రెడ్డి, తిరుపాల్, మోహన రావు, వీరభద్ర రావు, ఎన్.టి. ఆర్ జిల్లా డి.పి .ఆర్.ఓ. టి . నాగేశ్వర రావు, డి.ఐ.పి .ఆర్.ఓ. రమణ డివిజనల్ పి .ఆర్.ఓ. రవి, ఏ.వి.ఎస్. వి.వి. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
“సమాచార శాఖ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్” సత్కారం:
“సమాచార శాఖ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్” తరపున విశ్రాంత అడిషనల్ డైరెక్టర్ లు ఎల్. స్వర్ణలత, పి. కిరణ్ కుమార్, ట్రెజరర్ ఎస్. శ్రీనివాస జీవన్, జి. వెంకటేశ్వర రావు లు భాస్కర నారాయణను సన్మానించారు.
























































