ఒంగోలు @ 150 ఏళ్లు
సెప్టెంబర్ 30 నాటికి ఒంగోలు పట్టణాన్ని గుర్తిస్తూ గెజిట్ వెలువడి నేడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా..
మౌర్య, శాతవాహన, ఇక్ష్వాకులు ఏలిన ఆనవాళ్లు. కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యాధినేతలు పరిపాలించిన సాక్ష్యాలు. చినగంజాంలో దొరికిన గౌతమీపుత్ర శాతకర్ణి శాసనాలు. రోమన్ బంగారు నాణేలు లభించిన నేలగా చరిత్రలో ఆధారాలు. ఎర్ర నేలల వాసనలో పుట్టి నేటికీ వెలుగొందుతున్న ఒకనాటి వంగవోలు.. నేటి మన ఒంగోలు.
ఒకప్పుడు ఒక మామూలు ప్రాంతం.
తర్వాత పరిపాలనా కేంద్రం.
ఆపైన విద్యకు నిలయం.
అంతకుమించి వైద్యానికి చిరునామా.
రైలు కూతతో రవాణా పటంలో స్థానం.
పురపాలనతో పట్టణ జీవనానికి పునాది.
ప్రజాస్వామ్యంతో ప్రజల గొంతుకకు వేదిక. సమస్త రంగాల సమగ్ర అభివృద్ధికి నిలయం ఒంగోలు నగరం.
ఒంగోలు పేరు పలికితే ముందుగా గుర్తుకొచ్చేది ఒక నగరం కాదు… ఒక జీవన విధానం. ఎర్రటి నేల వాసన… పచ్చని పల్లె గాలి పరిమళం… ఒంగోలు జాతి పశువుల గంటల సవ్వడి… రైతన్నల పంట కళకళతో సంతల సందడి… కళాకారుల ప్రజ్ఞాపాటవాలు… మహనీయుల అడుగుజాడలు..మంచి ఆలోచనల మలుపులు..అభివృద్ధే లక్ష్యంగా మార్పులు..మహాప్రస్థానాన్ని చాటేలా మైలురాళ్లు..మట్టి మనుషుల ఆత్మీయత మాత్రమే కాదు మంచి మనసుల కలబోత మన ఒంగోలు.
ఒంగోలు అంటే ఒక భౌగోళిక ప్రాంతం కాదు.
ఒక అనుభూతి. ఒక ప్రాంత సంస్కృతి. ఒక మంచి జ్ఞాపకం. ఒక జీవన గమనం.
శతాబ్దానికి పైగా కాలం తన అడుగులను ఈ నేలపై వేసింది. తరాలు మారాయి. పాలనా వ్యవస్థలు మారాయి. రహదారులు మారాయి. రవాణా వ్యవస్థ మారింది. వ్యాపార పద్ధతులు మారాయి. పాత ఇళ్ల స్థానంలో కొత్త భవనాలు వచ్చాయి. అయినా… ఒంగోలు తనలోని మట్టి వాసనను మాత్రం వదులుకోలేదు. ఎప్పటికీ వదులుకోదు కూడా.
ఒంగోలు చరిత్రను వెనక్కి తిరిగి చూస్తే అది ఒక్కరోజులో నిర్మితమైన నగరం కాదని అర్థమవుతుంది. శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో సాగిన మానవ జీవనం, వ్యవసాయం, వాణిజ్యం, సాగు చేసిన పంటలు, సామాజిక మార్పులు, ఆహారపు అలవాట్లు, విద్యా వికాసం, పరిపాలనా పరిణామాలు. అన్నీ కలగలిసి నేటి ఒంగోలు రూపాన్ని తీర్చిదిద్దాయి.
ఒకప్పుడు పల్లె వాతావరణంతో కనిపించిన ఈ ప్రాంతం కాలక్రమంలో వాణిజ్యానికి, విద్యకు, పరిపాలనకు, సామాజిక చైతన్యానికి ముఖ్య కేంద్రంగా ఎదిగింది. పొగాకు పంటకు చిరునామా అయింది.
ఇది ఒక ఊరు పట్టణంగా ఎదిగిన కథ.
పట్టణం నగరంగా రూపాంతరం చెందిన కథ.
ప్రజల అవసరాలు పాలనకు పాఠాలుగా మారిన కథ.
తరతరాల ప్రజలు తమ చెమటతో, ఆలోచనలతో, ఆశయాలతో నిర్మించిన జీవనగాథ.
ఒంగోలు 150 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే.. మొదటిసారి బడిలో గంట మోగిన రోజు కూడా చరిత్రే.
మొదటిసారి ఓ వైద్యుడు రోగి నాడి పట్టుకున్న రోజు కూడా చరిత్రే.
మొదటిసారి రైలు కూత వినిపించిన క్షణం చరిత్రే.
ప్రజల జీవితాలను మార్చిన ప్రతి చిన్న అడుగు… నగర నాగరికతలో ఒక పెద్ద చరిత్రే.
పురపాలనకు ముందు ఒంగోలు… తొలి అడుగుల కాలం
ఒంగోలు ఆధునిక పరిపాలనా చరిత్రలో కనిపించే తొలి ముఖ్యమైన ఆనవాళ్లు 18వ శతాబ్దం చివరినాటికే కనిపిస్తాయి.
1794లో ఒంగోలు ఒక Collectorate Sadr/Headquarters Stationగా పనిచేసినట్లు Imperial Gazetteer of Indiaలో నమోదు ఉంది. అంటే పరిపాలనా వ్యవస్థలో ఒంగోలు అప్పటికే ఒక ముఖ్యమైన కేంద్రంగా ఎదుగుతున్నదనే విషయం స్పష్టమవుతుంది. అక్కడి నుంచి కాలం ముందుకు కదిలింది.
ఒక నగరం ఎదగాలంటే రహదారులు, భవనాలు మాత్రమే సరిపోవు.
అక్షరం కావాలి.
విద్య కావాలి.
చైతన్యం కావాలి.
ఒంగోలు ఆధునిక విద్యా చరిత్రలో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ కార్యకలాపాలు ఒక ముఖ్యమైన తొలి అధ్యాయంగా నిలిచాయి. 1860లలో జాన్ ఎవరెట్ క్లౌ నాయకత్వంలో విద్యాబోధనకు సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చదవడం, రాయడం, మతబోధనతో పాటు స్థానికులను ఉపాధ్యాయులు, బోధకులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కూడా విస్తృతంగా సాగాయి. 1867 ప్రాంతంలో హ్యారియట్ క్లౌ ఆధ్వర్యంలో పాఠశాల ప్రారంభమైంది. అనంతరం అది బాలుర, బాలికల పాఠశాలలుగా అభివృద్ధి చెందింది. 1875 నాటికి ఉపాధ్యాయ శిక్షణకు Normal Training School స్థాపించబడింది. 1880 మేలో Ongole High School / ABM High School ఏర్పడింది. 1883 ఆగస్టులో మిషన్ విద్యాసంస్థ కళాశాల స్థాయికి ఎదిగింది. అంటే…బడి పలకపై వేసిన తొలి అక్షరం,
తరువాతి తరాల భవిష్యత్తుకు వేసిన తొలి బాట. సామాజిక, విద్యా చైతన్యానికి మరో సువర్ణ అధ్యాయం. 1866 సెప్టెంబర్ 17న జాన్ ఎవరెట్ క్లౌ ఒంగోలుకు చేరడం ఈ ప్రాంత సామాజిక స్థితిగతులలో విప్లవాత్మక మలుపుగా నిలిచింది. 1877–78 మహాకరవు సమయంలో జరిగిన సహాయక చర్యలు, అనంతరం గుండ్లకమ్మ ప్రాంతంలో జరిగిన బాప్టిజం ఉద్యమం వల్ల “Ongole Mission” అంతర్జాతీయ బాప్టిస్ట్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందింది. అది కేవలం మత చరిత్ర మాత్రమే కాదు. విద్య, మతబోధన, సామాజిక సేవ, మూడు రంగాలు పరస్పరం ముడిపడి 19వ శతాబ్దపు ఒంగోలు సామాజిక పరివర్తనలో ఒక కొత్త సమాజనిర్మాణానికి పునాదిగా నిలిచాయి.
వైద్య సేవలకు తొలి అడుగు
ప్రజల ఆరోగ్యం కూడా ఒక నగర నాగరికతకు కొలమానం. 1867లో ఒంగోలు ప్రభుత్వ డిస్పెన్సరీ ప్రారంభమైంది. ఇది ఒంగోలు ఆధునిక వైద్య చరిత్రలో తొలి ముఖ్యమైన అడుగుగా నిలిచింది. తరువాత ఇది Civil Dispensaryగా నమోదై ప్రజలకు వైద్య సేవలు విస్తృతం చేసింది. 1881లోనే వందలాది ఇన్పేషెంట్లు, వేలాది అవుట్పేషెంట్లు సేవలు పొందినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. ఒక వైద్యుడు నాడి పట్టిన క్షణం నుంచి… నగర ఆరోగ్య చరిత్ర కొత్త దిశలో అడుగుపెట్టడమే కాకుండా మరింతగా పరుగులు పడుతోంది. 1915 మార్చి 1న మున్సిపల్ గోషా హాస్పిటల్ నిర్మాణానికి పునాదిరాయి పడింది. ఈ పునాదిరాయిని అప్పటి మద్రాస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు A.G. Cardew వేశారు. “Gosha Hospital” అనే పేరు ఒంగోలు భౌగోళిక జ్ఞాపకాల్లో ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉంది.
1876 – ఒంగోలు పురపాలనకు తొలి అడుగు
1876 సెప్టెంబర్ 30. ఒంగోలు చరిత్రలో ఇది ఒక ప్రత్యేకమైన రోజు. అప్పటివరకు గ్రామంగా ఉన్న ఒంగోలు మొదటిసారిగా పురపాలక సంఘంగా అవతరించింది. ఇది గ్రామం నుంచి పట్టణీకరణ వైపు జరిగిన ఒక కీలక అడుగు. అయితే అది నేటి తరహా ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు. బ్రిటిష్ పాలనా విధానంలో ప్రభుత్వ అధికారుల ఆధిపత్యం, నామినేషన్ పద్ధతి ప్రధానంగా ఉండేవి. ఆ రోజుల్లో పట్టణ పాలన అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాదు. కనీస అవసరాలు కూడా తీరని మామూలు జీవితం. వీధులు ఎలా ఉండాలి? పారిశుధ్యం ఎలా నిర్వహించాలి? తాగునీరు ఎలా అందించాలి? ప్రజారోగ్యాన్ని ఎలా కాపాడాలి? ప్రజలకు కనీస సదుపాయాలు ఎలా కల్పించాలి? ఇవే అప్పటి ప్రధాన సవాళ్లు. ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ…ఒక్కో సదుపాయాన్ని సమకూరుస్తూ… ఒక్కో పరిపాలనా భవనంతో అనుభవాన్ని కూడగట్టుకుంటూ… ఒంగోలు తన పట్టణ జీవితానికి పునాదులు వేసుకుంది.
నామినేషన్ నుంచి ప్రజాస్వామ్యం వరకు
తొలి దశలో మున్సిపల్ పాలకవర్గాన్ని మున్సిపల్ కమిషన్ గా పిలిచేవారు. దీనికి కలెక్టర్ Ex అఫిషియో Presidentగా వ్యవహరించేవారు. కొంతమంది స్థానికులను కమిషనర్లుగా నామినేట్ చేసేవారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం F.R.H. Sharp, Collector of Nellore, ఒంగోలు తొలి ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. W.J. Jake 1882లో Vice – President గా ఉన్నారు. కానీ ఈ వ్యవస్థ అక్కడితో ఆగిపోలేదు. 1876లో మొదలైన పురపాలన… ప్రజాస్వామ్యం వైపు నడిచింది.
తొలి జనాభా లెక్కలు
ఒక నగరం ఎలా ఎదుగుతోందో తెలుసుకోవాలంటే ఆ నగరంలో పెరుగుతున్న జనాభ సంఖ్య కూడా ఒక ముఖ్యమైన చరిత్ర. 1867లో ఒంగోలు జనాభా 5,832గా నమోదైంది. దేశవ్యాప్తంగా వ్యవస్థాగత జనాభా లెక్కల సేకరణ 1881లో ప్రారంభమైన తరువాత, ఒంగోలు జనాభా 9,200గా నమోదైంది. ఆ సమయంలో కేవలం 2,286 ఇళ్లు ఉన్నట్లు, 1880–81లో మున్సిపల్ ఆదాయం ₹845గా ఉన్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి. జనాభా పెరిగింది. అవసరాలు పెరిగాయి. నగర రూపం కూడా ఓ మహాస్వరూపంగా మారడం ప్రారంభమైంది.
మొట్టమొదటి గ్రంథాలయం
అక్షరం బడిలో పుడుతుంది. ఆలోచన గ్రంథాలయంలో పెరుగుతుంది. చైతన్యం సమాజంలోకి ప్రవేశిస్తుంది. ఒక నగరం అభివృద్ధికి రహదారులు ఎంత అవసరమో… ఆలోచనల చైతన్యానికి గ్రంథాలయాలు కూడా అంతే అవసరం. 1890లో సీవీఎన్ రీడింగ్ రూమ్, లైబ్రరీ ఏర్పడింది. కొప్పరపు వెంకన్న దాతృత్వంతో ఏర్పడిన ఈ సంస్థ తొలి దశ గ్రంథాలయ సంస్కృతి వికాసంలో ప్రముఖ స్థానం సంపాదించింది.
ఒంగోలు విన్న తొలి రైలు కూత
అది 20 డిసెంబర్ 1898. విజయవాడ–చెన్నై రైల్వే లింక్ పూర్తవడంతో ఒంగోలు ఆధునిక రవాణా యుగంలోకి అడుగుపెట్టింది. రైలు కూత కేవలం శబ్దం కాదు. అది సరికొత్త ప్రపంచానికి ఆహ్వానం. రైల్వే రాకతో వ్యాపారం పెరిగింది. ప్రయాణం సులభమైంది. కొత్త సంబంధాలు ఏర్పడ్డాయి. రైలు పట్టాలు నగరాన్ని ఇతర ప్రాంతాలతో కలిపితే…ఆ సంబంధాలు ఒంగోలు అభివృద్ధికి కొత్త బాటలు వేశాయి.
కొంగొత్తగా ఒంగోలు గిత్త
గంభీరమైన నడక…బలమైన దేహం…పౌరుషానికి ప్రతీకగా నిలిచిన రూపం…తలచుకోగానే గుర్తొచ్చేది..ఒంగోలు గిత్త! పశుసంపదతో ఒంగోలు పేరు మారుమోగిన వేళ. 1905లో తొలి క్యాటిల్ షో ఒంగోలులో జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ కామరాజ మన్నారు కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఒంగోలు పశుసంపదకు ఉన్న ప్రాధాన్యతను ప్రతిబింబించింది. ఒంగోలు జాతి పశువులు ఈ నేల గుర్తింపులో భాగమయ్యాయి. పొలాల్లో రైతు చెమట… బండ్లకు బలం ఇచ్చిన ఎద్దులు…పల్లె ఆర్థిక వ్యవస్థ…ఇవన్నీ ఒంగోలు జీవన గాథలో విడదీయలేని భాగాలు. ఇక్కడి ప్రజల పౌరుషానికి ఒంగోలు గిత్తల పొగరు కూడా ప్రతీకగా మారింది. గిత్త రంకెల్లోనూ…ఈ నేల ఆత్మగౌరవం చాటుతుంది!
తొలి ఎన్నిక
పౌర సమాజం రూపుదిద్దుకున్న సమయం. స్థానిక పాలన వేళ్లూనుకున్న కాలం. ప్రజాస్వామ్యానికి నేల సిద్ధమైన సందర్భం. 1876లో ఏర్పడిన పురపాలక వ్యవస్థ దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత కొత్త దశలోకి ప్రవేశించింది. 1920లో ఒంగోలులో తొలి ప్రజాస్వామ్య మున్సిపల్ ఎన్నిక జరిగింది. ఆ ఎన్నిక మద్రాస్ జిల్లా మున్సిపాలిటీల చట్టం, 1920 ప్రకారం జరిగింది. అయితే అప్పటి ఓటు హక్కు అందరికీ లేదు. ఆస్తి, వయస్సు, నివాసం, పన్ను వంటి అర్హతలు ఉండేవి. ఆ ఎన్నికల్లో వరదా శ్రీరాములు నాయుడు తొలి ఎన్నికైన మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం ఒంగోలు స్థానిక ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచింది.
పలక బలపం నుంచి విశ్వవిద్యాలయం దాకా..
ఒంగోలు విద్యా ప్రయాణం కూడా కాలంతో పాటు విస్తరించింది. 1924 – డి ఆర్ ఆర్ ఎం స్కూల్ స్థాపన. 1898 – పి వి ఆర్ ఎం పి ఎల్ గర్ల్స్ స్కూల్ ఏర్పాటు. తరువాత ప్రభుత్వ బాలికల పాఠశాలలు విద్యా అవకాశాలను మరింత విస్తరించాయి. 1952లో C.S.R. Sarma College ఏర్పడింది. 1982లో దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రారంభమైంది. 1984లో దామచర్ల సక్కుబాయమ్మ బాలికల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదలైంది. 1993లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పీజీ కేంద్రం శ్రీకారం. 1998లో క్యూఐఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ ద్వారా ఇంజినీరింగ్ విద్యకు కొత్త అధ్యాయం మొదలైంది. 2007లో రిమ్స్ కు పునాదిరాయి పడింది. 2011–12 విద్యా సంవత్సరం నుంచి వైద్య విద్య ప్రారంభం కాగా, 2018లో మెడికల్ పీజీ తరగతులు షురూ అయ్యాయి. 2022 జనవరి 11న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పీజీ కేంద్రం ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంగా ఎదిగింది. పలక బలపంతో మొదలైన ప్రయాణం…విశ్వవిద్యాలయ పరిశోధన వరకు చేరింది. ఇదే ఒంగోలు విద్యా ప్రస్థానపు గొప్ప పరిణామం.
పారిశుధ్యం నుంచి స్వచ్ఛత వరకు
నగరం ఎదుగుతున్న కొద్దీ మరో సవాలు ముందుకొచ్చింది అదు పారిశుధ్యం. 1939–40లో మున్సిపల్ రబ్బిష్ , నైట్ సాయిల్ కంపోస్టింగ్ విధానం ప్రారంభమైంది. కంపోస్టు యార్డ్ ను 12 ప్లాట్లుగా విభజించి, వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించే ప్రయత్నం జరిగింది. కాలం అడుగు ముందుకేసింది. 2015లో శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్థాల నిర్వహణకు కొత్త అధ్యాయం ప్రారంభమైంది. గుత్తికొండవారిపాలెంలో 10 ఎకరాల విస్తీర్ణంలో వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసే విధానానికి శ్రీకారం చుట్టబడింది. 2016లో ఒంగోలు ఓడీఎఫ్ మరో మలుపు తీసుకుంది. 15 అక్టోబర్ 2016న స్వచ్ఛభారత్ స్ఫూర్తితో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ప్రజల్లో చైతన్యం ద్వారా ఒంగోలును బహిరంగ మల విసర్జన రహిత నగరంగా ప్రకటించడం పారిశుధ్య రంగంలో మరో ముఖ్యమైన విజయంగా నిలిచింది. ఘన వ్యర్థాల నిర్వహణ, సేకరణ, నియంత్రణ, ప్రాసెసింగ్, ప్రజాభిప్రాయ సేకరణ వంటి అంశాల్లో చేపట్టిన చర్యలకు గుర్తింపుగా ఒంగోలు “Fastest Moving City in South India” అవార్డును కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకుంది. ఇది ఒక పురస్కారం మాత్రమే కాదు. పట్టణ పరిశుభ్రతలో ఒక నగరం తనను తాను ఎలా మార్చుకోగలదో చూపించిన ఒక మేలిమి మైలురాయి.
2026 – మరో చరిత్రాత్మక అధ్యాయం
150 ఏళ్ల ప్రయాణం ముగింపు దశకు చేరుతున్న 2026లో కూడా ఒంగోలు తన విజయదుందుబిని కొనసాగిస్తూనే ఉంది. 19 సెప్టెంబర్ 2026న, ఒకే రోజు, ఒకే గంటలో, ఒకే లక్ష్యంతో 80,315 గృహాల నుంచి వేరు చేసిన తడి చెత్త, పొడి చెత్తను సేకరించడం ద్వారా ఒంగోలు నగరపాలక సంస్థ మరో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. ఈ కార్యక్రమంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ లో ఒంగోలు పేరు నమోదు చేసుకుని సగర్వంగా తలెత్తుకు నిలబడింది.
ఒకప్పుడు ఎద్దుల బండ్ల చప్పుళ్లు వినిపించిన ఈ నేలపై నేడు ఈవీ వాహనాలు పరుగులు తీస్తున్నాయి. ఒకప్పుడు నూనె దీపాల వెలుగులో జీవితం సాగిన చోట నేడు విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఒకప్పుడు కొద్దిమంది పిల్లలతో మొదలైన విద్యా ప్రయాణం నేడు విశ్వవిద్యాలయాలతో విశ్వానికి చేరింది. ఒకప్పుడు చిన్న డిస్పెన్సరీతో మొదలైన వైద్య ప్రయాణం నేడు వైద్య విద్య, ఆధునిక వైద్య సేవల వరకు విస్తరించింది. ఒకప్పుడు వీధి చివర చెత్త పడేసే పరిస్థితి నుంచి శాస్త్రీయ వ్యర్థ నిర్వహణ వరకు ప్రయాణం సాగింది.
150 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఒంగోలు పట్టణం చెలిమలా మొదలై మహానదిలా విస్తరించింది. జనాభా పెరిగింది. విద్య కొత్త రూపు సంతరించుకుంది. వైద్యం కొత్త పుంతలు తొక్కింది. వ్యాపారం మారింది. రవాణాలో వేగం పెరిగింది. పారిశుధ్యం కొత్త సాంకేతికతను అందుకుంది. 1970లో ప్రకాశం జిల్లా కేంద్రంగా ఒంగోలు కొత్త బాధ్యతను స్వీకరించింది. తరువాత నగరంగా విస్తరించి, 2012లో నగరపాలక సంస్థ స్థాయికి చేరుకుంది. 1876లో వేసిన చిన్న పురపాలక అడుగు… 2026 నాటికి నూట యాభై వసంతాల మహాప్రస్థానంగా మారింది.
చివరగా ఒంగోలు అంటే మట్టిలో మూలాలున్న నగరం. మధుర జ్ఞాపకాలతో జీవించే చిరంజీవ నగరం. మార్పును ఆహ్వానించే మహానగరం. తన చరిత్రను భవిష్యత్తుకు అందించి భావితరాలకు బాటలు వేసే భాగ్యనగరం.
నూట యాభై ఏళ్ల పౌర పాలనా వైభవానికి…
తరతరాల శ్రమైక సౌందర్యానికి…
ఈ ఎర్రనేల ఎలుగెత్తే ఆత్మగౌరవానికి…
శిరస్సు వంచి నమస్కరిస్తూ…
జయహో ఒంగోలు!
జయ జయహో ఒంగోలు!
మంచిపగడం దేవదాస్
జర్నలిస్ట్

























































