పిన్నెల్లి పరిస్థితి ఏంటో?
అధికారం అండ, పోలీసుల సహకారంతో ఎన్నికల ముందు చెలరేగిపోయిన పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
నేటితో మధ్యంతర బెయిల్ గడువు పూర్తి
హైకోర్టుకు హాజరు కావాల్సిందే
ఈవీఎం ధ్వంసం కేసులో ‘బెయిల్’పై ఇటీవల సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
నరసరావుపేట, జూన్ 5 -: అధికారం అండ, పోలీసుల సహకారంతో ఎన్నికల ముందు చెలరేగిపోయిన పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. హత్యాయత్నం, పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం తదితర కేసుల్లో హైకోర్టు ఆయనకు ఇచ్చిన ముందస్తు బెయిల్ గడువు గురువారంతో ముగియనున్నది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం నరసరావుపేటలో ఉన్న ఆయన ఎస్పీ కార్యాలయంలో రోజూ సంతకం చేస్తున్నారు. గురువారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. పాల్వాయిగేట్ టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పిటిషన్ నేపథ్యంలో పిన్నెల్లి ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తిరిగి ఆయనకు కోర్టులో ఊరట లభించకపోవచ్చని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఈవీఎంను పగులగొట్టిన కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు తప్పు పట్టింది. ఇలాంటి కేసులో పిన్నెల్లికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడమంటే వ్యవస్థను పూర్తిగా అవహేళన చేయడమేనని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు.
వెంకట్రామిరెడ్డి ఎక్కడో..?
ఎన్నికల హింస కేసుల్లో ప్రధాన నిందితుడు, షాడో ఎమ్మెల్యేగా అరాచకాలు జరిపించిన పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి కూడా తప్పించుకు తిరుగుతున్నారు. హత్యాయత్నం కేసులో ఆయన అరెస్టుకు పోలీసులు కనీస ప్రయత్నాలు కూడా చేయడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.