శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారి వివరాలు
శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారు 1935 జూన్ 23న శ్రీ పిచ్చయ్య, శ్రీమతి వెంకాయమ్మ గార్ల దంపతులకు తెనాలి డివిజన్, కొల్లూరు మండలం, దోసేపూడిలో జన్మించారు.బాల్యం మొత్తం అక్కడే సాగింది. వ్యవసాయ కుటంబం లో పుట్టిన శ్రీ భాస్కరరావు గారు చదువుల్లో రాణించారు. దేశ భక్తి భావాలు కలిగిన వ్యక్తి కావడంతో చదువుకునే రోజుల్లోనే రాజకీయ ప్రభావం ఆయనపై ఎక్కువగా ఉండేది. సమకాలీన రాజకీయాలు, సమాజంలోని పరిస్థితుల పట్ల ఆయన ఎప్పటికప్పుడు స్పందించేవారు. హైదరాబాద్ లో బీఏ పూర్తి చేసి అక్కడే లా ఈవెనింగ్ కాలేజీలో బి.ఏ.ఎల్.ఎల్.బి (BA.LLB), ఎల్ఎస్ జీడీపట్టాలు పొంది న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. 1959లో శ్రీమతి లలిత గారిని వివాహం చేసుకున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు.శ్రీ భాస్కర్ రావు గారుఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో ప్రముఖ న్యాయవాదిగా పేరు గడించారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి…
న్యాయవాదిగా బిజీగా ఉంటూనే రాజకీయాల్లోకి శ్రీ భాస్కరరావు గారు అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఇందిరా కాంగ్రెస్ లో ఏపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు.1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1978 నుంచి 1989 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.1984లో ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16వ తేదీ వరకు నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. శ్రీ మర్రి చెన్నారెడ్డి గారు, శ్రీ టి. అంజయ్య గారి హయాంలో మంత్రివర్గంలో పని చేశారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుంచి 12వ లోక్ సభకు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.
** ఆంధ్రుల ఆత్మాభిమానం నినాదంతో 1982 మార్చి 29న శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు దేశం పార్టీని స్థాపించారు. 1983 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి గా ఎన్టీఆర్ హయాంలో శ్రీ భాస్కర్ రావు గారు ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో జరిగిన పరిణామాలతో రాజకీయాలను కొంతదూరం నిలిచారు.
** శ్రీ భాస్కరరావు గారికి ఇద్దరు కుమారులు. శ్రీ మురళీ, శ్రీ మనోహర్ లు.
చిన్న కుమారుడు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట డిప్యూటీ స్పీకర్ గా, 2011 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట చివరి శాసనసభాపతిగా సేవలు అందించారు. 2018లో శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చేరారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ గా పార్టీ కోసం విశేష సేవలు అందించారు. 2024లో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలిచి, ప్రసుత్తం రాష్ర్ట పౌరసరఫరాలు ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు.















































