దెబ్బతిన్న చోటే బెబ్బులిలా..!
2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి విడదల రజని తిరిగి అక్కడ గెలవలేననే భయంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వలస వచ్చారు.
మంగళగిరిలో భారీ మెజారిటీతో లోకేశ్ విజయ ఢంకా.. 91వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపు
4 దశాబ్దాల తర్వాత మంగళగిరిలో పచ్చజెండా రెపరెపలు
2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి విడదల రజని తిరిగి అక్కడ గెలవలేననే భయంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వలస వచ్చారు. ఇంతకుముందు వేమూరు నుంచి గెలిచిన వైసీపీ నాయకుడు మేరుగ నాగార్జున ఓటమిని తప్పించుకోవడానికి ఈసారి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం వరకూ వెళ్లారు. అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ విషయంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్ అప్పట్లో వైసీపీ హవా కొనసాగడంతో పరాజయాన్ని చవి చూసినప్పటికీ మరో నియోజకవర్గానికి వలస వెళ్లాలనే ఆలోచన చేయలేదు. అయితే, ఈసారి కూడా మంగళగిరిలో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు కుయుక్తులు పన్నారు. బీసీ కార్డును తెరపైకి తీసుకొచ్చారు. సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తప్పించి పద్మశాలి సామాజికవర్గానికి చెందిన మహిళను బరిలోకి దించినా ఓటర్లు లోకేశ్‌కే కొండంత అండగా నిలిచారు. లోకేశ్‌కు మొత్తం 1,67,710 ఓట్లు పోలవ్వగా, వైసీపీ అభ్యర్థి లావణ్యకు 76,297 ఓట్లు మాత్రమే లభించాయి. అంటే 91,413 ఓట్ల భారీ మెజార్టీతో లోకేశ్ గెలిచారు. మరోవైపు దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత తిరిగి అక్కడ టీడీపీకి విజయం దక్కింది. దీంతో అక్కడపార్టీ శ్రేణులు దీపావళిని తలపించేలా సంబరాలు చేసుకుంటున్నారు.