ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేసేందుకు డిజిటల్ యాప్ ను ప్రారంభించిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
విజయవాడ, అక్టోబర్ 8:
ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ రూపొందించిన సమీకృత మొబైల్, వెబ్ అప్లికేషన్‌ను ఆ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి గురువారం విజయవాడలోని తన కార్యాలయంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు సమాచారాన్ని స్వీకరించే విధానంలో గణనీయమైన మార్పులు వచ్చాయని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సమాచారాన్ని వేగంగా, డిజిటల్, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అందించాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన ప్రామాణిక సమాచారాన్ని అత్యంత వేగంగా ప్రజలకు చేరవేయడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రభుత్వం, మీడియా, ప్రజల మధ్య మరింత బలమైన డిజిటల్ వారధిగా ఈ యాప్ పనిచేస్తుందని పేర్కొన్నారు.
మాన్యువల్ ప్రక్రియలను డిజిటల్ విధానంలోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వం ప్రజలతో మరింత అనుసంధానం కావడానికి ఈ యాప్ దోహదపడుతుందని మంత్రి తెలిపారు. యాప్ రూపకల్పన, వినియోగంలోకి తీసుకురావడనికి కృషి చేసిన శాఖ సంచాలకులు కే. విశ్వనాథన్, ఐఏఎస్ ను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా యాప్ రూపకల్పనలో భాగస్వాములైన సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు, సాంకేతిక బృందాన్ని కూడా మంత్రి అభినందించారు. సరైన సమాచారాన్ని సరైన సమయంలో, సరైన డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రజలకు చేరవేసేలా సాంకేతికతను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కే. విశ్వనాథన్, ఐఏఎస్ మాట్లాడుతూ, పత్రికా ప్రకటనలు, ఎలక్ట్రానిక్ మీడియా, అవుట్‌డోర్ మీడియా, ఫ్యాక్ట్ చెక్, కేడర్ మేనేజ్‌మెంట్ తదితర విభాగల సమాచారాన్ని సమీకరించి ఈ డిజిటల్ యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వ సమాచార ప్రసారం, మీడియా నిర్వహణ, పౌర సంబంధాలు, వాస్తవాల ధృవీకరణ, ప్రకటనలు, కేడర్ నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వివరించారు.
మొబైల్ అప్లికేషన్ ద్వారా అధికారులు ఎక్కడి నుంచైనా శాఖకు సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాలను పర్యవేక్షించవచ్చని తెలిపారు. అంతే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు కూడా వార్తా విశేషాలు, ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచార ప్రసార కార్యకలాపాలను ఈ యాప్ ద్వారా ప్రజలకు చేరవేసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. దీని వలన క్షేత్రస్థాయి సమాచారం కూడా ప్రజలకు వేగంగా అందుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఓ. మధుసూదన్, రీజనల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ టి. నాగరాజు, మీడియా రిలేషన్స్ విభాగం ఉప సంచాలకులు దున్న రమేష్, డిజిటల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. రాణి సుస్మిత, ప్రత్యేక అధికారి గల్లా శేషు కుమార్ తదితరులు పాల్గొన్నారు.















































