Jagan is hilarious !
Jagan : జగన్ హాహాకారాలు!
పట్టపగలు ప్రత్యర్థులపై పగబట్టి.. వెంటాడి.. వేటాడి వైసీపీ వర్గీయులు హత్యాకాండ.
నాడు తన వాళ్లు దౌర్జన్యాలు చేస్తే ‘బీపీ’!
నేడు బాధితులు ఎదురుతిరిగితే దాడులా?
హింస, హత్యాకాండలకు ఐదేళ్లపాటు దన్ను
నాడు తన వాళ్లు దౌర్జన్యాలు చేస్తే ‘బీపీ’!.. నేడు బాధితులు ఎదురుతిరిగితే దాడులా?
‘అది దాడి కాదు. వారి భావప్రకటనా స్వేచ్ఛ. రాజ్యాంగంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. చెప్పులు విసరడం కూడా ఒకరకమైన భావప్రకటనా స్వేచ్ఛే.’
అమరావతి రాజధాని గ్రామాల పర్యటనలో చంద్రబాబుపై కర్రలు, చెప్పులు విసిరిన ఘటనపై నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్
‘నన్ను తిట్టే బూతులు వినలేక, తట్టుకోలేక నా అభిమానులు, నన్ను ప్రేమించే వారు టీవీ చూసేటప్పుడు వాటిని వినలేక ఎవరికో బీపీ వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రియాక్షన్ చూపించారు.’
టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకదాడికి పాల్పడిన తరువాత సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ మాటలు
అమరావతి
పట్టపగలు ప్రత్యర్థులపై పగబట్టి.. వెంటాడి.. వేటాడి వైసీపీ వర్గీయులు హత్యాకాండ.. దౌర్జన్యకాండ చేస్తే.. ‘బ్లడ్ ప్రెషర్’ పెరిగి అలా చేశారంటూ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెనకేసుకొచ్చారు. తాజా ఎన్నికల ఫలితాల తర్వాత అనవసరంగా కవ్వింపులకు దిగుతున్న వైసీపీ కార్యకర్తలపై బాధితులు ఎదురుతిరుగుతుంటే మాత్రం.. పచ్చమూకలు హింసాకాండకు పాల్పడుతున్నాయని ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ కార్యకర్తలు ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపైనే దాడిచేసి అక్కడ కనిపించిన వారందరినీ కర్రలు, మారణాయుధాలతో చితకబాదితే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పైనే హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించారు. ఐదేళ్లు ఇలాగే అరాచకం సృష్టించి.. ఎవరు నోరు మెదిపినా దాడులు చేస్తూ.. తప్పుడు కేసులు పెట్టి నోటీసులతో పనిలేకుండా.. అర్ధరాత్రి గోడలు దూకి.. బెడ్రూంలలో ఉన్నా టీడీపీ నేతలను అరెస్టు చేసి తీసుకెళ్లిన సంగతి ఆయన మరచిపోయారు. గతంలో బాధితులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసులు నమోదు కాలేదు. పైగా కేసులు పెట్టడానికి వెళ్లినవారిపై పోలీసుల సమక్షంలోనే దాడులకు దిగిన ఉదంతాలు కోకొల్లలు. ఇప్పుడు అధికారం కోల్పోయిన రెండ్రోజులకే తన కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ జగన్ హడావుడి చేస్తున్నారు. ‘ఐదేళ్లుగా పటిష్ఠంగా ఉన్న శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అంతే.. నీలి, కూలి చానళ్లు ప్రత్యేక కథనాలు వండివార్చేయడం మొదలెట్టాయి. గత నెల 13వ తేదీన పోలింగ్ రోజు మాచర్లలో నాటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను బద్దలు కొడితే.. ఇవి కళ్లూ చెవులు, నోరు కూడా మూసేసుకున్నాయి. ఇప్పుడు జగన్‌కు అనుకూలంగా ఓ సెఫాలజిస్టు ఇచ్చిన సర్వేను నమ్మి ఒక యువకుడు బెట్టింగులు కాసి.. ఫలితాలు తారుమారు కావడంతో దెబ్బతిని ఆత్మహత్య చేసుకుంటే.. టీడీపీ సోషల్ మీడియా వేధింపుల వల్లే చనిపోయాడని.. రాష్ట్రం రావణ కాష్ఠమైపోయిందని నానా గొడవ చేశాయి. అసలు సంగతి బయటపడ్డాక నోరుమెదపడం లేదు.
వీటిపై నాడు స్పందించలేదేం?
దళిత వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్‌ను కరోనా సమయంలో మాస్కులు అడిగిన పాపానికి సస్పెండ్ చేశారు. నడిరోడ్డుపై లాఠీలతో కొట్టించారు. మానసిక రోగిగా చిత్రీకరించి మెంటల్ ఆస్పత్రిలో పడేశారు. హైకోర్టు జోక్యంతో ఆయన విడుదలయ్యారు. లేకపోతే అక్కడే చంపేసేవాళ్లు. చివరికి మానసిక వేదనకు గురై గుండెపోటుతో ఆయన చనిపోయారు. అయినా జగన్ స్పందించలేదు.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఇసుక లారీలను అడ్డుకున్నందుకు.. దళిత యువకుడికి శిరోముండనం చేశారు. రాష్ట్రపతి వరకు వెళ్లినా ఇంతవరకు నిందితులపై చర్యల్లేవు. సీఎస్ నుంచి ఎస్సై దాకా అందరూ కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా.. దాడులు చేశారు. కిడ్నాపులు చేశారు. నామినేషన్ పత్రాలను చించేశారు. బలవంతంగా ఉపసంహరణ సంతకాలు చేయించారు. కొన్ని చోట్ల ఫోర్జరీ సంతకాలు కూడా చేసి పోటీలో లేకుండా చేశారు. తనకే ప్రజాదరణ ఉందని చాటుకునేందుకు నాడు జగన్ చేయని అకమ్రాల్లేవు. మాచర్లలో ఇలాగే టీడీపీ అభ్యర్థులపై దాడులు జరిగితే పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ బృందాన్ని పిన్నెల్లి అనుచరుడు తురకా కిశోర్ చంపడానికి ప్రయత్నిస్తే కేసు కూడా లేదు. పైగా మున్సిపల్ చైర్మన్‌ను చేశారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనూ ఇలాగే బెదిరించి హింసాకాండ సృష్టించి ఏకగ్రీవాలు చేసుకున్నారు.
జగన్‌కు అత్యంత సన్నిహితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. తన దళిత డ్రైవర్‌ను చంపేసి మృతదేహాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేస్తే కఠినంగా శిక్షించాల్సింది పోయి.. అతడికి బెయుల్ లభించేందుకు చేయాల్సిందంతా చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం చాంబర్లోకి అనంతబాబుకు ఏకంగా గ్రీన్ చానల్ కల్పించారు.
ప్రభుత్వానికి, జగన్‌కు వ్యతిరేకంగా ఎవరైనా సోషల్ మీడియాలో స్పందిస్తే చాలు.. సీఐడీ పోలీసులు, వైసీపీ నేతలు వారి ఇళ్లకు వెళ్లి దాడులు చేయడం.. వృద్ధులైనా, మహిళలైనా పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లడం వంటి అకృత్యాలకు పాల్పడ్డారు.
సాక్షాత్తూ అసెంబ్లీ వేదికగా చంద్రబాబు భార్య భువనేశ్వరిపై నాటి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సభలోనే ఉన్న జగన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ మరింత రెచ్చగొట్టారు. సభ్యులను మందలించాల్సిన నాటి సభాపతి తమ్మినేని సీతారాం కూడా.. చంద్రబాబుకు మైకు ఇవ్వలేదు. దీంతో ఈ కౌరవ సభలో ఇక తాను ఉండనని.. మళ్లీ సీఎంగానే గౌరవ సభలో అడుగుపెడతానని శపథం చేసి బయటకు వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోతుంటే జగన్ అండ్ కో గేలిచేశారు.
సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి జోగి రమేశ్ బూతుల దండకం చదువుతుంటే.. జగన్ నవ్వుతూ మరింత ప్రోత్సహించారు. అంతకుముందు ఇదే జోగి చంద్రబాబు ఇంటి మీదకు దాడికి వెళ్తానని ఒకరోజు ముందే చెప్పి.. మందీమార్బలంతో వెళ్తే పోలీసులు కనీసం అడ్డుకోలేదు. ఆయనకు జగన్ బహుమతిగా మంత్రి పదవి కట్టబెట్టారు.
కేడర్ జారిపోతారనే..
మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధులని కూడా చూడకుండా వైసీపీ మూకలు దాడులు చేస్తుంటే.. నోరెత్తని జగన్ .. ఇప్పుడు సుద్దపూసలా మాట్లాడుతున్నారు. కనీవినీ ఎరుగని పరాజయంతో షాకులో ఉన్న ఆయన.. సీబీఐ, ఈడీ కేసుల భయంతో గజగజ వణికిపోతున్నారు. రాజకీయంగానూ కేడర్ దూరమైపోతుందన్న భయంతో.. వారు జారిపోకుండా చూసుకోవడానికి రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందంటూ హాహాకారాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు ఎద్దేవాచేస్తున్నాయి. ఆయన ఐదేళ్ల విధ్వంస పాలన చూసిన జనం.. ఇలాంటి చౌకబారు ఎత్తులను విశ్వసించరని అంటున్నాయి.
ప్రజాస్వామ్యానికి పెనుముప్పంటూ
రెండో రోజూ ట్వీట్
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి అంటూ జగన్ ఎక్స్‌లో రెండవరోజు శుక్రవారమూ స్పందించారు. ‘చంద్రబాబు రాజకీయ కక్ష సాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రా ంగం మొత్తం నిర్వీర్యమైపోయింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకూ రక్షణ లేకుండా పో యింది. ఉన్నత చదువులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభాంత్రులకు గురిచేస్తున్నారు. గౌరవ గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా’ అని జగన్ పేర్కొన్నారు.