ADVERTISEMENT
రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది
•వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు
•డిశంబరు 1 కల్లా ఖరీఫ్ పంట నష్టపోయిన రైతుల జాబితా సిద్దం
•రబీలో ప్రత్యామ్నాయ పంటలపై ప్రణాళిక సిద్దం, రైతుల్లో అవగాహన కల్పిస్తాం
•రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇ-క్రాప్ అప్లికేషన్ కు తొలిసారిగా స్కాచ్ అవార్డు
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి
అమరావతి, నవంబరు 23: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు. రైతు పక్షపాతి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నంత వరకూ రాష్ట్రంలోని రైతులు ఎవరూ ఆంధోళన చెందాల్సిన పనిలేదని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికారులు అందరూ ఎంతో సమర్థవంతంగా కృషిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. సాధారణ పరిస్థితుల కంటే విభిన్నమైన వర్షాబావ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్న దృష్ట్యా వ్యవసాయ అనుబంద శాఖల ఉన్నతాధికారులతో గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎటు వంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి, రైతులకు ఏ విధంగా అండగా నిలవాలనే ప్రధానమైన అజెండాతో ఈ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించిన 7 జిల్లాలోని 103 కరువు మండలాల్లో నెలకొన్న పరిస్థితులు, కరువు పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు అధికారులు చేపట్టిన చర్యలను, ఖరీఫ్ పంట నష్ట అంచనా పనుల ప్రగతిని, రబీలో ప్రత్యామ్నయ ప్రణాళికల అమలు తదితర అంశాలపై మంత్రి ఈ సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి పరంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు, కరువును నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటు వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపట్టిందని ఆయన తెలిపారు. 7 జిల్లాల్లోని 103 కరువు మండలాల్లో పంట నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడం జరుగుతుంది, అదే సమయంలో కరువు మండలాలుగా ప్రకటించని మండలాల్లో జరిగిన నష్టాన్ని కూడా ఇన్పుట్స్ సబ్సిడీ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందన్నారు.
రైతు బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే సిద్దాంతాన్ని నమ్మిన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాను సారం రాష్ట్రంలోని రైతులను ఎటు వంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాలలైనటు వంటి ముందస్తు చర్యలు చేపడుతున్నామని, రైతులకు అన్ని విధాలుగా సంతృప్తి కరంగా ఉండే చర్యలను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడైతే వర్షాభావ పరిస్థితులు నెలకొనడం మొదలయ్యాయో అప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి స్పందించి రాష్ట్ర మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమై ఏ విధంగా ఈ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాలి అనే అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగిందన్నారు. గతంలో ఉన్న 25 శాతం విత్తన సబ్సిడీని 40 శాతానికి పెంచడం వంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ముందుగానే తీసుకోవడం జరిగిందన్నారు.
అదే విధంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను మరియు అన్ని రకాలైన ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని ఇప్పటికే 7 జిల్లాల్లోని 103 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు. వీటిలో 80 మండలాల్లో తీవ్రంగాను, 23 మండలాల్లో మోస్తరుగాను కరువు పరిస్థితులు నెలకొన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అవసరమైన సాయం కోసం కేంద్రానికి త్వరలో నివేదిక పంపనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర బృందం రాష్ట్రంలో త్వరలో పర్యటించనన్నదని, ఆ బృందం పర్యటన తదుపరి ఇన్పుట్ సబ్సిడీ, రుణాల రీషెడ్యూలింగ్, ఉపాధి హామీ పనులను 100 నుండి 150 రోజులకు పెంచే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
అదే విధంగా కరువు మండలాల్లో జరిగిన ఖరీఫ్ పంటనష్టాన్ని అంచనా వేసేందుకు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటిస్తున్నారని, నేటితో పంట నష్ట అంచనా కార్యక్రమాలు పూర్తి అవుతున్నాయని తెలిపారు. సోషల్ ఆడిట్ కై ఈ నెల 29 న గ్రామ సచివాలయాల్లో పంట నష్టపోయిన జాబితాలను ఉంచేందుకు అధికారులు సిద్దం అవుతున్నారని, డిశంబరు 1 కల్లా ఖరీప్ పంట నష్టపోయిన రైతుల తుది జాబితా సిద్దం అవుతుందని మంత్రి తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వినూత్న నిర్ణయం తీసుకుని నోటిఫైడ్ పంటలు పండే ప్రతి సెంటు భూమికి ఇన్సూరెన్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఇందులో బాగంగా ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిసి భీమా సౌకర్యాన్ని రైతులకు కల్పించడం జరిగిందన్నారు. అదే విధంగా రైతులు చెల్లించాల్సిన ప్రీమియమ్ సొమ్మును కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇ-క్రాప్ బుకింగ్ ఆధారంగా ఈ భీమా సౌకర్యాన్ని కల్సిస్తున్న నేపథ్యంలో నోటిఫైడ్ పంట పండే ప్రతి సెంటు పొలానికి భీమా సౌకర్యాన్ని కల్పించడం జరుగుచున్నదన్నారు.
అయితే ప్రస్తుతం అమల్లోనున్న విధివిధానాలకు అనుగుణంగా ఏమైన కొన్ని మండలాలు కరువు మండలాలుగా ప్రకటించకపోయినప్పటికీ, ఆయా ప్రాంతాల్లో జరిగిన పంట నష్టానికి ఇన్పుట్స్ సబ్సిడీ ద్వారా రైతులకు ఏమాత్రం నష్టం కలుగకుండా అన్ని రకాల చర్యలను తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం మీద రైతులకు ఎక్కడా కూడా ఎటు వంటి నష్టం కలుగ కుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం అందించేందుకు చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు.
రబీకి ప్రత్యామ్నాయ ప్ర్రణాళిక సిద్దం…..
అదే విధంగా రభీకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ప్రత్యామ్నాయ ప్రణాళికలను ఇప్పటికే రూపొందించినట్లు మంత్రి తెలిపారు. స్వల్ప కాలంలో చేతికొచ్చే పంటల సాగుకు సంబందించి ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు తగు సూచనలు ఇచ్చారని, అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించి అమలు పరుస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
అయితే కరువు మండలాలకు సంబందించి ప్రతి పక్షపార్టీలు రాజకీయం చేయడం, రైతులను ఈ ప్రభుత్వం సరిగా ఆదుకోలేదు అని వార్తలు వ్రాయించడం సరికాదన్నారు. రైతుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే ఇటు వంటి దుష్ప్రాచారాన్ని మానుకోవాలని ప్రతి పక్ష పార్టీలకు ఆయన హితవు పలికారు.
ఇ-క్రాప్ అప్లికేషన్ కు స్కాచ్ అవార్డు…..
రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇ-క్రాప్ అప్లికేషన్ కు స్కాచ్ అవార్డు రావడం ఎంతో అభినందనీయమైన విషయమని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఇ-క్రాప్ అప్లికేషన్ వినూత్న రీతిలో అమలు పరుస్తూ నోటిఫైడ్ పంటలు పండించే రైతుల ప్రతి సెంటు భూమికి భీమా సౌకర్యాన్ని కల్పించడం ఎంతో ప్రతిభావంతమైన విషయమని, అటు వంటి ప్రతిభావంతమైన నిర్ణయాన్ని తీసుకుని రాష్ట్రంలో ఇ-క్రాఫ్ విధానాన్ని అమలు పరుస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఈ అప్లికేషన్ ను ఎంతో సమర్థవంతంగా అమలు పరుస్తున్న అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు .
రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ హరికిరణ్, ఉద్యానవన శాఖ కమిషనర్ ఎస్. శ్రీధర్ తో పాటు వ్యవసాయ అనుబంధ శాఖలకు చెందిన పలువురు అధికారులు ఈ సమావేశం పాల్గొన్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT