జాతీయ సరస్ మేళాలో రూ.7 కోట్ల వ్యాపారం
- దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులకు విశేష ఆదరణ
- కుటుంబ సమేతంగా మేళాను సందర్శించి మహిళా సాధికారతకు తోడ్పడండి
- ఎన్టీఆర్ జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ.ఎన్.వి. నాంచారరావు
విజయవాడలోని పున్నమి ఘాట్‌లో ఈ నెల 13వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా–2026కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఎన్టీఆర్ జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ.ఎన్.వి. నాంచారరావు తెలిపారు. ఇప్పటివరకు మేళాలో సుమారు రూ.7 కోట్ల వ్యాపారం జరిగినట్లు వెల్లడించారు.
సాధారణంగా ఢిల్లీ, నోయిడా, గుర్గావ్ వంటి ప్రాంతాల్లో నిర్వహించే జాతీయ స్థాయి సరస్ మేళాను తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నిర్వహించడం విశేషమని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు, చేతివృత్తుల కళాకారులు ఈ మేళాలో పాల్గొంటూ తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయిస్తున్నారని తెలిపారు.
587 స్టాళ్లలో వివిధ రకాల ఉత్పత్తులు
మేళా ప్రాంగణంలో మొత్తం 587 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు నాంచారరావు తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళల కోసం 210 స్టాళ్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. మహిళలు తయారు చేసిన హస్తకళలు, చేనేత వస్త్రాలు, టెక్స్టైల్స్, వివిధ రకాల ఆహార ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు స్టాళ్లను ఉచితంగా కేటాయించడం ద్వారా వారికి మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. జాతీయ సరస్ మేళా మహిళల ఆర్థిక స్వావలంబనకు, గ్రామీణ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించేందుకు దోహదపడుతోందని వివరించారు.
50 స్టాళ్లతో ప్రత్యేక ఫుడ్ కోర్ట్
వివిధ రాష్ట్రాల సంప్రదాయ రుచులను ప్రజలకు పరిచయం చేసేందుకు కుడుంబశ్రీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 50 స్టాళ్లతో ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక ఆహార పదార్థాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సందర్శకులు ఒకే ప్రాంగణంలో వివిధ రాష్ట్రాల ఆహార సంస్కృతులను ఆస్వాదించే అవకాశం ఉందన్నారు.
సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు
మేళాకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు నాంచారరావు తెలిపారు. ప్రాంగణ పరిశుభ్రత కోసం 470 మంది పారిశుధ్య సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. అగ్నిమాపక, విద్యుత్, వైద్య, పోలీస్, ఆర్టీసీ తదితర శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.
మేళాకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదని, ప్రజలందరూ ఉచితంగా సందర్శించవచ్చని తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతిరోజూ సాయంత్రం రెండు గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మహిళా సాధికారతకు ప్రజలు సహకరించాలి
నగరవాసులు, పరిసర ప్రాంతాల ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ సరస్ మేళాను సందర్శించాలని నాంచారరావు కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. గ్రామీణ మహిళల ప్రతిభను ప్రోత్సహిస్తూ, స్థానిక ఉత్పత్తులకు ఆదరణ కల్పించడం ద్వారా మహిళా సాధికారతను బలోపేతం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

























































