350 కోట్లు ‘సాఫ్ట్’గానే దోచేశారు
గనుల శాఖలో మరో భారీ గోల్‌మాల్ బయటపడింది. రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 300కుపైగా భారీ, చిన్న తరహా ఖనిజాలు(మినరల్స్) వేలం వేశారు. జగన్ ప్రభుత్వ పెద్దలు చెప్పిన వారికే ఈ వేలంలో ఖనిజాలు కట్టబెట్టారు.
సాంకేతికతను అడ్డుపెట్టుకుని కుమ్మక్కు దందా
మినరల్స్ వేలంలో ఐటీ విభాగమే కీలకం
ఆ విభాగంలోకి కడప ఎంపీ అవినాశ్ మనిషి
సాఫ్ట్‌వేర్, టెండర్లు, అప్లికేషన్ల తాళాలు,
డాంగిల్స్ అన్నీ ఆయన దగ్గరే..
ముందుగానే ‘అసలు విలువ’ లీకు
సాఫ్ట్‌వేర్ ఇంజనీరు నుంచి ఉన్నతాధికారి దాకా
అమరావతి
గనుల శాఖలో మరో భారీ గోల్‌మాల్ బయటపడింది. రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 300కుపైగా భారీ, చిన్న తరహా ఖనిజాలు(మినరల్స్) వేలం వేశారు. జగన్ ప్రభుత్వ పెద్దలు చెప్పిన వారికే ఈ వేలంలో ఖనిజాలు కట్టబెట్టారు. దీనికోసం బిడ్ ‘అసలు విలువ’ను ముందే లీకు చేయడం ద్వారా సర్కారుకు సుమారు 500 కోట్లపైనే గండికొట్టారు. అధికారులు అక్షరాలా రూ.350 కోట్లపైనే జేబులో వేసుకున్నారు. సాంకేతికతను అడ్డంపెట్టుకొని అధికారులు భారీ గోల్‌మాల్‌కు పాల్పడిన తీరు ఇదీ. ఈ దందాలో ఓ ఉన్నతాధికారి, మరో ముగ్గురు సీనియర్, జూనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈవ్యవహారంలో సాఫ్ట్‌వేర్ తాళం చేతులు కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సిఫారసు చేసిన వ్యక్తికే ఇచ్చారు. అంతే.. ‘మీది కడపే…మాది కడపే’ అంటూ అందినకాడికి దండుకున్నారు. సర్కారు ప్రయోజనాలను పణంగాపెట్టి జేబులు నింపుకొన్నారు. అసలేం జరిగిందంటే…
వేర్వేరు పేర్లతో ఒక్కరితోనే పలు బిడ్లు
గనుల శాఖలో ఇంతకు ముందు భారీ ఖనిజాల తవ్వకం కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే ప్రాధాన్యత ఇచ్చేవారు. దీంతో అస్మదీయులు, అయిన వారికి లీజులు దక్కేవికావు. అయితే, 2022లో కేంద్రం భారీ ఖనిజాల లీజులకు వేలం (ఆక్షన్) విధానం తీసుకొచ్చింది. ఇదే విధానం ఆంధ్రాలోనూ అమలుచేశారు. అయితే, కేంద్రం చెప్పిన పారదర్శక పద్ధతిలో కాకుండా కుమ్మక్కు విధానంలో నడిపించారు. అదెలాగంటే… గనుల శాఖ డైరెక్టర్ (డీఎంజీ) నిర్వహించే ఖనిజాల లీజుల వేలంలో ఐటీ విభాగానిదే కీలకపాత్ర. ఇందుకోసం ప్రత్యేకసాఫ్ట్‌వేర్‌ను, అప్లికేషన్‌ను రూపొందించారు. ఎవరెవరు వేలంలో పాల్గొన్నారు, బిడ్ విలువ ఏ మేరకు కోట్ చేశారు? అందులో ఎక్కువ విలువ కోట్ చేసిందెవరో తెలుసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను తయారుచేశారు. ఎలాగూ వేలం పద్ధతే కాబట్టి, లీజు దక్కించుకునేందుకు సొంత మనుషులతోనే ఐదారు బిడ్‌లు వేయించేవారు. వారికి ముందుగానే ఎంత బిడ్ వేయాలో చెప్పారు. వారితోనే వేర్వేరు వ్యక్తులు, సంస్థల పేరిట ఐదారు బిడ్లు వేయించారు. ఒకరు రెండు కోట్లు, మరొకరు నాలుగు కోట్లు, ఇంకా ఆరు కోట్లమేర బిడ్‌లు వేయించేవారు. వేలానికి అవసరమైన టాప్ ఐదులో వారి మనుషులే ఉండేలా చూసేవారు. ఆ తర్వాత ఆ ఐదుగురితోనే వేలం నిర్వహించేవారు. ఇక ఎలాగూ ఆ ఐదు బిడ్‌లు ఒక్కరివే కావడంతో వేలంలో వారికే లీజులు వచ్చేవి. ఈ విధానం పక్కాగా సాగేందుకు ఐటీ విభాగంలో తమ సొంత మనిషినే సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఏర్పాటు చేసుకున్నారు.
పరారీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
గనుల శాఖ టెండర్లు, వేలంలో లీజు విలువను ముందుగానే లీక్‌చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శేఖర్ పరారీలో ఉన్నారని తెలిసింది. మాంగనీస్ టెండర్లలో పాల్గొన్న ఓ కాంట్రాక్టర్ సెక్యూరిటీ డిపాజిట్ సొమ్మును దారిమళ్లించి దోచుకున్న వ్యవహారంతోపాటు, మరికొన్ని దందాలో ఆయన పాత్ర ఉందని పోలీసు విచారణలో తేలింది. దీంతో గత వారం రోజులుగా పరారీలో ఉన్నారని ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. ఆయనను పట్టుకొని విచారిస్తే పెద్ద అధికారుల అవినీతి గుట్టు, మినరల్స్ లీజుల వేలం దందా బయటపడతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఆయన తన భార్య పోస్టును అడ్డంపెట్టుకొని పోలీసులు తనదాకా రాకుండా చూసుకుంటున్నారని తెలిసింది.