అమరావతి అభివృద్ధిలో రైతులు భాగస్వాములు కావాలి: లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం గ్రామసభల్లో కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్
ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణాన్ని వేగవంతం చేసే చర్యల్లో భాగంగా లింగాయపాలెం మరియు ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో శుక్రవారం APCRDA ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల్లో APCRDA కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్ గారు పాల్గొని, భూసమీకరణ మరియు గ్రామకంఠం సమస్యల పరిష్కారంపై రైతులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ, రాజధానిలో చేపట్టిన రహదారులు, ఎల్పీఎస్ (LPS) జోన్ల అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, రైతులు ఇప్పటికీ భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) విధానంలో చేరే అవకాశం ఉందని స్పష్టం చేశారు. భూసేకరణ కంటే భూసమీకరణ ద్వారా రైతులకు మెరుగైన ప్రయోజనాలు చేకూరుతాయని, కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
సభలో గ్రామస్తులు ప్రస్తావించిన గ్రామకంఠం సమస్యలపై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. గ్రామకంఠం ఇబ్బందులను పరిష్కరించి, రైతులకు ఊరట కలిగించేలా పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని, త్వరలోనే వీటికి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నందున, అభివృద్ధి ప్రక్రియలో రైతులు అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
అనంతరం వార్షిక కౌలు చెల్లింపుల గురించి ప్రస్తావిస్తూ, 12వ ఏడాది కౌలు జమ చేసే ప్రక్రియ కొనసాగుతోందని, ఆధార్ సీడింగ్ పెండింగ్‌లో ఉన్న రైతులు వెంటనే పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే రిటర్నబుల్ ప్లాట్లు పొందిన రైతులు తమ రిజిస్ట్రేషన్లను త్వరితగతిన ముగించుకోవాలని కోరారు.
ఈ గ్రామసభల్లో ఏపీసీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐఏఎస్, గుంటూరు జిల్లా జేసీ అశుతోష్ శ్రీవాస్తవ ఐఏఎస్, డైరెక్టర్- ల్యాండ్స్(క్యాపిటల్ సిటీ) ఎన్. వసంతరాయుడు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె.ఎస్.భాగ్యరేఖ, బి. సాయి శ్రీనివాస నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.











































