అమరావతిలో ఏర్పాటు కానున్న కిమ్స్ ఆసుపత్రి..పూర్తైన అగ్రిమెంట్
ప్రజారాజధాని అమరావతిలో వైద్య రంగ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. అమరావతిలో కార్పొరేట్ ఆసుపత్రి ఏర్పాటు కోసం కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(KIMS) సంస్థ, APCRDAతో గురువారం లీజు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆసుపత్రి స్థాపన ద్వారా అమరావతి పరిసర ప్రాంతాలకు ఆధునిక వైద్య సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి.
500 పడకల సామర్థ్యంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని అమరావతిలో నిర్మించి.. ఆధునిక వైద్య సదుపాయాలు, అత్యాధునిక చికిత్స సేవలు అందిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఈ ప్రాజెక్టు కోసం అమరావతిలోని మంగళగిరి మండలం నిడమర్రు రెవిన్యూ గ్రామంలో 2 ఎకరాల భూమిని APCRDA లీజ్ ప్రాతిపదికన కేటాయించింది. ఈ మేరకు లీజు అగ్రిమెంటుపై APCRDA తరఫున జాయింట్ డైరెక్టర్(ఎస్టేట్స్) జుబిన్ చిరాన్ రాయ్ ఒప్పందంపై సంతకం చేసి KIMS ప్రతినిధులకు అందజేశారు.














































