వాసుదేవరెడ్డి కారులో ఆరు కేజీల బంగారం కొనుగోళ్ల రసీదులు
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కారులో జరిపిన సోదాల్లో సుమారు ఆరు కేజీల బంగారం కొనుగోళ్లకు సంబంధించి రశీదులు దొరికాయని సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టుకు నివేదించారు.
ప్రాథమిక దశలో ‘బేవరేజెస్’ కేసు విచారణ
అరెస్ట్ నుంచి రక్షణకు హైకోర్టు నో
విచారణ ఈ నెల 18కి వాయిదా
అమరావతి, జూన్ 13: ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కారులో జరిపిన సోదాల్లో సుమారు ఆరు కేజీల బంగారం కొనుగోళ్లకు సంబంధించి రశీదులు దొరికాయని సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టుకు నివేదించారు. వాటి విలువ సుమారు రూ.నాలుగు కోట్లు ఉంటుందన్నారు. కారులో వాసుదేవరెడ్డి ఐడీ కార్డు కూడా దొరికిందన్నారు. వాసుదేవరెడ్డి కింద పనిచేసిన అధికారులు ఇప్పటికీ కార్పొరేషన్‌లోనే కొనసాగుతున్నారని, ఈ దశలో వాసుదేవరెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని తెలిపారు. పిటిషనర్‌పై మొదట ఐపీసీ సెక్షన్లు 427, 379, 120(బీ)కింద కేసు నమోదు చేశామని, ఆ తరువాత ఐపీసీ 420, 409, 467, 471 వంటి అదనపు సెక్షన్లను ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తూ సంబంధిత మేజిస్ట్రేట్ ముందు మెమో వేశామని తెలిపారు.
అర్నేశ్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు వాసుదేవరెడ్డికి వర్తించవన్నారు. మరోవైపు విజయవాడలోని వాసుదేవరెడ్డి ఇంటిని తెరిచి సోదాలు చేసేందుకు దిగువకోర్టు అనుమతి కోరామని, పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయమివ్వాలని కోరారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని అభ్యర్థించారు. ఈ వాదనలు న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వాసుదేవరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 18కి వాయిదా వేసింది. అరె్‌స్టతోపాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ‘ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్’ కేసులో తనకు ముందస్తు బెయిల్ కోరుతూ వాసుదేవరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. ఆయన తరఫున న్యాయవాది నగేఽశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు సీఐడీ తరఫున ఈ కేసులో వాదనలు వినిపించేందుకు న్యాయవాది ఎం.లక్ష్మీనారాయణ, సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.