వైసీపీని నమ్మి.. నట్టేట మునిగి!
అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ఓట్ల లెక్కింపునకు ముందు రోజు కూడా వైసీపీ అధినాయకత్వం పూర్తి ధీమాగా ఉంది.
బెట్టింగ్‌ల్లో భారీగా నష్టపోయిన అభిమానులు
చివరి రోజు వరకూ జగన్ గెలుపుపై ధీమా
నాయకత్వాన్ని నమ్మి పందేలు కాసిన వైనం
అప్పులు చేసి మరీ భారీగా బెట్టింగులు
ఫలితాల తారుమారుతో తీవ్రంగా నష్టం
అప్పులపాలై కొందరు ఆత్మహత్యలు
8 వేల కోట్ల పందేలు కాసినట్టు అంచనా
అమరావతి, జూన్ 5 : అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ఓట్ల లెక్కింపునకు ముందు రోజు కూడా వైసీపీ అధినాయకత్వం పూర్తి ధీమాగా ఉంది. ఈ సారి కూడా గెలుపు తమదేనని నమ్మకంగా చెప్పింది. నాయకత్వం ఇంత నమ్మకంగా చెబుతుంటే ఇక మనకు తిరుగేలేదని వైసీపీ అభిమానులు భారీగా బెట్టింగులు పెట్టారు. అప్పులు తెచ్చి, ఆస్తులు తాకట్టు పెట్టి మరీ లక్షల్లో పందేలు కాశారు. కానీ.. ఫలితాల్లో సీన్ రివర్స్ అయింది. జగన్ నేతృత్వంలోని వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. వైసీపీపై పందేలు కాసిన అభిమానులు ఘోరంగా నష్టపోయారు. నాయకత్వం మాటలు నమ్మి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టభయంతో కొన్నిచోట్ల కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈసారి ఏపీ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగడంతో బెట్టింగులు కూడా విపరీతంగా జరిగాయి. ఈ ఎన్నికలపై కాసిన పందాలు రూ.8 వేల కోట్ల వరకూ ఉన్నాయని ఆ రంగంలో నిపుణులు లెక్కగట్టారు. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు నుంచే ఈ పందేల జోరు మొదలైంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసుకొంటున్నవారితోపాటు రోజువారీ కూలీలు కూడా ఈ విష వలయంలోకి అడుగు పెట్టారు. తమ గెలుపుపై వైసీపీ నాయకులు తమ క్యాడర్, సానుభూతిపరుల వద్ద చివరి వరకూ విపరీతమైన నమ్మకం వ్యక్తం చేయడం, ఆ పార్టీకి అనుకూలంగా కొందరు జ్యోతిష్యులు, సోషల్ మీడియా ప్రచారకర్తలు రంగంలోకి దిగడంతో పందేల జోరు పెరిగింది. అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చి బెట్టింగ్‌ల్లో పెట్టారు. కానీ, ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీ తరఫున పందేలు కాసిన వారు షాక్‌కు గురయ్యారు. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం ప్రకాశ్‌నగర్‌కు చెందిన బిక్కిన సురేశ్ (30) అనే వ్యక్తి వైసీపీ గెలుస్తుందని రూ.30 లక్షల వరకూ పందెం కాశాడు. ఈ మొత్తం పోవడంతో బుధవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే కాకినాడ జిల్లా యు.కొత్తపల్లికి చెందిన కొందరు చేనేత కార్మికులు కలిసి వైసీపీ గెలుస్తుందని రూ.5 లక్షలు పందెం కాశారు. చివరకు ఆ సొమ్మంతా నష్టపోయారు. జిల్లాలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు బెట్టింగ్‌ల్లో డబ్బు పోగొట్టుకున్నారు.
పందెం సొమ్ముతో పరార్..
పల్నాడు జిల్లా రొంపిచర్లలో వైసీపీ, టీడీపీ పార్టీల తరఫున భారీ సంఖ్యలో పందేలు సాగాయి. ఈ నేపథ్యంలో స్థానిక చెరువు కట్ట సెంటర్‌లో ఓ వ్యక్తిని మధ్యవర్తిగా ఎంపిక చేసుకుని అతని వద్ద సుమారు రూ.1.50 కోట్ల మేర నగదును ఉంచారు. మంగళవారం ఫలితాలు వెలువడిన అనంతరం ఇరు పార్టీల తరఫున పందేలు కాసిన వ్యక్తులు సదరు వ్యక్తి వద్దకు వెళ్లగా.. అప్పటికే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నగదుతో ఉడాయించినట్లు తెలిసి అవాక్కయ్యారు. అలాగే గుంటూరు నగరంలో ఇలాగే రూ.50 లక్షలు పందెం కాసిన వ్యక్తి ఫలితాల తర్వాత అదృశ్యమమ్యాడు. ఆయన రోజువారీ వడ్డీకి డబ్బులు తెచ్చిమరీ పందెం కాసినట్టు తెలిసింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకొన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పు ఇచ్చిన వాళ్లు ఇది నిజమా.. కాదా అని ఆరా తీస్తున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేగడికొత్తూరుకు చెందిన వైసీపీ నాయకుడు పందెం డబ్బులతో పారిపోయినట్లు సమాచారం. టీడీపీ సానభూతిపరులు చంద్రబాబు ఈసారి సీఎం అవుతారని అనంతపురం నగరానికి చెందిన వైసీపీ నేతలతో రూ.50 లక్షలు పందెం కాశారు. మధ్యవర్తిగా శింగనమల నియోజకవర్గంలోని రేగడికొత్తూరుకు చెందిన వైసీపీ నేతను ఎంచుకున్నారు. టీడీపీ వర్గీయులు రూ.50 లక్షలు అతని చేతిలో పెట్టారు. గెలిచినవారికి ఈ నెల 5న డబ్బులు ఇచ్చేలా అంగీకార ప్రతం రాసుకున్నారు. ఈనెల 4న ఫలితాలు విడుదలై చంద్రబాబు బంపర్ మెజార్టీ సాధించడంతో టీడీపీ వర్గీయులు పందెం డబ్బులు తీసుకుందామని వెళ్తే ఆయన ఊరు విడిచి పారిపోయాడని తెలిసింది.
ఎగ్జిట్ పోల్స్ తర్వాత జోరందుకున్న పందేలు
ఎగ్జిట్ పోల్స్ తర్వాత పందేలు భారీగా కాశారు. ఆరా సంస్థకు చెందిన మస్తాన్‌రావు అనే విశ్లేషకుడు ఈ ఎన్నికల్లో వైసీపీ ఖాయంగా గెలుస్తుందని నియోజకవర్గాల వారీగా లెక్కలు చెప్పడంతో నమ్మి అనేక మంది కొత్తగా పందేలు కాశారు. గుంటూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ ఈ సర్వేను నమ్మి రూ.26 లక్షలు పోగొట్టుకున్నారు. గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల వైసీపీ అభ్యర్థులు పట్టుబట్టి మరీ తమ క్యాడర్‌తో పందేలు కాయించారని కొందరు చెబుతున్నారు. వైసీపీ తరఫున ఎవరూ పందేలు కాయడం లేదని, తమను బలవంతంగా ఈ రొచ్చులోకి దింపారని కొందరు బాధితులు మీడియా ప్రతినిధుల వద్ద వాపోయారు.