ADVERTISEMENT
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం
-కవి కరీముల్లా సామాజిక వ్యాసం
వీరనారి సుమయ్య(రజి)
——————————–
అది క్రీస్తు శకం 7వ శతాబ్ది కాలం.అరబ్బు ఖండమంతా అగ్రవర్ణ అహంకారానికీ,మూఢ నమ్మకాలకూ ఆలవాలమైన కాలం.స్త్రీలు వారి దృష్టిలో పశువుల కన్నా హీనం.ఆడపిల్ల పుట్టడం అవమానంగా భావించి ఎడారుల్లో సజీవంగా పాతేసేవారు.అరబ్బు సర్దార్ల పురుషాహంకారానికీ,ఆగడాలకు హద్దులుండేవి కావు.మనుషులను అమ్మటం,కొనటం అనే బానిస విధానం అమలులో ఉండేది.అలాంటి గడ్డు కాలంలో ఓ బానిస స్త్రీ విన్పించిన ధిక్కార స్వరం మక్కా సర్దార్లను కుదిపేసింది.ఆమె పేరు సుమయ్య.
సుమయ్య ఓ సామాన్య బానిస స్త్రీ.అబూహుజైఫా అనే యజమాని రక్షణలో ఉండేది.తనకు యాసిర్ అనే యువకునితో వివాహం జరిగాక అబూహుజైఫా ఉదారత్వంతో బానిసత్వం నుండి విముక్తి పొందింది.సమాజంలో తను,తన భర్త నిమ్నజాతి వారిలా చూడబడటం,అరబ్బు సర్దార్ల దయాదాక్షిణ్యాలపై బతకాల్సిరావటం ఆమెను కృంగదీసేది.మనుషుల్లో తెల్లవాళ్ళు,నల్లవాళ్ళు,అరబ్బులు,అరబ్బేతరులు అనే తేడాలతో కొనసాగుతున్న అసమ సమాజంపై అసంతృప్తి అధికంగా ఉండేది.తన కుమారుడైన అబూఅమ్మార్ ను సైతం ఇలాంటి విప్లవ భావాలతో పెంచింది.ఆ తరువాత చరిత్ర ఆమెను మర్చిపోయింది.ఆమె వృద్ధాప్యంలో అడుగు పెట్టేసరికి చరిత్రకు ఆమెను పట్టించుకోవటం అవసరమైంది.ఆమె ఒక మామూలు స్త్రీలా తన జీవితం గడిపివుంటే ఆమె చరిత్రకు అవసరమయ్యేది కాదు.ఆ వృద్ధనారి అరేబియా సర్దార్లకు వ్యతిరేకంగా గళమెత్తడంతో చరిత్ర ఆమెను గమనించడం మొదలుపెట్టింది.తను ఇలా మారడానికి కారణం దైవప్రవక్త ముహమ్మద్(స) ప్రారంభించిన ఉద్యమం.అరేబియా ధనిక భూస్వాముల దోపిడీకి,అగ్రవర్ణ అహంకారానికీ వ్యతిరేకంగా ప్రవక్త ముహమ్మద్(స)గొప్ప విప్లవాన్నే లేవదీసారు.నాటి విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఏక దైవారాధన,మనుషులంతా ఒక్కటేనని చెప్పి సామాజిక అసమానతలను వ్యతిరేకించడం,అరేబియా సర్దార్ల ఆర్థిక దోపిడీని వ్యతిరేకించి ఆర్థిక సమానత్వాన్ని గురించి బోధించటం , శ్రమదోపిడీని ప్రశ్నించటం అరేబియా ధనిక వర్గానికి మింగుడుపడలేదు.ప్రవక్త పై,ఆయన సహచరులపై హింసా,దౌర్జన్యాలకు పాల్పడటం మొదలైంది.ఈ ఉద్యమ ప్రభావం సుమయ్య పై పడింది.తను,తన భర్త,కుమారుడు ప్రవక్త అనుచరులుగా మారి ఆ మహోద్యమంలో పాల్గొన్నారు.శివారు ప్రాంతంలో అర్ఖమ్ అనే వ్యక్తి ఇల్లు ప్రవక్త ప్రారంభించిన సామాజిక, ఆధ్యాత్మిక ఉద్యమానికి కేంద్రంగా ఉండేది.సమాజంలోని దళితులు,నిరుపేదలు ,బానిసలు ప్రవక్తతో సమాలోచనలు జరిపేవారు.
ఈ కారణంగా సుమయ్య కుటుంబంపై నిషేధం విధించబడింది.అరేబియాలో ఇక ఏ మహిళ గళమెత్తకుండా సుమయ్యపై దాడికి దిగారు.క్రూరుడైన అబూజహల్ తన పరివారంతో సుమయ్య ఇంటిని చుట్టుముట్టాడు.సుమయ్యను, ఆమె కుటుంబాన్ని కొరడాలతో కొడుతూ దుర్భాషలాడుతూ వీధుల్లో నడిపించారు.తనతో సహా తన భర్త,బిడ్డ ప్రాణాలు సంకటంలో పడినప్పటికీ ఆ స్త్రీ మూర్తి చలించలేదు.అబూజహల్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఎవరైనా సరే తమ పెత్తందారీతనానికి వ్యతిరేకంగా నోరు విప్పినా,ప్రవక్త ముహమ్మద్(స)ను అనుసరించినా ఇదే గతి పడ్తుందని హెచ్చరించాడు.సుమయ్య భర్తను కట్టేసి సమయ్యను జుట్టు పట్టి లాగుతూ తీవ్రంగా గాయపర్చాడు.సుమయ్య దేహమంతా రక్తసిక్తమయ్యింది.ఇప్పటికైనా మా హుకుంకు తలవంచుతావా అంటూ బెదిరించాడు.ఆ వీరనారి ప్రవక్త మార్గాన్ని వీడేది లేదని ఖరాఖండిగా చెప్పారు. సుమయ్య కడుపులో శూలాన్ని బలంగా దించుతాడు దుష్టుడైన అబూజహల. నెత్తుటి ముద్దగా మారిన సుమయ్య కాళ్ళకు చెరోవైపు తాళ్ళు కట్టి రెండుగుర్రాలతో దౌడు తీయిస్తారు.సుమయ్య భర్త,కుమారుడు చూస్తూ ఉండగానే ఆమె శరీరం రెండుగా చీలిపోతుంది.అలా ప్రాణం పోతుండగా ఆమె పలికిన చివరి పలుకులు “లాయిలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్”.అలా ఇస్లాం చరిత్రలో హక్కుల కోసం అమరత్వం పొందిన వీరనారిగా ఆమెను చరిత్ర గౌరవించింది.

ADVERTISEMENT
ADVERTISEMENT