ఏలూరు, ఫిబ్రవరి,17: జీబిఎస్ వ్యాధిపట్ల ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అపోహలు తొలగించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర మెడిసిన్స్, ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్డియాలజీ, న్యూరాలజీ జనరల్ మెడిసిన్ విభాగాల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిబిఎస్ వ్యాధి గురించి వివిధ జిల్లాల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో దానికి అత్యవసరమైన ఇమ్యూనోగ్లోబ్యూలిన్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలన్నారు. జీబిఎస్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించాలన్నారు. చికిత్స తీసుకోకుండానే చాలావరకు ఈ వ్యాధి తగ్గుతుందన్నారు. జీబిఎస్ వ్యాధి కాళ్లలో ప్రారంభమై పై వరకు వ్యాపిస్తుందన్నారు. పరిశుభ్రత విషయంలో ప్రజలు జాగత్తగా ఉండాలని మంత్రి పార్ధసారధి సూచించారు. తిమ్మిర్లు, నడవలేని స్థితిలో ఉంటే ప్రభుత్వ ఆస్పత్రికి రావాలన్నారు. షుగర్ రోగులకు అవసరమైన ఇన్సులిన్ ఇంజక్షన్, హీమోఫిలియా రోగులకు అవసరమైన ఫ్యాక్టర్ ఇంజక్షన్ కూడా అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారికి అవసరమైన టేనెక్ట్ ప్లే ఇంజక్షన్లు విస్తృతంగా స్టాక్ ఉంచుకోవాలన్నారు. మామూలు మార్కెట్లో వీటి ధరలు అందరికీ అందుబాటులో ఉండవని ప్రాణాలు నిలబెట్టే ఈ ఇంజెక్షన్ల ను నిరుపేదలకు అందుబాటులో ఉంచడానికి అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలన్నారు. జి బి ఎస్ కేసులు ఇతర జిల్లాల్లో నమోదవు తున్నందున దానికి సంబంధించి అవగాహన కూడా కల్పించాలని ఆయన సూచించారు.
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy. I Agree