-
మలేషియాలో ఘన వ్యర్థాల నిర్వహణ విధానాల అధ్యయనంలో మంత్రి నారాయణ
- రెండు రోజుల పర్యటన కోసం మలేషియా చేరుకున్న మంత్రి నారాయణ
- కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో మంత్రి కి ఘన స్వాగతం
అమరావతి/మలేషియా
రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ రెండు రోజుల పర్యటన నిమిత్తం మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మలేషియాలోని క్లాంగ్ పార్లమెంట్ సభ్యుడు గణపతిరావు, మంత్రి పప్పారాయుడు మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. అనంతరం మలేషియాలో ఘన వ్యర్థాల నిర్వహణ రంగంలో అమలవుతున్న ఆధునిక విధానాలను అధ్యయనం చేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
సెలంగార్ రాష్ట్రంలోని KDEB వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణకు అక్కడి అధికారులు సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. గృహాలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమల నుంచి ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలను సేకరించడం, రవాణా చేయడం, శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించడం వంటి అంశాలను వివరించారు. ముఖ్యంగా వ్యర్థాల విభజన, సాంకేతిక వినియోగం, రీసైక్లింగ్ వ్యవస్థలు, ప్రజల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న విధానాలపై మంత్రి ఆసక్తిగా తెలుసుకున్నారు.
మధ్యాహ్నం మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పలు వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను సందర్శించారు. బయో మెడికల్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్, పౌల్ట్రీ వ్యర్థాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్లాంట్ల పనితీరును పరిశీలించారు. వ్యర్థాల శుద్ధి, పర్యావరణ పరిరక్షణ, శక్తి ఉత్పత్తి, రీసైక్లింగ్ ప్రక్రియలపై అక్కడి నిపుణులతో చర్చించారు.
అనంతరం సెన్విరో ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ ను సందర్శించిన మంత్రి, ప్రమాదకర మరియు పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణలో అనుసరిస్తున్న అత్యాధునిక సాంకేతిక విధానాలను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ మలేషియా అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేశారు.
ఈ పర్యటనలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ కూడా మంత్రితో పాటు పాల్గొన్నారు. మలేషియాలో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి, వాటిలో రాష్ట్రానికి అనుకూలమైన విధానాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు.
ఘన వ్యర్థాల నిర్వహణలో మలేషియా సాధించిన పురోగతి, సాంకేతిక వినియోగం, సమర్థవంతమైన నిర్వహణ వ్యవస్థలు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడతాయని మంత్రి పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఆధునిక వ్యర్థాల నిర్వహణ వ్యవస్థల అభివృద్ధికి ఈ పర్యటన దోహదపడనుంది.










































