-
రెండేళ్లలో గృహ నిర్మాణ రంగానికి నూతన ఊపిరి
•4.50 లక్షల ఇళ్ల పూర్తి – మరో 4 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో
•పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి
అమరావతి, జూన్ 18:
రెండేళ్లలో గృహ నిర్మాణ రంగానికి నూతన ఊపిరి లభించిందని, రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించగా, మరో 4 లక్షల గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం గృహ నిర్మాణ రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ వేగవంతంగా ముందుకు సాగుతోందన్నారు. పేదల గృహ భద్రత, సామాజిక స్థిరత్వం, జీవన ప్రమాణాల మెరుగుదల ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచారం విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా గృహ నిర్మాణ రంగంలో సాధించిన ప్రగతి, అమలులో ఉన్న కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ సమగ్ర వివరాలు వెల్లడించారు.
సొంత ఇల్లు అనేది ప్రతి కుటుంబం కల మాత్రమే కాకుండా ఆర్థిక భద్రతకు, సామాజిక గౌరవానికి, కుటుంబ భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన పేదల గృహ సంక్షేమ దృక్పథాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరింత విస్తృత స్థాయిలో అమలు చేస్తున్నారని తెలిపారు. గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన గృహ నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు, కొత్తగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఏఒక్క అర్హత కుటుంబం కూడా గృహం లేకుండా ఉండకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
2014–2019లో చారిత్రాత్మక గృహ నిర్మాణ కార్యక్రమం…
2014–19 కాలంలో రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ రంగాన్ని పేదల సంక్షేమ కార్యక్రమాల్లో అత్యున్నత ప్రాధాన్యత కలిగిన అంశంగా పరిగణించి, ప్రతి అర్హత గల కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో విస్తృత స్థాయిలో గృహ నిర్మాణ కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గృహ నిర్మాణ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ, కేంద్ర ప్రభుత్వ సహాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గణనీయమైన ఆర్థిక వనరులను సమకూర్చి పేదలకు నాణ్యమైన గృహాలను అందించే దిశగా చర్యలు చేపట్టిందన్నారు.
ఈ కాలంలో మొత్తం 8,04,288 గృహాలు మంజూరు చేయబడగా, వాటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం విస్తృతంగా అందించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో గృహానికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.50 లక్షలు యూనిట్ వ్యయంగా నిర్ణయించి అమలు చేయడం జరిగిందన్నారు. అదనంగా నిర్మాణ వ్యయాల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తన వంతు భాగస్వామ్యాన్ని పెంచి లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గించే చర్యలు తీసుకుందన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) దేశవ్యాప్తంగా అమలులోకి రాకముందే, పేదల గృహ అవసరాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం “ఎన్‌టీఆర్ హౌసింగ్” పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం జరిగిందన్నారు. ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసాన్ని అందించాలనే దృక్పథంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది కుటుంబాలకు గృహ భద్రత కల్పించబడిందన్నారు.
గృహ నిర్మాణం అనేది కేవలం సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాకుండా సామాజిక, ఆర్థిక సాధికారతకు పునాదిగా భావించిన ప్రభుత్వం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మరియు ఇతర బలహీన వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ గృహాల మంజూరు చేపట్టిందన్నారు. ఫలితంగా లక్షలాది పేద కుటుంబాలు సొంతింటి యజమానులుగా మారి సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను పొందగలిగాయన్నారు.
పేదలకు గృహాలు కల్పించడంలో రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని, గృహ నిర్మాణ రంగంలో 2014–19 కాలంలో నమోదైన పురోగతి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ చరిత్రలో ఒక కీలక అధ్యాయంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు.
గత ప్రభుత్వ నిర్ణయాలతో లక్షలాది పేదలకు తీవ్ర నష్టం…
ప్రభుత్వాలు మారినా ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో కొనసాగింపు ఉండటం పరిపాలనా వ్యవస్థకు ప్రాథమిక బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గృహ నిర్మాణ రంగంలో అప్పటికే అమలులో ఉన్న పలు కార్యక్రమాలను నిలిపివేయడం వల్ల లక్షలాది పేద కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని విమర్శించారు.
ముఖ్యంగా నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్న సుమారు 4 లక్షల గృహాలను రద్దు చేయడం, అప్పటికే పూర్తి చేసిన 2.73 లక్షల గృహాలకు సంబంధించిన రూ.995 కోట్ల బిల్లులను విడుదల చేయకుండా నిలిపివేయడం వంటి నిర్ణయాలు పేదల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించాయని తెలిపారు. ఈ నిర్ణయాల ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా 7.50 లక్షలకుపైగా పేద కుటుంబాలపై పడిందని పేర్కొన్నారు.
ఈ ప్రభావానికి గురైన వారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన ఆర్థికంగా బలహీన కుటుంబాలే కావడం మరింత ఆందోళనకర విషయమన్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం నిలిచిపోవడంతో వేలాది కుటుంబాలు మధ్యలోనే గృహ నిర్మాణాలను ఆపివేయాల్సి వచ్చిందని, అనేక మంది అప్పుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని వివరించారు. ఈ విధాన నిర్ణయాల ఫలితంగా గృహ నిర్మాణ రంగం తీవ్ర మందగమనానికి గురై, రాష్ట్రంలో పేదల గృహ కలలు సంవత్సరాల పాటు నెరవేరని పరిస్థితి ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు.
ఐదేళ్లలో పూర్తి చేసినవి 6.70 లక్షల ఇళ్లు మాత్రమే…
గత ప్రభుత్వం గృహ నిర్మాణ కార్యక్రమాల కింద మొత్తం 10.54 లక్షల గృహాలను పునఃమంజూరు చేసినట్లు ప్రకటించినప్పటికీ, వాటిలో కేవలం 6,70,636 గృహాలను మాత్రమే పూర్తి చేయగలిగిందన్నారు. మిగిలిన సుమారు 4 లక్షల గృహాలు వివిధ దశల్లో నిలిచిపోయి, లక్షలాది పేద కుటుంబాల గృహ కలలు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు.
నిర్మాణ వ్యయాల పెరుగుదల, లబ్ధిదారుల ఆర్థిక సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అవసరమైన అదనపు ఆర్థిక సహాయాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మంత్రి పేర్కొన్నారు. ఫలితంగా పునాదుల దశ, స్లాబ్ దశ, ఇటుక పనులు, ఫినిషింగ్ పనులు వంటి వివిధ నిర్మాణ దశల్లో వేలాది గృహాలు నిలిచిపోయాయని తెలిపారు.
ఈ పరిస్థితి కారణంగా లక్షలాది పేద కుటుంబాలు పూర్తి కాని ఇళ్లతో, ఆర్థిక ఇబ్బందులతో, అనిశ్చిత పరిస్థితుల్లో జీవించాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఇతర బలహీన వర్గాలకు చెందిన లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోయారని మంత్రి వివరించారు. గృహ నిర్మాణ రంగానికి తగిన ప్రాధాన్యత, ఆర్థిక మద్దతు లభించకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా గృహ నిర్మాణ కార్యక్రమాల పురోగతి గణనీయంగా దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతమైన చర్యలు…
కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గృహ నిర్మాణ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వివిధ దశల్లో నిలిచిపోయిన గృహాలన్నింటినీ పూర్తి చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పేదల గృహ కలలను సాకారం చేయడమే లక్ష్యంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్షలు నిర్వహించి, నిర్మాణాలను వేగవంతం చేసే చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో గతంలో నిలిచిపోయిన గృహాల పూర్తి కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టగా, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 4.50 లక్షలకు పైగా గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించడం జరిగిందన్నారు. అదేవిధంగా మరో 4 లక్షలకు పైగా గృహాలు ప్రస్తుతం వివిధ నిర్మాణ దశల్లో వేగంగా కొనసాగుతున్నాయన్నారు. నిర్మాణ వ్యయాల పెరుగుదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయాన్ని అందించగా, లక్షలాది మంది లబ్ధిదారులు ఆ సహాయం ద్వారా తమ గృహాలను పూర్తి చేసుకునే అవకాశం పొందారన్నారు.
గత ఐదేళ్లలో నిలిచిపోయిన గృహ నిర్మాణ కార్యక్రమాలకు తిరిగి జీవం పోసి, రెండేళ్లలోనే లక్షలాది కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయగలిగిన ఈ పురోగతి గృహ నిర్మాణ రంగంలో ఒక విశేష విజయంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు.
అదనపు ఆర్థిక సహాయంతో వేగవంతమైన నిర్మాణం…
నిర్మాణ సామగ్రి ధరలు గణనీయంగా పెరగడం, పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండటం వల్ల అనేక మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలను పూర్తి చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం గుర్తించి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయ కార్యక్రమాన్ని అమలు చేసినట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు అదనంగా రూ.50,000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన గృహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనులు కొనసాగించలేకపోతున్న కుటుంబాలు, వివిధ నిర్మాణ దశల్లో ఉన్న గృహాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక మద్దతు కల్పించామని తెలిపారు.
ఈ అదనపు సహాయం వల్ల వేలాది పేద కుటుంబాలు తమ గృహ నిర్మాణాలను తిరిగి ప్రారంభించి పూర్తి చేసుకునే అవకాశం పొందాయని, గతంలో నిలిచిపోయిన అనేక గృహాలు వేగంగా పూర్తి కావడానికి ఇది కీలకంగా దోహదపడిందని మంత్రి పేర్కొన్నారు. పేదలపై ఆర్థిక భారం తగ్గించి, వారి సొంతింటి కలను త్వరగా సాకారం చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి ఈ నిర్ణయం నిదర్శనమని ఆయన వివరించారు.
గృహ స్థలాల వినియోగంపై సమగ్ర సమీక్ష…
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల గృహ స్థలాలను పేద కుటుంబాలకు పంపిణీ చేసినప్పటికీ, వాటిలో కేవలం 6 లక్షల స్థలాల్లో మాత్రమే గృహ నిర్మాణాలు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. మిగిలిన సుమారు 14 లక్షల గృహ స్థలాలు ఇప్పటికీ ఖాళీగానే ఉండడం ఆందోళనకర విషయమని మంత్రి పేర్కొన్నారు.
గృహ స్థలం పంపిణీ చేయడం మాత్రమే కాకుండా, ఆ స్థలంలో లబ్ధిదారుడు నివాసయోగ్యమైన ఇంటిని నిర్మించుకుని స్థిరపడేలా చూడడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న గృహ స్థలాల వాస్తవ పరిస్థితి, నిర్మాణాలు జరగకపోవడానికి గల కారణాలు, లబ్ధిదారుల అవసరాలు, ఆయా ప్రాంతాల భౌగోళిక మరియు సామాజిక పరిస్థితులపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేపట్టిందని తెలిపారు.
ఈ అంశంపై రెవెన్యూ శాఖతో పాటు సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ విస్తృత స్థాయి సమీక్ష కొనసాగుతోందని, లబ్ధిదారులతో ప్రత్యక్షంగా చర్చించి వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. గృహ స్థలాలు పంపిణీ చేసినప్పటికీ వివిధ కారణాలతో నిర్మాణాలు జరగని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, పేద కుటుంబాలకు వాస్తవ ప్రయోజనం చేకూరేలా తగిన విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
PMAY 2.0 కింద రాష్ట్రానికి భారీ అవకాశాలు…
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY 2.0) కింద రాష్ట్రానికి గణనీయమైన స్థాయిలో గృహాల మంజూరు లభించిందని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 87,000 గృహాలు మంజూరు కాగా, వాటిలో ఇప్పటికే 10,000 నుంచి 12,000 గృహాలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన అన్ని గృహాలు వివిధ నిర్మాణ దశల్లో వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ఈ గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
అదేవిధంగా, గ్రామీణ ప్రాంతాల్లో గృహ అవసరాలను గుర్తించేందుకు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు విశేష స్పందన లభించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10.40 లక్షల దరఖాస్తులు అందగా, వాటి పరిశీలన అనంతరం సుమారు 9 లక్షల మంది అర్హులుగా గుర్తించబడ్డారని తెలిపారు. ఈ అర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించడంతో పాటు, 9 లక్షల గృహ యూనిట్ల మంజూరు కోసం ప్రతిపాదనలు సమర్పించినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో గృహ రహిత కుటుంబాలకు శాశ్వత నివాస సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంతో నిరంతర సమన్వయం కొనసాగిస్తున్నామని, త్వరలోనే PMAY 2.0 కింద రాష్ట్రానికి మరింత భారీ సంఖ్యలో గృహాల మంజూరు లభించే అవకాశాలు ఉన్నాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హత గల ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
పట్టణ పేదలకు వడ్డీలేని రుణాలు…
పట్టణ ప్రాంతాల్లో పేద మరియు మధ్యతరగతి కుటుంబాల గృహ నిర్మాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వినూత్నమైన ఆర్థిక సహాయ విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గృహ నిర్మాణ వ్యయాలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో లబ్ధిదారులపై ఆర్థిక భారం తగ్గించి, నిర్మాణాలను వేగవంతం చేయడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ క్రమంలో పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి యూనిట్ వ్యయాన్ని రూ.2.50 లక్షలుగా కొనసాగించడంతో పాటు, లబ్ధిదారులకు రూ.3 లక్షల వరకు అదనపు వడ్డీలేని రుణ సౌకర్యం కల్పించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ రుణాలపై పడే వడ్డీ భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది అని వెల్లడించారు.
ఈ నిర్ణయం వల్ల లబ్ధిదారులు అధిక వడ్డీ రుణాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గడంతో పాటు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలో నిలిచిపోయే గృహ నిర్మాణాలు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా మారుతుందని, గృహ నిర్మాణ రంగంలో మరింత పురోగతి సాధించేందుకు ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
2026–27 లక్ష్యాలు: ప్రతి అర్హ కుటుంబానికి సొంతింటి కల సాకారమే ప్రభుత్వ సంకల్పం…
గృహ నిర్మాణ రంగంలో రెండేళ్లలో సాధించిన పురోగతిని మరింత వేగవంతం చేస్తూ, 2026–27 సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో గృహ రహిత కుటుంబాల సంఖ్యను గణనీయంగా తగ్గించి, అర్హత గల ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాస సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ప్రస్తుతం వివిధ నిర్మాణ దశల్లో ఉన్న 4 లక్షల పెండింగ్ గృహాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందించడం ప్రభుత్వ తొలి ప్రాధాన్యతగా ఉంటుందని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY 2.0) కింద రాష్ట్రానికి అదనంగా 9 లక్షల గ్రామీణ గృహాల మంజూరు పొందేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వేలాది కొత్త గృహాల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వడ్డీలేని రుణ సౌకర్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల ద్వారా పట్టణ పేద కుటుంబాలకు మరింత చేరువలో గృహ నిర్మాణ అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా గతంలో పంపిణీ చేసినప్పటికీ ఇప్పటికీ ఖాళీగా ఉన్న లక్షలాది గృహ స్థలాల వినియోగంపై సమగ్ర సమీక్ష చేపట్టి, లబ్ధిదారులకు వాస్తవ ప్రయోజనం చేకూరేలా అవసరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు.
పేదల గృహ కలలను సాకారం చేయడం కేవలం సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాదని, అది సామాజిక న్యాయం, ఆర్థిక భద్రత, గౌరవప్రదమైన జీవనానికి పునాది అని పేర్కొన్న మంత్రి, రాష్ట్రంలో అర్హత గల ఏఒక్క కుటుంబం కూడా గృహం లేకుండా ఉండకూడదు అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి అర్హ పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడానికి ప్రభుత్వం సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తోందని స్పష్టం చేశారు.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, సంచాలకులు అరుణ్ బాబు తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.











































