పార్టీ కోసం త్యాగాలకు సముచిత గుర్తింపు
- గతంలో ఎన్నడూ లేనివిధంగా శిల్పారామాలను అభివృద్ధి చేశాం
- నామినేటెడ్ పోస్టుల పొడిగింపుపై చంద్రబాబుకు మంజులారెడ్డి కృతజ్ఞతలు
రాజధాని వార్తలు – రెంటచింతల:
నామినేటెడ్ పదవుల చైర్మన్ల పదవీకాలాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్ర శిల్పారామం చైర్మన్ చేర్రెడ్డి మంజులారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, గుంటూరు, కడప, వైజాగ్, పులివెందుల, పుట్టపర్తి, కాకినాడ తదితర ప్రాంతాల్లో ఉన్న శిల్పారామాలను గతంలో ఎన్నడూ లేని విధంగా సమగ్రంగా అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.
ప్రజలకు, పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తూ సాంస్కృతిక కేంద్రాలుగా శిల్పారామాలను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన నిఖార్సయిన కార్యకర్తలకు, నాయకులకు పార్టీ అధిష్టానం ఎల్లప్పుడూ అండగా ఉంటుందనే దానికి మంజులారెడ్డికి దక్కిన గౌరవమే ఒక ఉదాహరణ. సాధారణ ఎన్నికల పోలింగ్ రోజున అంటే 2024 మే 13న రెంటాల గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ ఏజెంట్‌గా కూర్చోవడానికి వెళ్తున్న సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఆమెను దారుణంగా అడ్డుకున్నారు. నాటుకర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా హింసించడంతో ఆమె తీవ్ర గాయాలపాలై ఆసుపత్రి పాలయ్యారు. అప్పట్లో ఈ దారుణ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది.
పార్టీ కోసం మంజులారెడ్డి చేసిన త్యాగాన్ని, చూపిన ధైర్యాన్ని గుర్తించిన మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి అప్పట్లో ఆమెను ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. ఆమె పోరాట పటిమను ప్రశంసిస్తూ రాష్ట్ర శిల్పారామం చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించి పెద్దపీట వేశారు. పార్టీ కోసం కష్టపడి త్యాగాలు చేసిన వారిని అందల మెక్కిస్తామనే టీడీపీ విధానానికి మంజులారెడ్డి ప్రయాణమే నిలువెత్తు రూపమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తనపై నమ్మకంతో పదవీకాలాన్ని పొడిగించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ అధిష్టానానికి ఆమె మరొకసారి ధన్యవాదాలు తెలియజేశారు.
























































