పిఎమ్ స్వనిధి పథకం: వీధి వ్యాపారుల ఆర్థిక ప్రగతికి సరికొత్త బాట
భారతదేశంలో పట్టణీకరణ వేగంగా విస్తరిస్తోంది. 2050 నాటికి దేశ జనాభాలో దాదాపు 50% మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తారని అంచనా. ప్రస్తుతం, పట్టణ శ్రామిక శక్తిలో సుమారు 66% మంది అసంఘటిత రంగంలోనే పని చేస్తుండగా, వీరంతా పట్టణ ఆర్థిక వ్యవస్థకు ముఖ్య స్తంభంగా నిలుస్తున్నారు. ఈ రంగంలో పనిచేస్తున్న వారిలో వీధి వ్యాపారులది కీలక పాత్ర. పండ్లు, కూరగాయలు, టీ, చిరుతిళ్లు, దుస్తులు, ఇతర రోజువారీ వినియోగ వస్తువులను విక్రయించే కోట్ల మంది వీధి వ్యాపారులు పౌరుల జీవితాలను సులభతరం చేయడమే కాదు, పట్టణ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సహకారాన్ని అందిస్తున్నారు.
వీధి వ్యాపారులకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, అధికారిక బ్యాంకింగ్, రుణ సదుపాయాలు చాలా పరిమితంగానే ఉండేవి. ఎలాంటి రుణ చరిత్ర లేకపోవడంతో అధిక వడ్డీ రేట్లకు అనధికారిక ఆర్థిక వనరులపై ఆధారపడాల్సిన పరిస్థితి, దీంతో వారి ఆదాయంలో చాలా వరకు రుణాల చెల్లింపులకే ఖర్చయ్యేది. 2020లో వచ్చిన కోవిడ్-19 మహమ్మారి.. వీధి వ్యాపారులకు మరిన్ని సవాళ్లు విసిరి, వారి వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీసింది.
ఈ ఇబ్బందులకు పరిష్కారంగా జూన్ 2020లో ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో “ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి” ( పిఎమ్ స్వనిధి) పథకాన్ని ప్రారంభించారు. భారతదేశంలో వీధి వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన మొట్టమొదటి సమగ్ర సూక్ష్మ-రుణ పథకమిది. ఇది వారికి మొదటిసారిగా అధికారిక ఆర్థిక రంగానికి సరళమైన, గౌరవప్రదమైన, సంస్థాగతమైన అవకాశాల్ని అందించింది.
ఈ పథకం కింద, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలాంటి హామీ లేకుండానే రూ.15,000, రూ.25,000 మరియు రూ.50,000 వరకు మూడు విడతల్లో మూలధన రుణాలను అందిస్తాయి. సకాలంలో రుణాలను తిరిగి చెల్లింపును ప్రోత్సహిస్తూ, గడువులోగా రుణాలు చెల్లించే లబ్ధిదారులకు 7% వడ్డీ రాయితీని ఈ పథకం అందిస్తుంది. గత ఆరేళ్లలో, పిఎమ్ స్వనిధి పథకం.. దాదాపు 76 లక్షల మంది వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చింది, దాని మూడు రుణ పద్ధతుల్లో రూ.17,800 కోట్లకు పైగా రుణాల పంపిణీని సులభతరం చేసింది.
మారుతున్న ప్రపంచ పరిస్థితులు, ఆర్థిక అస్థిరతల మధ్య భారతీయ వీధి వ్యాపారులు తమ స్థితిస్థాపకత, పట్టుదలకు పేరుగాంచారు. పిఎమ్ స్వనిధి వారి పారిశ్రామిక స్ఫూర్తిలోకి కొత్త శక్తిని నింపింది. ఈ పథకం కేవలం రుణాలు అందించడానికే పరిమితం కాకుండా; గౌరవం, గుర్తింపు, కొత్త అవకాశాలకు ఒక శక్తివంతమైన సాధనంగా మారింది.
ఈ పథకం విజయం సాధించడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు, బ్యాంకింగ్ సంస్థల సమన్వయ ప్రయత్నాలను ఒకచోటకి చేర్చిన ప్రభుత్వ సమగ్ర విధానం. ఈ సంయుక్త భాగస్వామ్యం దేశవ్యాప్తంగా అపూర్వమైన విస్తరణను, అద్భుతమైన ఫలితాలను సాధించడానికి సహాయపడింది.
ఈ పథకం కింద, లక్షలాది వీధి వ్యాపారుల బ్యాంక్ ఖాతాలు వాడుకలోకి వచ్చాయి, ఆర్థిక లావాదేవీలు రికార్డు కావడం ప్రారంభమయ్యాయి. మొదటిసారిగా వారి కోసం ఒక అధికారిక రుణ చరిత్ర ఏర్పడింది. ఇది భవిష్యత్తులో పెద్ద మొత్తంలో రుణాలు, ఇతర ఆర్థిక సేవలను సులభంగా పొందడానికి మార్గం సుగమం చేసింది. ఈరోజు వీధి వ్యాపారులు గౌరవనీయ బ్యాంక్ వినియోగదారులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు.
ఈ పథకంలోని మరో ముఖ్యాంశం డిజిటల్ సాధికారత. యూపీఐ, క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి క్యాష్‌బ్యాక్ ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టారు. ఈ చొరవ ద్వారా, 55 లక్షల కంటే ఎక్కువ మంది వ్యాపారులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యారు. దీనివల్ల వారి లావాదేవీలు మరింత పారదర్శకంగా మారాయి, వారి ఆర్థిక విశ్వసనీయత బలపడింది.
ఈ పథక దార్శనికత కేవలం వ్యాపార మద్దతుకే పరిమితం కాలేదు. “స్వనిధి సే సమృద్ధి” చొరవ ద్వారా, లబ్ధిదారులు, వారి కుటుంబాలను భారత ప్రభుత్వానికి చెందిన 8 ప్రధాన సంక్షేమ పథకాలతో అనుసంధానిస్తున్నారు. ఇప్పటివరకు 50 లక్షల కంటే ఎక్కువ మంది వీధి వ్యాపారుల కుటుంబాల ప్రొఫైలింగ్ పూర్తయింది, ఈ పథకాల కింద 1.52 కోట్లకు పైగా ప్రయోజనాలు మంజూరయ్యాయి. పెన్షన్లు, బీమా, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత ప్రయోజనాలను కల్పించడం ద్వారా, ఈ చొరవ వీధి వ్యాపారులు, వారి కుటుంబాలకు సమగ్ర సామాజిక రక్షణ యంత్రాంగంగా అవతరించింది.
అదనంగా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) తో కుదుర్చుకున్న భాగస్వామ్యం.. ఆహార భద్రత, పరిశుభ్రతపై శిక్షణ అందించడానికి వీలు కల్పించింది. నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రత పద్ధతులు, వినియోగదారుల నమ్మకాన్ని పెంపొందించడం ద్వారా ముఖ్యంగా వీధి ఆహార వ్యాపారులకు ఎంతో మేలు చేసింది.
మహిళా సాధికారతకు కూడా ఈ పథకం గణనీయమైన సహకారాన్ని అందించింది. మొత్తం లబ్ధిదారులలో మహిళలు దాదాపు 46% మంది ఉన్నారు. ఫలితంగా, వారి ఆదాయ స్థాయిలు, సామాజిక హోదా, గృహ నిర్ణయాలలో భాగస్వామ్యం గణనీయంగా మెరుగుపడ్డాయి.
2023, 2025 లలో నిర్వహించిన స్వతంత్ర ప్రభావ అంచనాలు ఈ పథకం అందించే దీర్ఘకాలిక ప్రభావాన్ని గుర్తించాయి. దాదాపు 95% మంది లబ్ధిదారులు తమ జీవితంలో మొదటిసారిగా బ్యాంక్ రుణాన్ని పొందారు. ఇది ఆర్థిక సమగ్రతలో ఒక చారిత్రాత్మక విజయంగా నిలిచింది. అంతేకాకుండా, దాదాపు 30% మంది లబ్ధిదారులు తదనంతరం ఇతర అధికారిక ఆర్థిక సంస్థల నుండి రుణాలు పొందారు. ఇది వారి పెరుగుతున్న ఆర్థిక విశ్వాసాన్ని, బలమైన రుణ చరిత్రను ప్రతిబింబిస్తోంది.
లబ్ధిదారులు తమ వార్షిక ఆదాయంలో సగటున దాదాపు 20% పెరుగుదలను నమోదు చేశారు. గృహ వసతి పరిస్థితులు, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ సౌలభ్యం, పిల్లల విద్యలో కూడా మెరుగుదలలు కనిపించాయి. 2023, 2025 మధ్య లబ్ధిదారులలో యూపీఐ ఆధారిత లావాదేవీల వినియోగం సుమారు 45% నుండి 83% కి గణనీయంగా పెరిగింది.
ఈ పథకం విస్తృత, సానుకూల ప్రభావాన్ని గుర్తిస్తూ, కేంద్ర మంత్రిమండలి, ఆగస్టు 2025లో, దీనిని పునర్వ్యవస్థీకరించిన రూపంలో మార్చి 2030 వరకు పొడిగించడానికి ఆమోదం తెలిపింది. ఈ సరికొత్త పథకం కింద, వీధి వ్యాపారుల రుణ పరిమితులను పెంచారు. దీని పరిధిని పట్టణ స్థానిక సంస్థలకే పరిమితం చేయకుండా జనగణన పట్టణాలు, పరిధి దాటిన పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించారు. వ్యాపారులు తమ సంస్థలను మారుతున్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా బలోపేతం చేసుకోవడానికి, మార్చుకోవడానికి వీలుగా సామర్థ్య పెంపొందించుకోవడానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ దిశగా, “స్వనిధి క్రెడిట్ కార్డ్” ను ప్రవేశపెట్టడం మరొక ముఖ్యమైన అడుగు. ఈ కార్డ్ వ్యాపారులకు తక్షణ ఆర్థిక, వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడానికి స్వల్పకాలిక, వడ్డీ లేని రుణ సౌకర్యాన్ని అందిస్తుంది.
పిఎమ్ స్వనిధి వీధి వ్యాపారుల ఆర్థిక సాధికారతను గణనీయంగా ముందుకు తీసుకెళ్లినప్పటికీ, వారిలో చాలా మందిని పట్టణ ప్రణాళికా చట్రంలో ఇప్పటికీ అంతర్భాగంగా గుర్తించడం లేదు. అలాగే.. వారికంటూ ప్రత్యేకంగా వ్యాపార స్థలాలు లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. క్రమబద్ధీకరించిన అమ్మకపు మండలాలు లేకపోవడం వారి జీవనోపాధి, వినియోగదారుల సౌలభ్యం రెండింటినీ ప్రభావితం చేస్తుంది. ఈ సవాలును పరిష్కరించడానికి, రాబోయే సంవత్సరాల్లో వీధి వ్యాపారులను పట్టణ ప్రణాళికాల్లో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్థానిక సంస్థలు కృషి చేయాలి.
ఈ విషయంలో ఒక మంచి చొరవ “స్ట్రీట్ ఫుడ్ హబ్స్” అభివృద్ధి, ఇది వ్యాపారులకు వ్యవస్థీకృత, సులభంగా చేరుకోగల వ్యాపార స్థలాలను అందిస్తుంది. ఇటువంటి ప్రయత్నాలు వారి జీవనోపాధిని బలోపేతం చేయడమే కాకుండా స్వచ్ఛమైన, మరింత వ్యవస్థీకృత, మరింత శక్తివంతమైన పట్టణ వాతావరణానికి దోహదం చేస్తాయి.
పిఎమ్ స్వనిధి పథకం క్షేత్రస్థాయిలో ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వోకల్ ఫర్ లోకల్’ దార్శనికతను ప్రతిబింబిస్తుంది. దీని విజయం సమ్మిళిత అభివృద్ధి ఫలాలు సమాజంలోని అత్యంత బలహీన వర్గాలకు చేరుతున్నాయని నిరూపిస్తుంది. ఈ పథకం వీధి వ్యాపారుల కోసం ఆర్థిక సమగ్రత, సామాజిక భద్రత ప్రభావవంతమైన నమూనాను స్థాపించింది. రాబోయే సంవత్సరాల్లో, పిఎమ్ స్వనిధి మిలియన్ల కొద్దీ వ్యాపారులకు సాధికారతను కల్పిస్తూనే ఉంటుందని, పరివర్తనకు సంబంధించిన కొత్త కథనాలను సృష్టిస్తుందని, ‘వికసిత్ భారత్’ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
శ్రీ మనోహర్ లాల్
(రచయిత కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి.)












































