అమరావతిపై జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: మంత్రి నారాయణ
- ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన దాదాపు ప్రతి రైతుకు ప్లాట్లు కేటాయించాం
- అమరావతి అభివృద్ధిని చూసే ధైర్యం జగన్‌కు లేదు
- వర్షాకాలానికి ముందే కొండవీటి వాగు, పాలవాగు వద్ద ప్రత్యేక చర్యలు
అమరావతి, జూన్ 3: అమరావతి రాజధాని నిర్మాణంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని, వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించకుండా, ఏసీ గదుల్లో కూర్చొని విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యమని ఆయన పేర్కొన్నారు.అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు, వెస్ట్ బైపాస్ బైపాస్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ, రాజధాని అభివృద్ధి, రైతులకు ప్లాట్ల కేటాయింపు, వర్షాకాల సన్నాహక చర్యలు, భూసేకరణ తదితర అంశాలపై సమగ్ర వివరణ ఇచ్చారు.
అమరావతి అభివృద్ధిపై అసత్య ప్రచారం చేస్తున్న వైసీపీ
అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వలేదని వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా మొత్తం 35,057 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించగా, 34,563 మంది రైతులకు ఇప్పటికే ప్లాట్లు కేటాయించినట్లు వెల్లడించారు.ఇంకా ప్లాట్లు కేటాయించాల్సిన భూమి కేవలం 494 ఎకరాలు మాత్రమే ఉందని, అవి కూడా కోర్టు వివాదాలు, వారసత్వ సమస్యలు, కుటుంబ వివాదాలు, సంబంధించిన సమస్యలు వల్ల మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.రైతులకు ప్లాట్లు ఇవ్వలేదని చెప్పడం పూర్తిగా అబద్ధం.దాదాపు ప్రతి రైతుకు ప్లాట్లు కేటాయించాం. మిగిలిన కొద్దిమంది రైతుల సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తున్నాం” అని ఆయన స్పష్టం చేశారు.
ప్లాట్ల రిజిస్ట్రేషన్లు వేగంగా కొనసాగుతున్నాయి
ల్యాండ్ పూలింగ్ కింద కేటాయించిన 70,876 ప్లాట్లలో 63,347 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. మిగిలిన 7,529 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.వాటిలో కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు, విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్న రైతులు, ఇనాం మరియు దేవాదాయ భూములకు సంబంధించిన అంశాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయని చెప్పారు.ప్రభుత్వం వల్ల ఒక్క రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోలేదు. రైతుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని చర్యలు తీసుకుంటున్నాం” అని మంత్రి పేర్కొన్నారు.
జగన్ వ్యాఖ్యలు వాస్తవాలకు దూరం
అమరావతిలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ మంత్రి నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు.అమరావతికి వచ్చి ఒకసారి తిరిగి చూస్తే అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో తెలుస్తుంది. ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ప్రభుత్వ భవనాలు, అధికారుల నివాస సముదాయాలు, ఐకానిక్ నిర్మాణాలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. బయటకు రాకుండా విమర్శలు చేయడం సరికాదు” అని అన్నారు.
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు.
వర్షాకాలానికి ముందే అప్రమత్తం
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని కొండవీటి వాగు, పాలవాగు ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.గత ఏడాది వెస్ట్ బైపాస్ నిర్మాణ పనుల కారణంగా కొన్నిచోట్ల మట్టి పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని గుర్తుచేశారు. ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే చర్యలు తీసుకున్నామని చెప్పారు.పాలవాగుపై 30 బ్రిడ్జిలు, కొండవీటి వాగుపై 39 బ్రిడ్జిలు, మొత్తం 69 బ్రిడ్జిల వద్ద పనులు జరుగుతున్నాయని తెలిపారు. నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే మట్టిని తొలగించడం, అవసరమైన చోట డైవర్షన్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలను అధికారులు చేపట్టారని వెల్లడించారు.వెస్ట్ బైపాస్ వద్ద ఉన్న కీలక వెంట్ల పనులు మరో పది రోజుల్లో పూర్తవుతాయని సంబంధిత సంస్థలు హామీ ఇచ్చాయని చెప్పారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వరద నియంత్రణ వ్యవస్థ
అమరావతి నగరాన్ని భవిష్యత్ వరద ముప్పుల నుంచి రక్షించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రణాళికలు రూపొందించామని మంత్రి నారాయణ తెలిపారు.నెదర్లాండ్స్ నిపుణుల సలహాలతో కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, రిజర్వాయర్ల వ్యవస్థను డిజైన్ చేసినట్లు చెప్పారు.నీరుకొండ, పెనుమాక, శాఖమూరు ప్రాంతాల్లో నిర్మిస్తున్న రిజర్వాయర్లలో కలిపి 0.54 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉందని తెలిపారు. గత రెండు వందల ఏళ్ల వర్షపాతం, వరదల చరిత్రను అధ్యయనం చేసి ఈ వ్యవస్థను రూపొందించామని వెల్లడించారు.
అవసరమైతే 24 వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్ ద్వారా బయటకు తరలించే సామర్థ్యం కూడా కల్పించినట్లు చెప్పారు.
అమరావతి దేశంలోనే ఆదర్శ రాజధానిగా అవతరిస్తుంది
ప్రపంచంలోని అత్యుత్తమ రాజధానుల సరసన నిలిచే విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇది కేవలం పరిపాలనా రాజధాని మాత్రమే కాకుండా పర్యాటకం, ఉపాధి, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధికి కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఎలా బలమైన కేంద్రంగా నిలిచిందో, అదే విధంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇంజిన్‌గా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు.
2028 ఆగస్టు నాటికి తొలి దశ పూర్తి
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం అమరావతి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, 2028 ఆగస్టు నాటికి తొలి దశ మౌలిక వసతుల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ, విద్యుత్, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర మౌలిక వసతులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.












































