7 నుంచి రెండు వారాల పాటు యోగా కార్యక్రమాలు
- రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు
- కోటి మందిని భాగస్వాములను చేసేలా చర్యలు
- 21న అమరావతిలో కృష్ణా నది వంతెన(వెస్ట్ బైపాస్ ) పై రాష్ట్ర స్థాయి కార్యక్రమం
- సీఎం శ్రీ చంద్రబాబు పాల్గొనే ఈ కార్యక్రమానికి 25 వేల మంది హాజరు
- ఏపీ యోగా ప్రచార పరిషత్ ఏర్పాటుకు సీఎం ఆమోదం
- త్వరలో ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు
- రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను రాష్ట్రంలో ‘యోగాంధ్ర-2026’ పేరుతో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ (Yoga for Healthy Aging) అనే విశిష్ట నినాదంతో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) వేడుకల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. యోగాను కేవలం ఒక రోజు కార్యక్రమంగా కాకుండా.. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం చేయడమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది( రైతులు, మహిళా స్వయం సహాయక బృందాలు, మత్స్య కారులు, గిరిజనులు, వివిధ సాంస్కృతిక కళాకారులు, యువజన సంఘాల సభ్యులు, ఆటో లారీ అసోసియేషన్ ల సభ్యులు, విద్యార్ధినీ విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు) పౌరులను యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తామన్నారు. 10 లక్షల మంది నిత్య సాధకులను తయారుచేస్తామని వెల్లడించారు. గతేడాది 1.5 లక్షల మంది శిక్షకుల ద్వారా కార్యక్రమాలు జరిపామని, ఈ సంఖ్యకు అదనంగా మర్లో లక్ష మంది శిక్షకులను జత చేస్తునామని (మొత్తం 2.5 లక్షలు) తెలిపారు. ఈసారి కూడా యోగా మరియు ప్రకృతి వైద్య ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో రూపొందించిన యోగా వీడియోలను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు.
నిరంతర పర్యవేక్షణ కోసం ‘ వార్ రూం ‘ ఏర్పాటు
యోగా దినోత్సవ వేడుకల నిర్వహణపై రాష్ట్ర సచివాయంలో మంత్రి శ్రీ సత్యకుమార్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సెక్రటరీ సౌరభ్ గౌర్, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, ఆయుష్ డైరెక్టర్ జి.వీరపాండియన్, యోగా, ప్రకృతి వైద్య సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణరాజుతో కలిసి సోమవారం విలేకరుల సమావే శంలో మాట్లాడుతూ యోగాసనాల ప్రాధాన్యతను తెలిపే విధంగా ప్రత్యేకంగా ఏపీ యోగా ప్రచార పరిషత్ ఏర్పాటు కోసం పంపిన ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర వేశారని, ఇందుకు సంబంధించిన ఫైలు ఆర్థిక శాఖ పరిశీలలో ఉందని చెప్నారు. ఈ పరిషత్ ఏర్పాటకనుగుణంగా 3 ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటవుతాయని తెలిపారు. యోగాసనాల కార్యక్రమాలకే పరిమితం కాకుండా నిరంతరం కొనసాగేలా ఈ పరిషత్ పర్యవేక్షిస్తుందని చెప్పారు. కిందటి ఏడాది రికార్డు స్థాయిలో నిర్వహించిన యోగాసనాల కార్యక్రమాలకు రెండు గిన్నిస్ బుక్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు , ఒక స్కోచ్ అవార్డులొచ్చాయని చెప్పారు. రాష్ట్ర విద్యా శాఖా మంత్రి శ్రీ నారా లోకేష్ విద్యార్థులకు జరిగే బోధనలో యోగాను అంతర్భాగంగా చేర్చారని, ఉత్తర్వులు కూడా ఇచ్చారని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే యోగాసనాల పట్ల అవగాహన ఏర్పరచడం ద్వారా బహుళ ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే యోగాసనాల కార్యక్రమాల నిరంతర పర్యవేక్షణ, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం కోసం మంగళగిరిలోని ఎపిఐఐసిలో ప్రత్యేకంగా ‘ వార్ రూం ‘ ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ముఖ్యాంశాలు
ఈ నెల్ల 7 నుంచి 20వ తేదీ వరకు (14 రోజులపాటు) యోగా ప్రచారం జరుగుతుంది
జూన్ 21న ప్రధాన యోగా దినోత్సవ వేడుకలు రాజధాని అమరావతిలో జరుగుతాయి
రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 28 ప్రత్యేక్ష థీమ్‌లతో కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ప్రతి జిల్లాలో రెండు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో (మొత్తం 56 ప్రాంతాలు) యోగా ప్రదర్శనలు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 4 పర్యాటక ప్రదేశాల్లో ప్రతిచోటా కనీసం 500 మందితో ఈ కార్యక్రమాలు వేడుకగా జరుగుతాయి.ఈనెల 7న యోగా కార్యక్రమాలు ప్రారంభ కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
జిల్లాల వారీగా ప్రత్యేక థీమ్‌లు( ఇతివృత్తాలు)
డాక్టర్ ఎన్టీఆర్ జిల్లా — పోలీసులు
కోనసీమ – రైతులు
కృష్ణా జిల్లా – అటో లారీ అసోసియేషన్లు
తిరుపతి- సెలబ్రిటీలు
విశాఖపట్నం – మాజీ సైనికోద్యోగులు
ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో యోగా
గుంటూరు: ఉండవల్లి గుహలు, మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం
నంద్యాల: శ్రీశైలం, మహానంది దేవస్థానాల సమీపంలో
నెల్లూరు: మైపాడు బీచ్, స్వర్ణాల చెరువు
జూన్ 7 నుంచి 20 తేదీ వరకు వివిధ కేటగిరీల్లో 4 స్థాయిల్లో యోగా పోటీలు
గ్రామ/వార్డు స్థాయి : జూన్ 7 నుంచి 9 వరకు
మండల స్థాయి: జూన్ 10 నుంచి 12 వరకు
జిల్లా స్థాయి: జూన్ 14 నుంచి 16 వరకు
రాష్ట్ర స్థాయి గ్రాండ్ ఫినాలే : జూన్ 18 నుంచి 20 వరకు విజయవాడలో నిర్వహిస్తారు.
పోటీలు-విభాగాలు
వ్యక్తిగత విభాగం : ఆసనాల ప్రదర్శన, ప్రాణాయామం
బృందం: సింక్రనైజ్డ్ గ్రూపు యోగా
జ్ఞాన ఆధారిత పోటీలు : యోగా క్విజ్, యోగా వ్యాసరచన, యోగా నినాదాల పోటీలు
రాష్ట్ర, జిల్లా స్థాయి విజేతలకు బహుమతుల్ని అందచేస్తారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని అమరావతిలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు పాల్గొనే కార్యక్రమానికి ఆహ్వానిస్తారు.
జూన్ 21న జరిగే యోగా వేడుకల ముగింపు కార్యక్రమాలను రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో భారీఎత్తున నిర్వహిస్తారు. అమరావతి (కృష్ణా నదిపై నిర్మించిన వంతెన ) లో 25వేల మందితో యోగాసనాల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సీఎం శ్రీ చంద్రబాబు పాల్గొంటారు. అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో సుమారు 3వేల మంది వరకు పాల్గొంటారు. గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలోని పార్కులు, పాఠశాలలు, క్రీడా ప్రాంగణాల్లో కార్యక్రమాలు జరుగుతాయి. వీటి అన్నింట్లో కలిపి సుమారు కోటి మంది పాల్గొంటారు
ఉచితంగా యోగాసనాలు వీడియోలు
ఇంటింటికీ యోగాను చేరువ చేసే కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు 4 కేటగిరిలలో రూపొందించిన వీడియోలను ఉచితంగా వాట్సప్ ద్వారా డౌన్లోడు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. వివిధ ఆసనాలపై 90, రోగ నివారణ-ప్రత్యేక ఆసనాల వీడియోలు – 21, రోజువారీ సాధన కోసం 7 (ఆసనాలు-ప్రాణాయామం సెట్), యోగాపై సందేహాలను (షార్ట్ వీడియోలు) 50 ప్రశ్నల రూపంలో నివృత్తి చేసేలా వీడియోలను రూపొందించారు. వాట్సప్ నెంబరు: 8142404888 ద్వారా Hi అని టైపుచేస్తే వెంటనే క్యూఆర్ కోడ్ వస్తుంది. దీనిని స్కాన్ చేస్తే గూగుల్ డ్రైవ్ లింక్ వస్తుంది. దాని ద్వార వీడియోలను ఎప్పుడైనా డౌన్ లోడు చేసుకోవచ్చనని డాక్టర్ మంతెన సత్యనారాయణ తెలిపారు.
అలాగే సంజీవని యాప్ ద్వారా యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానానికి సంబంధించిన వీడియోలను ప్రజలకు అందుబాటులోకి తేనుంది.








































