మన బడి పిలుస్తోంది..మనబడి గెలుస్తోంది
– మనబడి పిలుస్తోంది పాట ఆవిష్కరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, ఐ.ఏ.ఎస్.
– విద్య ఆవశ్యకతను పాటలో వినిపించారు – ఏపీఎస్సీపీసీఆర్ చైర్ పర్సన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “బడి పిలుస్తోంది” ప్రవేశాల ప్రచార కార్యక్రమంలో భాగంగా రూపొందించిన “మనబడి పిలుస్తోంది” పాటను కమిషనరేట్లో మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, ఐ.ఏ.ఎస్. ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ విద్య, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న పలు సంస్కరణలను ఈ పాట ద్వారా ప్రజల్లోకి చేరేలా చక్కగా వివరించారని కమిషనర్ ఈ పాటను రాసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు చల్ల మధుసూదనరావుని, పనిచేసిన బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా కార్యక్రమాలు, విద్యా ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇటువంటి సృజనాత్మక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. బాలల హక్కుల పరిరక్షణ, బాలల సంక్షేమం, బాలల వికాసానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కమిషన్ తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. విద్యా మంత్రి ఓఎస్డీ ఆకుల వెంకటరమణ, విద్యాశాఖ అధికారులు, సాంకేతిక బృంద సభ్యులు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.


















































