అమరావతి // 07.06.2026
యోగాంధ్ర.. రిజిస్ట్రేషన్ల జోరు
- కోటి మందిని భాగస్వాములను చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో తొలి రోజు 25 వేల మంది పేర్లు నమోదు
- రాష్ట్ర వ్యాప్తంగా యోగా సందడే సందడి
- -మాస్టర్ల ట్రైనర్ల ద్వారా 50,752 మందికి శిక్షణ కార్యక్రమాలు
- -భారతీయ సంస్కృతికి ‘యోగా’ ఓ ప్రతీక…
లేపాక్షిలో మంత్రి శ్రీ సత్యకుమార్ వెల్లడి

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర-2026 ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి ఉత్సాహ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21నాడు జరిగే భారీ యోగా కార్యక్రమాలకు సన్నాహాకంగా ఈ నెల 20వ తేదీ వరకు 28 జిల్లాల్లో యోగాపై అవగాహన, ప్రచార కార్యక్రమాలను వినూత్న పద్ధతుల్లో చేపట్టడం ఆదివారం నుంచి ప్రారంభమైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నేతృత్వంలో శ్రీ సత్యసాయి జిల్లా ‘లేపాక్షి’లోని ఆలయ ప్రాంగణంలో యోగాసనాల రాష్ట్ర స్థాయి ప్రారంభ కార్యక్రమం ఆహ్లాద వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘యోగా భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి ప్రతీక.యోగాసనాల ద్వారా అనారోగ్యాలు, మానసిక సమస్యలకు దూరంగా ఉండొచ్చు. శాస్త్రీయంగా ఇది నిరూపితమైంది. అందువల్లే కోటి మందిని యోగాసనాల కార్యక్రమాల భాగస్వాములు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి రోజు 25 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. అందరూ ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు. ‘లేపాక్షి’ కార్యక్రమానికి కొనసాగింపుగా ఎంపికచేసిన 5 జిల్లాల్లోనూ యోగాసనాల కార్యక్రమాలు కొనసాగాయి. అన్ని రకాల వయస్సుల వారు ఈ కార్యక్రమాల్లో అనందోత్సహాల మధ్య పాల్గొంటున్నారు. కోటి మందిని యోగాసనాల కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. యోగాంధ్ర పోర్టల్ ద్వారా తొలి రోజు 25,000 మంది పేర్లు నమోదు చేసుకున్నారు పేర్ల నమోదు రానున్న రోజుల్లో మరింత ఊపందుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ నేడొక ప్రకటన జారీ చేశారు
5,992 మందికి శిక్షణ పూర్తి!
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి ఆదివారం వరకు యోగా మాస్టర్ల ట్రైనర్లు 5,922 మంది కిందటేడు మాదిరిగానే పేర్లు నమోదు చేసుకుని పూర్తిస్థాయిలో శిక్షణ పొందారు. వీరిలోని సీనియర్ మాస్టర్ల టైనర్ల ఆధ్వర్యంలోనే ఆదివారం నుంచి కొత్త వారికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 2.5 లక్షల మందికి ఈ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీరిలో ఆదివారంనాడు 50,752 మంది యోగా మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ పొందారు. ఈ కేటగిరిలోని వారికి 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి.
జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు:
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా జరిగిన రాష్ట్ర స్థాయి ప్రారంభ కార్యక్రమంలో 1,952, కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో 625, కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ లో 758, తిరుపతిలోని ఎస్వీ జూ పార్కు ఆవరణలో 2,150, మంది చొప్పున పాల్గొన్న యోగాసనాల కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి.
విజయవాడ, అమలాపురంలో థీమ్ బేస్డ్ యోగాసన కార్యక్రమాలు!
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగిన ఇతివృత్త ఆధారిత యోగా (థీమ్ బేస్డ్) కార్యక్రమంలో 1,000 మంది పోలీసులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుoబ సంక్షేమ శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. అమలాపురంలో జరిగిన కార్యక్రమానికి 845 మంది రైతుల హాజరయ్యారు.
మొదలైన పోటీలు!
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం 253 గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ‘యోగాసనాలు’ ప్రాధాన్యంపై నిర్వహించిన నిర్వహించిన పోటీల్లో 1700 మంది పాల్గొన్నారు. యోగ పై రకరకాల ఇతివృత్తాలతో 13 రోజులు పాటు ఈ పోటీలు జరుగుతాయి.
వైద్య కళాశాలల్లోనూ…
డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు జిల్లా అధికారులకు పంపిన ఆదేశాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా యోగాసన కార్యక్రమాలను జరపాలని వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.. అలాగే… ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలలో యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లకు ఆదేశాలు పంపారు. ఈ నెల 20వ తేదీ వరక ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వైద్య విద్యార్థులను యోగాసన కార్యక్రమాల్లో మమేకం చేయాలని పేర్కొన్నారు. ప్రతి కళాశాలలో ఓ కో-ఆర్డినేటర్ ద్వారా ఈ కార్యక్రమాల పర్యవేక్షణ జరగాలని, నిర్వహణ వివరాలతో ఈ నెల 22వ తేదీ నివేదించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

















































