ఎపి వైద్య ఆరోగ్యశాఖ-ప్రజలకు ఆరోగ్య వంతమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యం
మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ కమీషనర్ జె.నివాస్
14 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ల కొనుగోలుకు చర్యలు
అమరావతి: ప్రజలకు ఆరోగ్యవంతమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించటమే లక్ష్యంగా భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) నిబంధనలకనుగుణంగా మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ వాహనాలను రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమీషనర్ జె. నివాస్ శుక్రవారం మంగళగిరి ఎపిఐఐసి టవర్స్ ప్రాంగణంలో పరిశీలించారు. ల్యాబ్ లో ఎలాంటి పరీక్షలు చేస్తారని ఐపిఎం డైరెక్టర్ పూర్ణచంద్రరావు ను అడిగి తెలుసుకున్నారు. ఆహార పదార్ధాలలో కల్తీని పరీక్షించే ప్రక్రియలో ఈ మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ సరికొత్త అధ్యాయమని ఈ సందర్భంగా ఆయన నివాస్ పేర్కొన్నారు. ఆహారంలో కల్తీని అక్కడికక్కడే పరీక్షించి వెంటనే నివేదికను అందచేస్తారన్నారు.
ఆహార పదార్ధాలలో కల్తీపై వినియోగదారులు, స్కూల్ పిల్లలకు ఈ వాహనాల ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా 80 రకాల ఆహార పదార్ధాలను పరిశీలించే వీలుందని ఆయన వివరించారు. మారుమూల ప్రాంతాలనుండి సేకరించిన పాలు, తదితర పానీయాల శాంపిళ్లను ఈ వాహనంలో వున్న ఇంకుబేటర్ ద్వారా తరలించి సమీపంలో ని టెస్టింగ్ ల్యాబుల్లో పరీక్షిస్తారని తెలిపారు. ఫుడ్ పాయిజనింగ్, నీటిద్వారా వ్యాపించే వ్యాధుల శాంపిళ్లను కూడా భద్రపరచి సమీపంలోని పరీక్షా కేంద్రానికి తరలిస్తారన్నారు. ముందుగా నాలుగు జోన్లకు నాలుగు వాహనాలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలో మరో 10 వాహనాలను కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు.
ప్రముఖుల పర్యటనలు, జాతరలు, పండుగల సందర్భంగా ఈ మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లలో ఆహార పదార్థాల్ని ఈ మొబైల్ ల్యాబుల్లో పరీక్షలు నిర్వహిస్తారని నివాస్ వివరించారు.