Nara Lokesh : నడిచి.. నడిపించి!
226 రోజులు… 3,132 కిలోమీటర్ల దూరం… ఆంక్షలు, అడ్డంకులను అధిగమించి టీడీపీ యువ నేత నారా లోకేశ్ చేసిన పాదయాత్ర ఫలించింది.
ఫలించిన లోకేశ్ పాదయాత్ర
3,132 కి.మీ. సాగిన ‘యువగళం’
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం
226 రోజులు… 3,132 కిలోమీటర్ల దూరం… ఆంక్షలు, అడ్డంకులను అధిగమించి టీడీపీ యువ నేత నారా లోకేశ్ చేసిన పాదయాత్ర ఫలించింది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం స్తబ్ధుగా ఉన్న సమయంలో యువగళం పేరుతో నిర్వహించిన పాదయాత్రతో నిప్పులు చిమ్మారు. పార్టీ శ్రేణుల్లో ఒక ఊపు తెచ్చి ఉత్సాహాన్ని నింపారు. అసెంబ్లీ ఎన్నికల సమరానికి వారిని సన్నద్ధం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో విస్మరించలేని రాజకీయ శక్తిగా ఆయన నిలదొక్కుకున్నారు. అధికార పార్టీ పెట్టిన ఒత్తిడిని తట్టుకోవడం… అవసరం అయినప్పుడు ముందుకు దూకడం… పదునైన విమర్శలతో ప్రత్యర్థులపై దాడి చేయడం… కింది స్థాయి నేతలు, కార్యకర్తలతో కలిసిపోవడం… వంటివి పాదయాత్ర తర్వాత లోకేశ్ పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో ఆకర్షణ పెంచాయి. ఇవన్నీ అసెంబ్లీ ఎన్నికల పోరాటంలో పార్టీకి టానిక్‌గా పనిచేశాయి. గత ఏడాది జనవరి 27వ తేదీన తన తండ్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. యాత్ర పదకొండు ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగింది. 232 మండలాలు, మునిసిపాలిటీలు, 2028 గ్రామాలను ఆయన సందర్శించారు. పాదయాత్రల రాజకీయ ప్రభావంపై ప్రత్యక్ష అనుభవం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను సాఫీగా సాగనీయలేదు. పాదయాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకే రాజకీయ పార్టీల కార్యకలాపాలపై అనేక ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 1 తీసుకువచ్చింది. ఈ జీవో ఆధారంగా లోకేశ్ పాదయాత్రను నిర్వీర్యం చేయడానికి పోలీస్ శాఖ ద్వారా వైసీపీ విశ్వప్రయత్నం చేసింది. ప్రజలు చూడటానికి ఒక వేదిక కూడా ఏర్పాటు చేసుకోనివ్వలేదు. చిత్తూరు జిల్లాలో మాట్లాడుతుండగానే పోలీసులు ఆయన చేతిలో మైకు లాక్కొని వెళ్లిపోయారు. ఒక స్టూలు మీద నిలబడి మాట్లాడుతుంటే ఆ స్టూలు కూడా తీసుకెళ్లిపోయారు. ఇటువంటి అనుభవాలు ప్రతిపక్ష పాత్రలో లోకేశ్‌ను రాటుదేల్చాయి. ఆయన పాదయాత్ర పొడవునా అధికార పార్టీ వైఫల్యాలు, అరాచకాలపై పదునైన విమర్శలతో బలమైన దాడి చే శారు. విమర్శలకు స్పందన కూడా బాగా వచ్చింది.
రెడ్‌బుక్… ఓ సంచలనం
పాదయాత్రలో లోకేశ్ ప్రదర్శించిన రెడ్‌బుక్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అధికార పార్టీకి అపరిమిత సేవ చేసి ప్రతిపక్షాలను… ప్రతిపక్ష శ్రేణులను వేధించిన వారి వివరాలను ఈ రెడ్‌బుక్‌లో రాస్తున్నానని, ఇందులోకి ఎక్కిన వారిని వదిలిపెట్టేది లేదని ప్రతి సభలో లోకేశ్ ప్రకటించారు. ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తున్నారో తెలియకపోయినా ఈ ఐదేళ్లు అణిచివేతకు గురైన టీడీపీ శ్రేణులు దీని పట్ల విశేషంగా ఆకర్షితులయ్యారు. వారిలో మనోస్థయిర్యం పెరగడానికి ఇది దోహదం చేసింది. తమను వేధించిన వారిని లోకేశ్ వదిలిపెట్టరన్న నమ్మకాన్ని కూడా కలిగించింది. రెడ్‌బుక్ పేరుతో లోకేశ్ అధికారులను బెదిరిస్తున్నారంటూ సీఐడీ పోలీసులు కోర్టును కూడా ఆశ్రయించారు. ఎంత ఒత్తిడి వచ్చినా… ఎన్ని సమస్యలు వచ్చినా వెనక్కు తగ్గకపోవడం లోకేశ్ నాయకత్వ సామర్థ్యానికి ప్రతీకగా నిలిచింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సరాసరిన ప్రతి ఇరవై కిలోమీటర్లకు ఒకటి చొప్పున పాతిక కేసులు యువగళం పాదయాత్రపై నమోదయ్యాయి. అయునా లోకేశ్ జంకలేదు.
ప్రతి వంద కి.మీ.కు ఒక హామీ ఫలకం
పాదయాత్రలో లోకేశ్ అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. పాదయాత్రలో ప్రతి వంద కిలోమీటర్లకు ఒక శిలా ఫలకం ఏర్పాటు చేయించారు. కేవలం పాదయాత్ర శిలాఫలకంగా కాకుండా ఆ ప్రాంతానికి చెందిన ఒక సమస్యకు హామీ ఇస్తూ వేయించడం విశేషం. ఇప్పటివరకూ రాష్ట్రంలో అనేకమంది పాదయాత్రలు చేసినా ప్రజల సమస్యలపై హామీలతో శిలాఫలకాలు వేయించిన వారు లేరు. సెల్ఫీ చాలెంజ్ అనే మరో కొత్త తరహా ఆలోచనను కూడా లోకేశ్ పాదయాత్రలో అమలు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు, వచ్చిన పరిశ్రమల వద్ద నిలబడి సెల్ఫీ తీసుకొని ఇలాంటి కార్యక్రమం ఏదైనా వైసీపీ పభుత్వం చేసుంటే చూపించాలని సామాజిక మాధ్యమాల వేదికగా సవాల్ విసిరారు. తిరుపతి ఎలక్ర్టానిక్స్ పరిశ్రమలు, కియా కార్ల ఫ్యాక్టరీ వద్ద ఆయన సెల్ఫీ చాలెంజ్‌లు విసిరారు. కానీ అధికార పక్షం నుంచి ఏ సమాధానం రాలేదు. సెల్ఫీ విత్ లోకేశ్ పేరుతో మరో కార్యక్రమాన్ని కూడా ఆయన యాత్ర పొడవునా అమలు చేశారు. తాను ఎక్కడ రాత్రి బస చేస్తే అక్కడ ఉదయం పూట ఎన్ని వందల మంది వచ్చినా వారితో సెల్ఫీలు దిగేవారు. ఒక్కో రోజు ఇలా వచ్చే వారి సంఖ్య వెయ్యి దాటిపోయేది. అయినా ఎవరినీ నిరాశపర్చకుండా అందరితో ఫొటోలు దిగేవారు. ఇవన్నీ లోకేశ్‌ను పార్టీ కేడర్‌కు సన్నిహితుడిగా మార్చాయి.
ఊహించని అనుభవాలు
పాదయాత్ర సమయంలో లోకేశ్‌కు ఊహించని అనుభవాలు ఎదురయ్యాయి. ఈ యాత్ర నడుస్తున్న సమయంలో మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ మూడింటిలోనూ టీడీపీ విజయం సాధించింది. ఈ విజయంలో పాదయాత్ర ప్రభావం కొంత ఉందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఏర్పడింది. యాత్ర మధ్యలో అనూహ్యంగా చంద్రబాబు అరెస్టు జరిగింది. దీంతో యాత్రకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఆయన విడుదల తర్వాత మళ్లీ యాత్ర కొనసాగింది. కానీ ముందు అనుకొన్నట్లుగా ఇచ్చాఫురం వరకూ వెళ్లకుండ విశాఖ సమీపంలోనే పూర్తి చేశారు.
నా బాధ్యత పెరిగింది కక్ష సాధింపులకు దిగబోం: లోకేశ్
మంగళగిరి, జూన్ 4: మంగళగిరి ప్రజలిచ్చిన ఘన విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందని నారా లోకేశ్ అన్నారు. రిటర్నింగ్ అధికారి రాజకుమారి నుంచి డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ విజయాన్ని మంగళగిరి ప్రజలకే అంకితం చేస్తున్నానని అన్నారు. తాను ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తానని చెప్పారు. గతంలో నిబంధనలను ఉల్లంఘించిన అధికారులను ఉపేక్షించబోమని, అయితే.. కక్షసాధింపులు, వేధింపుల వంటి చర్యలకు దిగబోమని అన్నారు.