ఓటు వృథా కాలేదు
గతంలో ఓటంటే వేద్దాంలే… చూద్దాంలే అనుకున్నారు. కానీ ఈసారి రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోవడంతో ఎలాగైనా రాష్ట్రం కోసం ఓటేయాలన్న పట్టుదలతో కదలివచ్చారు.
అమరావతి, జూన్ 4 గతంలో ఓటంటే వేద్దాంలే… చూద్దాంలే అనుకున్నారు. కానీ ఈసారి రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోవడంతో ఎలాగైనా రాష్ట్రం కోసం ఓటేయాలన్న పట్టుదలతో కదలివచ్చారు. దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ఉన్నవారే కాదు… అమెరికా, ఆస్ర్టేలియా, ఐరోపా, అరబ్ దేశాల నుంచి వచ్చి మరీ ఓటేశారు. కేవలం ఒక్క ఓటు కోసం లక్షల్లో ఖర్చు చేసిన వారున్నారు. బస్సులు లేకపోయినా, టికెట్ ధర రెట్టింపైనా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల నుంచి తరలివచ్చి మరీ ఓటేశారు. వారి వ్యయప్రయాసలకు ఇప్పుడు ఫలితం లభించింది. ‘నా ఓటు వృథా కాలేదు’ అని వారు సంతృప్తిచెందేలా ఫలితం వచ్చింది. సాధారణంగానే హైదరాబాద్, ఇతర రాష్ర్టాల నుంచి ఏపీకి వచ్చి ఓట్లేసే వారిలో తెలుగుదేశం ఓటర్లే ఎక్కువగా ఉంటారు. ఈసారి కూటమికి ఓటేయడానికి అంతకు మించి, లక్షలాది మంది రాష్ర్టానికి వచ్చి ఓటేసి వెళ్లారు. సంక్రాంతి సమయంలో హైదరాబాద్ ఎలా ఉంటుందో ఈసారీ ఎన్నికల సమయంలోనూ అలానే ఉంది. ఇది చాలు, అక్కడి నుంచి ఎంతమంది ఓటు కోసం పోటెత్తారో అర్థం చేసుకోవడానికి. అందుకే రికార్డు స్థాయిలో దాదాపు 82 శాతం పోలింగ్ జరిగింది. అయితే దీనిని వైసీపీ తనకు అనుకూలంగా చెప్పుకోవడానికి ప్రయత్నించింది. ‘అలా వచ్చిన వారంతా కూటమి ఓటర్లేం కాదు. మా పథకాలు నచ్చి ప్రభుత్వాన్ని కొనసాగించుకోవడానికి అక్కడినుంచి వచ్చి మరీ ఓటేశారు’ అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే అదంతా అవాస్తవమని, బయటి రాష్ర్టాలు, దేశాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మంది కూటమికే ఓటేశారని ఈ ఫలితంతో తేలిపోయింది. ఎంతో శ్రమపడి వచ్చిన వారు ఈ ఫలితాలు చూసి సంబరాల్లో మునిగిపోయారు. అంత కష్టపడి వెళ్లి ఓటేసి వచ్చినందుకు కోరుకున్న విధంగా కూటమి అధికారంలోకి వచ్చిందని ఆనందపడుతున్నారు. హైదరాబాద్ నుంచి బస్సులు పెట్టి మరీ ఓటర్లను తీసుకొచ్చినవారూ ఇప్పుడు సంతోషపడుతున్నారు. ‘ఆ రోజు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో అనే ఆందోళనలోనే వచ్చాం. కానీ ఈరోజు ఆ కష్టమంతా మర్చిపోయేలా కూటమి విజయం సాధించింది’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.