ప్రవాసాంధ్రుల హర్షాతిరేకాలు
ఏపీలో టీడీపీ కూటమి ఘనవిజయంపై ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం అనేక మంది ఉద్యోగాలకు సెలవు పెట్టి తెల్లవారుజాము నుంచే టీవీల ముందు బైఠాయించారు.
ఏపీలో టీడీపీ కూటమి ఘనవిజయంపై ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం అనేక మంది ఉద్యోగాలకు సెలవు పెట్టి తెల్లవారుజాము నుంచే టీవీల ముందు బైఠాయించారు. కువైత్‌లో అనేక చోట్ల టీడీపీ అభిమానులు కేకులు కోస్తూ, విందు సంబరాలు జరుపుకొన్నారు. టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ సౌదీ నుంచి ఉండవల్లికి చేరుకొని చంద్రబాబు నివాసంలో సంబరాలలో పాల్గొన్నారు. ఆశించిన దానికంటె మెరుగ్గా ఫలితాలు వచ్చాయని టీడీపీ దుబాయి శాఖ అధ్యక్షుడు విశ్వేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు. నలుగురితో కలిసి ఫలితాలను ఆస్వాదించడానికి రియాధ్ నుంచి దుబాయికి వచ్చానని టీడీపీ జీసీసీ కోర్ కమిటీ సభ్యుడు ఖాదర్ బాషా చెప్పారు. కువైత్‌లో మంగళవారం మొదలైన సంబరాలు శుక్రవారం వరకు భారీ ఎత్తున కొనసాగనున్నట్లు టీడీపీ ప్రముఖుడు కోడూరి వెంకట్ వెల్లడించారు. సౌదీలో పల్నాడు ప్రాంతానికి చెందిన ప్రవాసులు భారీ విజయోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నాయకుడు షేక్ జానీ బాషా చెప్పారు. జనసేన అభిమానులు కూడా షార్జా, జుబేల్, మస్కట్‌లో సంబరాలు జరుపుకొన్నారు. జనసేన గల్ఫ్ విభాగం అధ్యక్షుడు చందనరాందాస్ నెల్లిమర్లలో గెలుపొందిన ఆ పార్టీ అభ్యర్థి మాధవిని కలిసి అభినందించారు.