మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు: సానా సతీష్
Jagan has no moral right to speak about women: Sana Satish
విజయవాడ, జూన్ 09:
సొంత తల్లి, చెల్లికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మహిళల గౌరవం గురించి మాట్లాడటం అత్యంత హాస్యాస్పదమని, ఆయనకు ఆ నైతిక హక్కు లేదని టీడీపీ రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్ తీవ్రంగా విమర్శించారు.
మంగళవారం విడుదల చేసిన వీడియో ప్రకటనలో ఆయన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో 11 మందికి రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చినా, కనీసం ఒక్క మహిళకైనా అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. మహిళల పట్ల నిజమైన గౌరవం ఉంటే అప్పుడే చూపించాల్సిందని అన్నారు.
పదవులు పంచేటప్పుడు మహిళలను పట్టించుకోని జగన్, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మహిళల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. “అప్పుడు మహిళలు గుర్తుకు రాని జగన్‌కు, ఇప్పుడు మహిళా సాధికారత గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది?” అని ప్రశ్నించారు.
రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ ప్రకటించినప్పటి నుంచి జగన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని సతీష్ పేర్కొన్నారు. మహిళా ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకు అబద్ధపు ప్రచారాలకు తెరలేపారని ఆరోపించారు.
సొంత తల్లిని విశాఖలో రాజకీయంగా ఓడించడం, చెల్లిని రాజీనామా చేయించడం వంటి ఘటనలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కుటుంబ సభ్యులకే గౌరవం ఇవ్వలేని వ్యక్తి రాష్ట్ర మహిళల గురించి మాట్లాడటం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు.
మహిళల సాధికారత, భద్రత, ఆర్థిక అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని సానా సతీష్ స్పష్టం చేశారు.
















































